నిడదవోలులో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్ ఎల్ జోసెఫ్
నిడదవోలు రూరల్: ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ వెలువడింది. ఈ ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త విధానాలు అవలంభిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి గతానికి భిన్నంగా వెబ్‌సైట్‌లు, యాప్‌లు రూపొందించింది. సాంకేతిక పరిజ్ఞానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇంకా నెలరోజుల్లోనే ఎన్నికలు జరగనుండడంతో ఓటర్లు తమ హక్కును వినియోగించుకునే క్రమంలో ఏమైనా ఇబ్బందులుంటే నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేస్తే కొన్ని గంటల్లోపే సమస్య పరిష్కరించనున్నారు.
ఓటు ఆన్‌లైన్‌లోనే నమోదు
ఎన్నికల సమయానికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు ఓటు దరఖాస్తు కోసం ఆన్‌లైన్ ప్రక్రియను ప్రారంభించారు. దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌లో వాటిని నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఓటు హక్కు నమోదు చేసుకునేలా ఓటర్ హెల్ప్‌లైన్ పొర్టల్ యాప్‌ను ఎన్నికల సంఘం రూపొందించింది. ఈ పోర్టల్‌లో మన దరఖాస్తు ఏ స్టేజీలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. అధికారులు దరఖాస్తులు పరిశీలించి ఆమోదిస్తే ఓటరు గుర్తింపు కార్డును సర్వీస్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానంతో కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు ఇచ్చే అవసరం పూర్తిగా తీరనుంది.
వీవీ ప్యాట్ విధానంతో..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు రాకముందు ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ చిటీలపై ఓటు వేసేవారు. తర్వాత ఈవీఎంలు వచ్చాయి. అయితే చాలా మందిలో తాము ఓటు ఎవరికి వేశామో తెలియక తికమకపడేవారు. ప్రతిపక్షాలు ఫలితాల అనంతరం ఈవీఎంలో ఒకేవైపు ఓట్లు వచ్చాయంటూ ఆరోపణలు చేసేవారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం వీవీ ప్యాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఓటరు తమ ఓటు ఎవరికి వేశారో తెలుసుకోవచ్చు. ఓటు వేశాక వీవీ ప్యాట్ నుంచి రశీదు వస్తుంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాల్లోని ఓటర్లకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు వీవీ ప్యాట్‌ల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఫిర్యాదు చేసేందుకుసి–విజిల్ యాప్
ఎన్నికల సమయంలో బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారికి తాయిలాలు అందిస్తుంటారు. మద్యం, డబ్బులు పంపిణీ చేసి వారిని ప్రలోభాలకు గురిచేస్తారు. ఇలా ఓటర్లకు తాయిళాలు ఇచ్చే అభ్యర్థులపై గతంలో సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. ఓటర్లు నేరుగా ఫిర్యాదు చేస్తేనే అధికారులు విచారణ చేపట్టేవారు. ఇకపై అభ్యర్థుల ఆగడాలను అరికట్టేందుకు ఎన్నికల సంఘం సి–విజిల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో అభ్యర్థులు, అనుచరులు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్న ఫొటోలు, వీడియోలు తీసి పంపించవచ్చు. ఈ యాప్ ద్వారా వచ్చిన వాటిని అధికారులు పరిశీలించి ఈ విధానానికి పాల్పడ్డ అభ్యర్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల సమయంలో ఓటర్ల సందేహాలు తీర్చేందుకు ఇప్పటికే డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లాస్థాయిలో కలెక్టర్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు స్మార్ట్ ఫోన్‌లోనే “సమాదాన్‌యాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ప్రతి ఒక్కరు తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ప్రతి సమాచారం తెలుస్తుంది.
సరికొత్తగా ‘సుగమ్య’ యాప్
గతంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం నిర్వహించేందుకు అధికారులు వద్ద ముందస్తు అనుమతి తీసుకునేవారు. ప్రచారం కోసం ఏర్పాటు చేసుకునే వాహనాల వివరాలన్నీ ఎన్నికల అధికారుల వద్ద ఎప్పటికప్పుడు నమోదు చేయించుకునేవారు. అభ్యర్థులు ఏయే గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారో తెలుసుకునేందుకు ఎన్నికల అధికారులకు కొంత ఇబ్బందిగానే ఉండేది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వాహన వివరాల కోసం సుగమ్య యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌లో అధికారులు అభ్యర్ధుల ప్రచార వాహన రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ద్వారానే సుగమ్య యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రచార వాహనాల రాకపోకలు చూసుకోవచ్చు.
‘సువిధ’లో సభలకు అనుమతి
ఎన్నికల సమయంలో బరిలో నిలిచిన అభ్యర్థులంతా బహిరంగ సభలు నిర్వహిస్తారు. గతంలో ఈ సభల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సంబంధిత పోలీస్ అధికారుల అనుమతి తీసుకునేందుకు నిరీక్షించేవారు. ప్రస్తుతం సభల అనుమతి వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సువిధ యాప్‌ను రూపొందించింది. బహిరంగ సభల నిర్వహణ కోసం నెట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం 24 గంటల్లోగా అధికారులు ఈ యాప్‌లనే అనుమతి ఇచ్చే విధంగా నిబంధనలు రూపొందించారు. అభ్యర్థులు ఈ యాప్‌లో తమ బహిరంగ సభల అనుమతులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
ఓటర్లకు అవగాహన కల్పించాం
ఇప్పటికే ఈవీఎంలతో పాటు ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన వీవీ ప్యాట్ విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించాం. ఓటు వేసిక తరువాత ఏ అభ్యర్థికి వేశారో చూసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నాం. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాం.–ఎల్.జోసెఫ్, తహసీల్దార్, నిడదవోలు
Comments
Please login to add a commentAdd a comment