సాక్షి, అమరావతి :ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో అభ్యర్థుల రోజువారి ప్రచారంపై ఎన్నికల సంఘం నిఘా నేత్రంతో పర్యవేక్షించటం కోసం సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులు రోజువారి ప్రచార శైలిలో వారి వెంట ఉంటూ, ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘానికి వివరాలను అందజేయనున్నారు. గతంలో టోల్ ఫ్రీ నెంబర్ 1950, ఈ మెయిల్, ఫ్యాక్స్, తపాలా శాఖ ద్వారా ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు వీటికి అదనంగా సీ విజిల్ యాప్ ద్వారా నేరుగా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దీంతో నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే విధంగా పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించటం సులువుకానుంది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నేతలతో కలిసి ప్రచారం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీ, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించటం, అనుమతి లేనిదే వాహనాల ర్యాలీలు నిర్వహించటం, మారణాయుధాలు కలిగి ఉండడం, ఓటర్లను ప్రలోభ పెట్టే వస్తువులను పంపిణీ చేయటం, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. దీంతో ఇతర పార్టీలలో షాడో టీంలూ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా వారి కోడ్ ఉల్లంఘన విషయాలను ఎన్నికల సంఘంకు చేరవేసే అవకాశం ఉండనుంది. దీంతో అభ్యర్థులు ఎవరిని నమ్మాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
అనుమతుల కోసం సువిధ యాప్
ఎన్నికల సమయంలో పార్టీల అభ్యర్థులకు ప్రతి నిమిషం విలువైందనే కోణంలో ఎన్నికల సంఘం సువిధ అనే యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం ఈ యాప్ పై స్పష్టత ఇచ్చింది. అభ్యర్థులు ఎన్నికల ప్రచార సభలు, ప్రదర్శనలకు ఆయా శాఖల అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున ఎన్నికల హడావుడిలో అధికారులు స్పందించకుంటే వారు వెనకబడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ లు సువిధ యాప్ ద్వారా అనుమతులు పొందడానికి అవకాశం కల్పించింది. 48 గంటల ముందే అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అధికారులు అనుమతిస్తారు. అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
నిఘా నేత్రం సీ విజిల్ యాప్
ఎక్కడైనా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే సాధారణ ప్రజానీకం సైతం స్పందించి, సీ విజల్ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. దీనిని గూగూల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇటువంటి యాప్‌ల వల్ల... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన అభ్యర్థుల గుట్టు రట్టు చేసే అవకాశం సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment