సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార హోరుకు నేటి సాయంత్రంతో తెరపడనుంది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఇప్పటివరకు హోరెత్తిన మైకులు ఇక మూగబోనున్నాయి. దీంతో ఇక పార్టీలన్నీ 11వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియపై దృష్టి సారించనున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లలో తలమునకలు కానున్నాయి. ఇదిలా ఉంటే.. ఈసారి ఎన్నికల ప్రచారం వేసవి ఎండలను మించి వాడివేడిగా కొనసాగింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీల కంటే ముందుంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయన సోమవారం వరకు 13 జిల్లాల్లో కలిపి 64 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇంకోవైపు జగన్ సోదరి షర్మిల విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్ విజయమ్మ సోమవారం నాటికి ఏడు జిల్లాల్లో 25 ఎన్నికల సభల్లో ప్రచారం నిర్వహించగా.. షర్మిల ఐదు జిల్లాల్లో 33 ఎన్నికల సభల్లో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్, విజయమ్మ, షర్మిల తమ ప్రసంగాల్లో.. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో స్పష్టంగా చెబుతూనే, మరోవైపు చంద్రబాబు గత ఎన్నికల హామీలను అమలుచేయకుండా ఎలా మోసం చేశారో వివరిస్తూ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం ఐదేళ్ల తన పాలనాకాలంలో తాను చేసిన పనులను చెప్పకుండా కేవలం ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలకు దిగారు. అంతేకాక.. లేని పొత్తులు ఉన్నట్లుగా చూపి వైఎస్సార్‌సీపీపై అసత్య ఆరోపణలకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతానని చెప్పడంపై అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మరోవైపు.. చంద్రబాబు చెబుతున్న అసత్యాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తల్లి విజయమ్మ సూటిగా ప్రశ్నిస్తుండడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.చంద్రబాబు ఎలా అబద్ధాలు చెబుతున్నారో ప్రజల్ని ఆలోచింపచేసేలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిరుద్యోగులను ఆకట్టుకునేలా షర్మిల ప్రసంగాలు దూసుకుపోతున్నాయని చెబుతున్నారు.
చేసింది చెప్పుకోలేని స్థితిలో బాబు.. జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలతో కాలం..
చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తన ఐదేళ్ల పాలనలో ఈ పనులు చేసినందున తిరిగి తనకు ఓటు వేయమని అడగడం లేదు. గత ఎన్నికల్లో తానిచ్చిన ప్రధాన హామీలను ఆయన అమలు చేయలేదు కాబట్టే.. తన పాలన గురించి ఏమీ చెప్పుకోలేకపోతున్నారు. అందుకే ప్రతిపక్ష నేత జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలకు, దూషణలకు పాల్పడుతున్నారని ఉద్యోగస్తులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీతో జగన్‌కు పొత్తు అంటూ చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అలాగే ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి స్పందన కరువవడం, సభలన్నీ పేలవంగా సాగుతుండడంతో ఏదోరకంగా సానుభూతి పొందాలనే తాపత్రయంతో చంద్రబాబు తన పోలీసుల ద్వారా తన పార్టీకి చెందిన నేతలపై దాడులు చేయించుకుంటూ ఐటీ దాడులంటూ డ్రామాలకు దిగి గగ్గోలు పెట్టడంపైనా ప్రజల్లో ఛీత్కారం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికల సంఘం నిర్ణయాలను కూడా అడ్డుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను పట్టణ ప్రాంత ప్రజలు ఛీకొడుతున్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవగౌడ, ఢిల్లీ సీఎం క్రేజీవాల్‌లను చంద్రబాబు రాష్ట్రానికి రప్పించి ప్రచారం చేయించి ప్రతిపక్ష నేతపై బురద జల్లేందుకు ప్రయత్నించారు. ఇంకోవైపు చంద్రబాబు పార్టనర్, యాక్టర్ పవన్‌కల్యాణ్ సైతం బీఎస్పీ అధినేత్రి మాయావతిని రప్పించి ప్రచారం నిర్వహించారు.
సీఎం సభలు పేలవం.. జగన్ సభలకు పోటెత్తుతున్న జనం
ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రచార సభలు పేలవంగా.. ఎటువంటి స్పందన లేకుండా కొనసాగాయి. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల సభలకు జనం పోటెత్తడమేగాక వారి ప్రసంగాలకు విశేష స్పందన లభిస్తోంది. గతంలో పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలతోపాటు పాదయాత్ర ద్వారా ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఆచరణ సాధ్యమైన హామీలతో ఎన్నికల ప్రణాళికలో సూటిగా, చాలా స్పష్టంగా చెప్పడాన్ని విద్యావంతులతోపాటు అధికార వర్గాలు మెచ్చుకుంటున్నాయి.
ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించేలా జగన్ ఎన్నికల ప్రణాళికను రూపొందించారని, ముఖ్యంగా విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల వారి నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అంతేగాక జగన్ ఎవరినీ వ్యక్తిగతంగా నిందించకుండా.. తాను చేసేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, అదే సమయంలో గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని ఎలా మోసం చేశారో సవివరంగా, ఆలోచింపచేసేలా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడం పట్ల విద్యావంతులు మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment