నోటిఫికేషన్ విడుదలైంది! రిలీఫ్‌గా ఫీల్ అయ్యాడు ఎన్నికల కమిషనర్.
‘‘ఎందుకు సార్.. రిలీఫ్‌గా ఫీల్ అయ్యారు మీరు?’’అని అడిగాడు కమిషనర్‌గారి కార్యదర్శి.
‘‘నేను రిలీఫ్‌గా ఫీల్ అయిన మాట నిజమే కానీ, రిలీఫ్‌గా ఫీలైనట్లు నీకు చెప్పలేదు కదా, ఎలా కనుక్కున్నావ్ రిలీఫ్‌గా ఫీల్ అయ్యానని’’ అన్నాడు కమిషనర్.
‘‘ఎప్పుడూ ఫీల్ అవుతుండేవాళ్లు, సడన్‌గా ఫీల్ అవడం మానేస్తే రిలీఫ్ ఫీలైనట్టే కదా సార్’ అన్నాడు కార్యదర్శి.
‘‘ఐ లైక్ యువర్ నాలెడ్జ్’’ అన్నాడు కమిషనర్.
కార్యదర్శికి సంతోషం వేసింది. ‘‘అవున్సార్.. ఎందుకు రిలీఫ్ ఫీలయ్యారు?’’ అని అడిగాడు.
‘‘నువ్వే కనుక్కో. కనుక్కున్నానని నాకు చెప్పేందుకు మళ్లీ రాకు. కాసేపు ఒంటరిగా రిలీఫ్ ఫీలవనివ్వు నన్ను’’ అన్నాడు కమిషనర్.
కార్యదర్శి వెళ్లిపోయాక, కొద్దిసేపు కళ్లు మూసుకుని తెరిచాడు కమిషనర్. ఆ తర్వాత ఫైల్ తెరిచాడు. ఫిర్యాదుల ఫైల్ అది.
మొదట కుప్పం ఫిర్యాదు చేతికి తగిలింది. రామకుప్పం మండలం నుంచి వచ్చింది. కంప్లయింట్ ఎవరిదా అని చూశాడు. టీడీపీ వాళ్లది. కంప్లయింట్ ఎవరి మీదా అని చూశాడు. వైఎస్సార్‌సీపీ మీద.
‘‘సార్.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఫ్యాన్‌లన్నింటినీ తక్షణం తొలగించాల్సిందిగా మేము కోరుతున్నాము. మా ప్రత్యర్థి పార్టీది ‘ఫ్యాన్’ గుర్తు కనుక.. ఫ్యాన్‌కి ఓటేస్తేనే రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతాయి అని ఓటర్లు అనుకునే ప్రమాదం ఉంది. మా పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉంది.’’
రెండో కంప్లయింట్ తీసి చూశాడు కమిషనర్. అదీ టీడీపీ వాళ్లదే.
బుద్ధా వెంకన్న, యామిని, గౌతు శిరీష, సతీశ్ అనే వాళ్ల సంతకాలున్నాయి.
కంప్లయింట్ ఎవరి మీదా అని చూశాడు. రామ్‌గోపాల్ వర్మ మీద. ఇన్‌డైరెక్టుగా అదీ వైఎస్సార్‌సీపీ మీదే.
‘‘సార్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకుండా నిలిపివేయగలరు. సినిమా విడుదలైతే.. సినిమాలో బాబు గురించి ఉన్నది ఉన్నట్లు చూపించారు అని ప్రేక్షకులు అనుకునే ప్రమాదం ఉంది. ప్రేక్షకులు అలా అనుకుంటే కనుక పోలింగ్ రోజు చంద్రబాబుకు ఓటేయడానికి వచ్చేవారి కన్నా, చంద్రబాబును చూడ్డానికి సినిమాహాళ్లకు వెళ్లే ఓటర్లే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.’’
మూడో కంప్లయింట్ తీసి చూశాడు కమిషనర్. కంప్లయింట్ ఎవరిదా అని చూశాడు. టీడీపీ వాళ్లది. అదీ వైఎస్సార్‌సీపీ మీదే. కంప్లయింట్ చేసినవాళ్లెవరా అని చూశాడు. అంతా పెద్దవాళ్లు! టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పి.కృష్ణయ్య!! ‘సాక్షి’ పేపర్ పైన, ‘సాక్షి’ చానల్ పైన చర్య తీసుకోవాలని వారి ఫిర్యాదు.
ఇంకో కంప్లయింట్ తీసి చూశాడు కమిషనర్. ఇంకో కంప్లయింట్.. ఇంకో కంప్లయింట్.. ఇంకో కంప్లయింట్.. అన్నీ టీడీపీవే. అన్నీ వైఎస్సార్‌సీపీ మీదే!
సడన్‌గా టీవీలో బ్రేకింగ్ న్యూస్ మొదలైంది. ‘ఏంటా!’ అని చూశాడు. అంతకు ముందొచ్చిన న్యూసే! ఇక రోజంతా అదే బ్రేక్ అవుతూ ఉంటుంది అనుకున్నాడు కమిషనర్.
‘‘క్షణం తీరిక లేని చంద్రబాబు.. బ్యాంగ్ బ్యాంగ్! ఒకే రోజు నాలుగు జిల్లాల్లో పర్యటన.. బ్యాంగ్ బ్యాంగ్. పూర్తి కాని టీడీపీ జాబితా.. బ్యాంగ్ బ్యాంగ్. నోటిఫికేషన్ విడుదలతో ఉరుకులు పరుగులు.. బ్యాంగ్ బ్యాంగ్’’. ‘‘ఇందుకే కదా సార్.. మీరు రిలీఫ్ ఫీలైంది. ఇంక వాళ్లకి కంప్లయింట్‌లకు వచ్చే టైమ్ ఉండదనేగా’’ అన్నాడు కార్యదర్శి సడన్‌గా లోపలికి వచ్చి!
‘‘నాలెడ్జ్‌ని అస్తమానం ప్రదర్శించుకోకూడదయ్యా. వెళ్లు’’ అన్నాడు కమిషనర్.. కంప్లయింట్ ఫైల్‌ని నీట్‌గా ఒక పక్కన సర్దిపెట్టి.
సర్దిపెట్టాక మరింత రిలీఫ్ ఫీలయ్యాడు కమిషనర్. – మాధవ్
Comments
Please login to add a commentAdd a comment