ప్రభుత్వ కార్యాలయాల వద్ద పథకాల ప్రచార బోర్డులు, హోర్డింగ్స్, పోస్టర్లు
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాల హోర్డింగ్స్‌లో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు తొలగించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లలోని పథకాల వివరాలను తీసేయాలని ఆదేశించింది. అయితే నియమావళి అమలు జిల్లాలో ఘోరంగా తయారైంది. ఆపధర్మ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నివాసానికి వెళ్లే కృష్ణా కరకట్టపై పథకాల ప్రచార బోర్డులు ఎప్పట్లానే సోమవారం కూడా దర్శనమిచ్చాయి. మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా కుట్టుమిషన్లు ఆదివారం అర్ధరాత్రి వేళ పంపిణీ చేశారు. రెంటచింతలలో సిమెంట్ రోడ్ల పనులు ప్రారంభించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.
రేపల్లె(నగరం): సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ పథకాలతో కూడిన బోర్డులు నియోజకవర్గంలో దర్శనమిస్తూనే ఉన్నాయి. రాజకీయ నాయకుల విగ్రహాలు ముసుగులు లేకుండా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మండలంలోని శిరిపూడి, ఏలేటిపాలెం గ్రామాల్లో రహదారుల వెంట ప్రభుత్వ పథకాల ప్రచార బోర్డు ఉన్నాయి. నగరం మండలం మంత్రిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు వేయలేదు.
ఎటు చూసినా పథకాల బోర్డులే
గుంటూరు నగరంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పథకాల ప్రచార బోర్డులు, హోర్డింగ్స్, పోస్టర్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఎన్నికల సంఘం విధించిన నిబంధనలను వెక్కిరిస్తున్నాయి.
–సాక్షి, ఫొటోగ్రాఫర్, గుంటూరు
గుంటూరు నగరంలో అర్ధరాత్రి కుట్టు మిషన్ల పంపిణీ
భట్టిప్రోలు: ఎన్నికల వేల అధికార పార్టీ తాయిలాల ఎర ఆరంభించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ భట్టిప్రోలు మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలుతో పాటు అమృతలూరు, చుండూరు, కొల్లూరు మండలాలలో సుమారు ఐదు వేల కుట్టు మిషన్లు మహిళలకు అందజేశారు. మంత్రి నక్కా ఆందబాబుకు ఓటు వేయాలని హుకుం జారీ చేశారు. ఇందు కోసం ఆయా గ్రామాల్లోని యానిమేటర్లకు పంపిణీ బాధ్యతలు అప్పచెప్పారు. ఇదే అదనుగా భావించిన యానిమేటర్లు ఒక్కో లబ్ధిదారుని వద్ద నుంచి రూ 250 నుంచి 300 వసూలు చేశారు. ఈ విషయమై భట్టిప్రోలు ఇన్‌చార్జి ఏపీఎం పెనుగొండ నరేంద్రను ‘సాక్షి’ వివరణ కోరగా, పంపిణీకి సంబంధించి మండల సమాఖ్యకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఐతే కుట్టుమిషన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వాటిని అందించేందుకు ఎస్సీ కార్పొరేషన్ వారు పంపిణీ బాధ్యతలు అప్పగించడం జరిగిందని చెప్పుకొచ్చారు. టైలరింగ్ శిక్షణ ఇచ్చిన కొమర్ బేగం ఫిటింగ్ చార్జీల కింద ఆ మొత్తం వసూలు చేసినట్లు తెలిపారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వగానే కుట్టు మిషన్లు పంపిణీ చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రోడ్డు పనులకు శంకుస్థాపన
నడికుడి(దాచేపల్లి): నడికుడి పంచాయతీ పరిధిలోని అంజనపురం కాలనీలో రోడ్డు నిర్మాణం పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అంజనపురం కాలనీలో రోడ్డు పనులు చేయటం కోసం అఘమేగాల మీద టీడీపీ నాయకులు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. కాలనీలో ఉన్న పలువురు వ్యక్తులను పిలిపించి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా కొబ్బరికాయలు కొట్టించారు. అనంతరం ప్రొక్లెయిన్‌తో గుంతలుగా ఉన్న రోడ్డును చదును చేయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా టీడీపీ నాయకులు పనులు చేపట్టడం ఉల్లంఘన కిందకు వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.
కోడ్ అమల్లో ఉన్నా సీసీ రోడ్ల నిర్మాణం
రెంటచింతల: ఎన్నికల కోడ్ అమలులో నిక్కచ్చిగా వ్యవహరిస్తామని ఓ పక్క అధికారులు చెబుతున్నా అమలులో మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. టీడీపీ నాయకులు కోడ్ గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో సిమెంటు రోడ్డు నిర్మాణాలు, బోర్ల ఏర్పాటు వంటి పనులు చేస్తున్నారు. గతంలో నిధులు మంజూరయిన పనులను కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తున్నారు. ఇదెక్కడి చోద్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అధికార పార్టీకి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గొంటు సుమంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌తో పనిలేదన్నట్లు తన పని తాను చేసుకునిపోతున్నాడు. గతేడాది రెంటచింతలలోని పోలీస్ స్టేషన్ రోడ్డు నిర్మాణానికి నరసరావుపేట ఎంపీ నిధులు, ఉపాధి హామీ పథకం కింద రూ.40 లక్షలు మంజూరయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ సమయంలో ఈ సీసీరోడ్డుకు ఉన్న రెండు లింక్ రోడ్ల నిర్మాణం రూ.10 లక్షలతో సోమవారం చేపట్టారు. ఏడాది కిందట మంజూరైన నిధులతో ఎన్నికలకోడ్ వచ్చిన వెంటనే లింక్ రోడ్లు పేరుతో ఇప్పుడు పనులు ఎలా చేపట్టారని పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాస్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చేపట్టిన పనులు నిలిపివేయాలని సూచించినట్లు తెలిపారు. అలాగే ఎన్నికలకోడ్ ఉల్లంఘించి గ్రామంలో చేపట్టిన ఆంజనేయస్వామి మాన్యం కాలనీకి వెళ్లే ముఖద్వారం నిర్మాణానికి కూడా ఎలాంటి తీర్మానం, అధికారిక అనుమతులు ఇవ్వలేదని స్థానిక అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment