పిట్టలవేమవరంలో కోళ్ల ఫారం, కోడిగుడ్లు
సాక్షి, పెరవలి(పశ్చిమగోదావరి) : కోడిగుడ్డు ధరలు గతేడాది ఊహించని రీతిలో పెరిగితే.. నెలరోజులుగా ధరల తగ్గటంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో ప్రతిరోజూ రెండు కోట్లు గుడ్లు ఉత్పత్తి అవుతుంటే రైతులకు రోజుకి రూ.1.80 కోట్లు నష్టం వాటిల్లితుందని గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం గుడ్డు ధర రూ.3.10 పైసలు పలకడంతో లాభాల మాట ఎలా ఉన్నా కనీసం మేత ఖర్చులకు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 18న రికార్డు స్థాయిలో గుడ్డు ధర రూ.5.32 పైసలు పలకగా ప్రస్తుతం రూ.3.10 పైసలు పలకటంతో లక్షలాది రూపాయిలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తరాదిన చలి తీవ్రత ఎక్కువగా ఉంటే గుడ్డు ధరలు పెరుగుతూ వచ్చేవి కానీ అక్కడ కూడా ఎండలు మండటంతో వీటి వినియోగం తగ్గిందని చెబుతున్నారు. గుడ్డు ధరలు తగ్గినా పిల్ల, మేత ధరల మాత్రం తగ్గకపోగా పైపైకి వెళుతున్నాయని దీంతో ఖర్చు అలాగే ఉందని వాపోతున్నారు. ప్రస్తుతం అమ్మకాలు అనూహ్యంగా తగ్గటంతో ఎగుమతులు నిలిచి నిల్వలు పెరిగిపోయాయి. దీంతో ధరలు పతనం కావటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో లాభాలు చూపించిన గుడ్లు ఇప్పడు రైతులు గుడ్లు తేలవేసేలా లక్షల్లో నష్టాలు వస్తున్నాయని వాపోతున్నారు. కూలీల ధరలు గతంలో ఒక్కొక్కరికి రూ.250 కూలీ ఇస్తే ప్రస్తుతం రూ.350 ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యుత్ చార్జీలు కూడా పెరిగాయని వాపోతున్నారు.
జిల్లాలో 486 మంది కోళ్ల రైతులు
జిల్లాలో కోళ్లరైతులు 486 మంది ఉండగా ఫారాలు సుమారు 25 వేల వరకు ఉన్నాయి. వెయ్యి కోళ్ల నుంచి 5 లక్షల కోళ్ల వరకు సామర్థ్యం గల ఫారాలు జిల్లాలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే మేత ధరలు ఇటీవల బాగా పెరిగాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గుడ్డు ధర రూ.4కు పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. ఫారాలను నడపేందుకు లక్షలాది రూపాయలు పెట్టుబడులు అవుతున్నాయని, వ్యయప్రయాసలకోర్చి నడిపినా కనీసం గిట్టుబాటు కూడా కావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
తీవ్ర నష్టాలు
గుడ్డు ధరలు తగ్గాయి, పిల్ల ధరలు పెరిగాయి. దీని వలన రైతులకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. గత నవంబర్‌లో పిల్ల ధర రూ.33 ఉంటే ఇప్పుడు రూ.37 అయ్యింది. దీంతో ఒక పిల్లకి రూ.4 అదనపు భారమవుతోంది. గుడ్డు ధర నవంబర్‌లో రూ.5.32 పైసలు ఉంటే ఇప్పడు రూ.3.10 పైసలు ఉంది. దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
– భూపతిరాజు వరహా నర్సింహరాజు, ఖండవల్లి
లక్షల్లో నష్టపోతున్నాం
15 ఏళ్లుగా కోళ్లఫారం నిర్వహిస్తున్నా. ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదు. గతేడాది నవంబర్‌లో గుడ్డు ధర రూ.5.32కు చేరి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. కొద్దిరోజులుగా ధరల పతనం మొదలైంది. అయితే నిర్వహణ ఖర్చులు ఏమాత్రం తగ్గలేదు. దీంతో లక్షల్లో నష్టపోతున్నాం. 15 రోజులుగా రూ.3 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది.
– మండా తాతారెడ్డి, కోళ్ల రైతు, పిట్టలవేమవరం
Comments
Please login to add a commentAdd a comment