శిలాఫలకాలు మాత్రమే.. నిర్మాణాలు లేవు.. | Election Time Number Of Unfinished Monuments In PSR Nellore | Sakshi
Sakshi News home page

శిలాఫలకాలు మాత్రమే.. నిర్మాణాలు లేవు..

Published Wed, Apr 3 2019 10:34 AM | Last Updated on Wed, Apr 3 2019 10:35 AM

Election Time Number Of Unfinished Monuments In PSR Nellore - Sakshi

టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్ట్‌ కూడా జిల్లా ప్రజలకు అంకితం చేయలేకపోయింది. లోటు బడ్జెట్‌లోనూ సీఎం చంద్రబాబు వేల కోట్ల రూపాయలతో జిల్లాను అభివృద్ధి చేశామని టీడీపీ పాలకులు, నేతలు గప్పాలు కొట్టుకుంటుంటే.. అభివృద్ధి పేరుతో వేసిన శిలా ఫలకాలు సమాధి రాళ్లుగా వెక్కిరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులకు ప్రస్తుత ప్రభుత్వం రూపాయి నిధులు కేటాయించి పూర్తి చేసిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలోనూ జిల్లాలో ఒక్క మేజర్‌ ప్రాజెక్ట్‌కు కూడా పునాది పడిన దాఖలాలు లేవు. అన్ని శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. గ్రామాల్లో కేంద్రం విడుదల చేస్తున్న ఉపాధి హామీ నిధులతో పాటు, పంచాయతీల జనరల్‌ ఫండ్స్‌తో సిమెంట్‌ రోడ్లు వేసి, రాష్ట్ర ఖజానా నుంచి నిధులు వెచ్చించి తామే రోడ్లు నిర్మించినట్లుగా చంద్రబాబు అనేక వేదికల్లో చెప్పుకున్నారు. ఆయా పనులకు సంబంధించి గొప్పగా శిలాఫలకాలు వేసుకుని తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికలు సమీపించడంతో రూపాయి నిధులు కేటాయించకుండానే భారీ స్థాయి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించి ఆహా..ఓహో అంటూ డప్పు కొట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎన్ని‘కల’ ఫలకాలుగానే మిగిలిపోనున్నాయి. 

ఐదేళ్లుగా పెన్నా బ్యారేజీపై నిర్లక్ష్యం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులు 2008లో ప్రారంభమయ్యాయి. ఆయన మరణం తర్వాత పెన్నా బ్యారేజీ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. చంద్రబాబు పదవిలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదికి ఆ ఏడాది పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రచార ఆర్భాటం సాగింది. ఐదేళ్లు అయినా పెన్నా బ్యారేజీ పనులు ఎప్పుటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. నెల్లూరు, కోవూరు కలిపే వారధిగా పెన్నాపరీవాహక ప్రాంత ఆయకట్టు స్థిరీకరణ దృష్ట్యా ప్రారంభమైన ఈ ఆధునిక పనులకు నిధుల లేమి వెంటాడుతున్నాయి. 600 మీటర్ల పెన్నా బ్యారేజ్‌ నిర్మాణ పనులకు మొత్తం 51 గేట్లు అవసరం. ఇప్పటికి 21 గేట్లు తెప్పించారు. కేవలం 8 గేట్లను మాత్రమే అమర్చారు. సుమారు 8 వేల చదరపు మీటర్ల కాంక్రీట్‌ పని ఆగిపోయింది. ఐదేళ్లుగా ఈ బ్యారేజ్‌ పనులు కొనసాగుతున్నా ఇప్పటికి 87 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని చెప్పే అధికారులు మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది.   
నిధుల కొరత 
2015–16 వార్షిక బడ్జెట్‌లో జలవనరుల శాఖకు పెన్నా, సంగం బ్యారేజీల పనులకు రూ.5 కోట్లను కేటాయించారు. దీంతో నిధుల కొరత వల్ల పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ప్రారంభంలో రూ.149 కోట్లకు ప్రతిపాదనలు చేసిన పెన్నా బ్యారేజీ అంచనా వ్యయం రూ.190 కోట్లకు పెరిగింది. నిధుల మంజూరుకు, పనులకు పొంతన లేకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. మంత్రి నారాయణ గతేడాది ఆగస్టులో బ్యారేజ్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం నిధులతో ముడిపడిన సమస్యలు కావడంతో హామీలు గుప్పించారు. వచ్చే ఏడాదికి పనులు పూర్తి కావాలని సూచనలు చేసి చేతులు దులుపుకున్నారు. గతేడాది డిసెంబర్‌ నుంచి సుమారు రూ.6 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. బకా>యిలు పెరిగిపోతుండటంతో కాంట్రాక్టర్లు పనులు నిలుపుదల చేశారు. అటు అధికార పార్టీ నేతలు, మంత్రులు బ్యారేజీ నిర్మాణ పనుల ఊసే ఎత్తడం లేదు. ఒకప్పుడు మూడు షిప్టుల్లో జరిగిన బ్యారేజ్‌ పనులు ప్రస్తుతం చిన్నచిన్న పనులతో మందకొడిగా సాగుతున్నాయి. 

పిల్లర్లకే పరిమితం.. సంగం బ్యారేజీ

సంగం: సాక్షాత్తు సీఎం చంద్రబాబునాయుడు మాటలు నీటి మూటలు అనడానికి నిలువెత్తు నిదర్శనమే అసంపూర్తిగా ఆగిపోయిన సంగం బ్యారేజీ నిర్మాణం. 2004లో రైతుల కష్టాలను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006లో పెన్నానదిలో నూతన బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో రూ.98 కోట్లతో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ రెండేళ్ల పాటు కాలయాపన చేసి చేతులెత్తేశారు. 2008, 2009 సంవత్సరాల్లో రెండో సారి టెండరు పెంచి మరో కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ చకచకా పనులు ప్రారంభించి రూ.30 కోట్లతో డౌన్‌స్ట్రీమ్‌ పనులు చేసే లోపే వైఎస్సార్‌ మరణించడంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సంగం బ్యారేజీ నిర్మాణ పనుల్లో కొంత భాగం చేసింది.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు 2015లో సంగం బ్యారేజీని సందర్శించారు. 2017 మార్చిలోగా బ్యారేజ్‌ నిర్మాణం పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం రూ.80 కోట్లు పనులు జరిగి బ్యారేజీ నిర్మాణ పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి. మరో రూ.70 కోట్ల పనులు జరగాల్సి ఉంది. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పిన మాటలు కాస్తా గాలి మాటలుగానే మిగిలిపోయాయి. ఇటీవల ఎన్నికల నిమిత్తం ప్రచారానికి వచ్చిన చంద్రబాబు కనీసం సంగం బ్యారేజీ ప్రస్తావన రాకపోవడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

8 ఏళ్లుగా వెక్కిరిస్తున్న శిలాఫలకం

సోమశిల: ఒకటి కాదు, రెండు కాదు 8 ఏళ్లుగా తాగునీటి పథకం శిలాఫలకం పాలకుల చిత్తశుద్ధిని వెక్కిరిస్తోంది. అనంతసాగరం మండలంలోని 19 పంచాయతీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడిని గుర్తించి తీర్చేందుకు 8 ఏళ్ల క్రితం రూ.7 కోట్లతో చేపట్టిన సమగ్ర సాగునీటి పథకం నిర్మాణ దశలోనే నిలిచిపోవడంతో నిరుపయోగంగా మారింది. సోమశిల పెన్నానది నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ వేసి మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లోని గ్రామాలకు ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేసేలా పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాన పైప్‌లైన్‌ నిర్మాణాలు చేపట్టారే కానీ నీరు సజావుగా అన్ని గ్రామాలకు అందకపోవడంతో ఏళ్ల తరబడి తాగునీటి ఎద్దడి అలాగే ఉంది. మండలంలోని గౌరవరం, కామిరెడ్డిపాడు, చిలకలమర్రి, అగ్రహారం, బీ వడ్డిపాళెం తదితర గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అలాగే ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

డూప్‌ షో అట్టర్‌ ప్లాప్‌

కావలి: కావలి నియోజకవర్గంలో అభివృద్ధి డూప్‌ షో అట్టర్‌ ప్లాప్‌ అయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లుగా నిరుపయోగమైన పనులు చేసి రూ.కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించిన టీడీపీ ఐదేళ్లు పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపించడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు కనీసం ప్రతిపాదనే లేని పనులకు, నిధులు మంజూరు లేకుండానే చేపట్టాలనుకున్న శంకుస్థాపనల షోలు అట్టర్‌ ప్లాప్‌ అయ్యాయి. ఆఖరికి ఉత్తుత్తి శిలాఫలకాలను కూడా ఆవిష్కరించలేకపోయారు. నియోజకవర్గంలోని కావలి టౌన్, కావలిరూరల్, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో మొత్తం రూ.1,000 కోట్ల మేర అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించాలని అధికారులకు హుకుం జారీ చేశారు.

ఆ శిలాఫలకాలన్నీ కూడా ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రోడ్ల మీద ఉండాలని, వాటిని ప్రజలు చూసి తాము చాలా పనులు చేస్తున్నామని నమ్మి ఓట్లు వేయాలని ప్లాన్‌ చేశారు. దీంతో అధికారులు తమ చేతికింద ఉండే కాంట్రాక్టర్ల కాళ్లా వేళ్లా పడి శిలాఫలకాలు సిద్ధం చేశారు. అయినప్పటికీ కొన్ని శిలాఫలకాలు సిద్ధం అయ్యేలోగా ఎన్నికలు నోటిఫికేషన్‌ వచ్చేయడంతో టీడీపీ నాయకులు షో నుంచి అవి తప్పించుకొన్నాయి. ఈ శిలాఫలకాలకు టీడీపీ పసుపు రంగు పూసి ప్రజల కంట్లో పడలా చేశారు. అయితే  కొన్ని అసలు శిలాఫలకం పెట్టక ముందే రంగులు వేయడంతో టీడీపీ నాయకుల ఆరాటానికి ప్రజలు విస్తుపోతున్నారు. శిలాఫలకాలతో పాటు, నిర్మాణం సగం అయిన తర్వాత ఆగిపోయిన శిలాఫలకాలు దిమ్మెలు టీడీపీ నేతల విపరీత ధోరణిని వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇవి కాకుండా కావలి పట్టణంలో పక్కా గృహాలు సముదాయంలో లబ్ధిదారులకు అప్పగించకుండానే గృహ ప్రవేశాలు చేసినట్లుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి షో చేశారు.

కేంద్రం చేపట్టాల్సిన రామయపట్నంలో బుల్లి పోర్టుకు శంకుస్థాపన ఆవిష్కరించడానికి ముందే కావలిలో టపాసులు కాల్చి సందడి చేశారు. విమానాశ్రయానికి,  శంకుస్థాన చేశారు. ఫిషింగ్‌ హార్బర్‌కు ఇలా అనేక పనులకు శిలాఫలకాలు వేశారు. నిధులు మంజూరు లేకుండానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ఆవిష్కరించి ఎన్నికల్లో తాము ఆ పనులు చేస్తున్నామని బడాయి మాటలు చెబుతున్న వాటిల్లో మచ్చుకు కొన్ని శిలాఫలకాల వివరాలుకావలి మున్సిపాలిటీ ద్వారా 41 శిలాఫలకాలను టీడీపీ నాయకులు ఆవిష్కరిస్తే, వాటికి రూ.10 లక్షలు కాంట్రాక్టర్లు ఖర్చు పెట్టారు. ఈ డబ్బులు ఇవ్వమని మున్సిపాలిటీని కాంట్రాక్టర్లు అడుగుతుంటే..మా వద్ద డబ్బులు లేవు, ఇవ్వలేమని మున్సిపాలిటీ స్పష్టంగా చెబుతుంది. దీంతో కాంట్రాక్టర్లు తాము మోసపోయామని లబోదిబో మంటున్నారు.

నారాయణ ఎన్నికల స్టంట్‌!

సూళ్లూరుపేట: ‘దాహం వేస్తుందంటే.. ఉండండి బావి తవ్వి ఇస్తాం’ అనే సామెత చందనా టీడీపీ పాలకుల పరిస్థితి ఉంది. సూళ్లూరుపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో కోటపోలూరు చెరువులో సమ్మర్‌ స్టోరేజీ నిర్మించారు. వైఎస్సార్‌ మరణానంతరం సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిర్మించేందుకు రూ.75 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.  2014లో రూ.117 కోట్లతో రూ.7.50 లక్షల లీటర్లు కెపాసిటీ కలిగిన ఐదు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, 18 కిలో మీటర్లు పైపులైన్లు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏషియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంక్‌ అనే సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు చేస్తారని, దీనికి కూడా అంచనాలు సిద్ధం చేశారు.

దీనికి సంబంధించి ఏఐఐబీ సంస్థ ప్రతినిధులు ఇటీవల సూళ్లూరుపేటకు విచ్చేసి మంగళంపాడు చెరువును, పట్టణంలోని పలు ప్రాంతాలను పలుమార్లు  పరిశీలించి వెళ్లారు. అయితే అది అమలుకు నోచుకోలేదు. ఐదేళ్లు ప్రజల ఇబ్బందులు పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల ముందు సరికొత్త నాటకానికి తెరతీసింది. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ. రూ.142 కోట్లు మంజూరయ్యాయంటూ మున్సిపల్‌ మంత్రి నారాయణ గత నెల 4వ తేదీన హడావుడిగా శిలాఫలకం వేశారు. ఇప్పుడు అది పట్టణ ప్రజలను వెక్కిరిస్తోంది.


ఐదేళ్లుగా హామీలే

సూళ్లూరుపేట: చేపల వేటే ఆధారంగా జీవిస్తున్న పులికాట్‌ జాలర్లకు జీవనోపాధిని పెంచేందుకు రూ.48 కోట్లతో సముద్ర ముఖద్వారాలను పూడిక తీయిస్తానని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. ఐదేళ్లుగా హామీలతో సరిపెట్టారు. గతేడాది, ఏడాదిలో జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్‌ సభల్లో రూ.48 కోట్లు మంజూరు చేశారని జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సోమిరెడ్డి, పొంగూరు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే నేటికీ నిధులు మంజూరు కాలేదు. గతేడాది ఫ్లెమింగో ఫెస్టివల్‌ను బహిష్కరిస్తామని జాలర్లు హెచ్చరించడంతో మంత్రులు ముఖ్యమంత్రి నుంచి ఫోను వచ్చిందని, రూ. 48 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా నాటకమాడారు. పులికాట్‌ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీయించకపోవడంతో ఈ ఏడాది కూడా జాలర్లు పండగకు దూరంగానే ఉండిపోయారు.  

ఉత్తుత్తి హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా మోసం చేస్తున్న టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.సుమారు 20 వేల మందికి ఉపాధి అనుమానం పులికాట్‌ సరస్సులో 16 దీవిగ్రామాలు, 30 తీరప్రాంత గ్రామాలున్నాయి. ఇందులో ఆంధ్రా పరిధిలో 17 జాలర్లు కుప్పాలకు చెందిన వారు 20 వేలకు మందికి పైగా చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. పరోక్షంగా మరో 10 వేల మంది గిరిజనులు చేపలవేట ఆధారంగా బతుకు బండి లాగుతున్నారు. జనవరికే సరస్సు ఎండిపోవడంతో 20 వేల మంది ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది.


ఎన్నికల స్టంట్‌గా మిగిలిన మలిదేవి డ్రెయిన్‌

బుచ్చిరెడ్డిపాళెం: నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి కాలువ మలిదేవి డ్రెయిన్‌ ఎన్నికల స్టంట్‌గా మిగిలింది. ఎన్నికల నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మలిదేవి డ్రెయిన్‌ అభివృద్ధి పనులకు సంబంధించి మార్చి 2వ తేదీన శిలాఫలకం వేశారు. వాస్తవానికి  పోలంరెడ్డి హయాంలోనే మలిదేవి డ్రెయిన్‌ పూడిక తీతకు సంబంధించి నీరు–చెట్టు పేరిట రూ. 50 లక్షలు ఆయన అనుచరులు తూతూ మంత్రంగా పనులు చేసి స్వాహా చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా 87.41 కోట్ల నిధులు మలిదేవి డ్రెయిన్, మైనర్‌ డ్రెయిన్ల ఆధునికీకరణకు విడుదల చేయించారు. ఈ పనులు జరగవని, ఎన్నికల కోడ్‌ వస్తుందని తెలిసీ తెలివిగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. పోలంరెడ్డి కేవలం ఎన్నికల స్టంట్‌గా మలిదేవి డ్రెయిన్‌ను ఎంచుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మలిదేవి డ్రెయిన్‌ అభివృద్ధిని శిలాఫలకానికే పరిమితం చేశారని అంటున్నారు. 


అభివృద్ధి మిథ్య

వెంకటగిరి: పదేళ్ల కిందట ఎంతో ఉన్నతాశయంతో వెంకటగిరి సమీపంలోని  నెల్లూరు,చిత్తూరు జిల్లాల సరిహద్దులోని మన్నవరం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భెల్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అయితే నేటి పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. భెల్‌ పరిశ్రమ రూ.6 వేల కోట్ల అంచనాలతో నిరుద్యోగులకు కోటి ఆశలు కల్పించిన ఎన్‌బీపీపీఎల్‌ (ఎన్‌టీపీసీ, భెల్‌ పవర్‌ ప్రాజెక్టŠస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) పరిశ్రమ భెల్‌ మోగకుండానే మూగబోయింది. రూ.6 వేల కోట్లతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్‌ చివరికి రూ.150 కోట్లకే పనులు పరిమితం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భారీ విద్యుత్‌ పరికరాల తయారీని నిలిపేశారు. కేవలం చిన్నచిన్న విడి భాగాల తయారీ మాత్రమే జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా రావాల్సిన చిన్న తరహ పరిశ్రమలు కూడా రాలేదు. భెల్‌ ప్రాజెక్ట్‌ పూర్తయితే ప్రత్యక్షంగా 10 వేల మంది, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించేవి. 

అడుగు ముందుకు కదలని ఎస్‌ఎస్‌ కెనాల్‌ 
నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు సోమశిల నుంచి స్వర్ణముఖి వరకు వెలుగొండలు కింద రూ.350 కోట్ల అంచనాలతో ఎస్‌ఎస్‌ కెనాల్‌కు వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. అప్పట్లో కెనాల్‌ పనులు జోరుగా సాగాయి. ఆయన మరణం తర్వాత ఈ కాలువ నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నట్లుగా తయారైంది. ఈ కెనాల్‌ నిర్మాణ పనులకు అటవీ శాఖ అనుమతులు లేవని, కాలువ డిజైన్లు మార్చాలని ఏళ్ల తరబడి పాలకులు ఆ ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యంగా చేశారు. ఈ కాలువు పూర్తయి ఉంటే  చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు నేరుగా సోమశిల జలాలు పారే అవకాశం ఉండేది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా మంత్రులు, వెంకటగిరి ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించకపోవడంతో ఈకాలువ నిర్మాణ పనులు జరగలేదని రైతులు చెబుతున్నారు. ఎస్‌ఎస్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తయితే వైఎస్సార్‌కు ఎక్కడ పేరుస్తోందో అని టీడీపీ పాలకులు అటకెక్కించినట్లు విమర్శలున్నాయి.  
 

కలగా మిగిలిన టెక్స్‌టైల్‌ పార్కు 
టైక్స్‌టైల్‌ పార్కు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న వెంకటగిరి ప్రాంత నిరుద్యోగులు, చేనేత కార్మికులు కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేసేందుకు  అప్పటి మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ప్రత్యేక చోరవతో ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బుసపాళెం వద్ద స్థల సేకరణ సైతం జరిగింది. వైఎస్సార్‌ మరణంతో ఈ ప్రాజెక్ట్‌ అటకెక్కింది. గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక చేనేత జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైతం పార్కు స్థలాన్ని పరిశీలించి ఏర్పాటు చేస్తామంటూ హామీలిచ్చి వెళ్లిపోయారు. వెంకటగిరి– ఏర్పేడులో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి పరిశ్రమలు నెలకొల్పుతామని టీడీపీ నేతలు ఇచ్చిన హమీ సైతం మరుగునపడిపోయింది.  

కలగానే స్వర్ణముఖి నదిపై చెక్‌డ్యాంలు
నాయుడుపేట: నాయుడుపేట మండల పరివాహక ప్రాంతమైన స్వర్ణముఖి నది తీరంలో చెక్‌ డ్యాంలు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరకనే మిగిలిపోయింది. 2017 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని కాలనీల్లోకి రావడంతో నది ఒడ్డుకు నీరు తన్నుకొచ్చాయి. కాలనీ ప్రజలు ఇబ్బందులు తప్పవని పునరావాస కేంద్రాలకు తరలించి బాధితులకు అప్పడు ఇళ్లు కట్టిస్తాం, కరకట్టలు మరమ్మతులు చేస్తామంటూ చెప్పారు. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య, రైతులకు సాగునీటి సమస్యను తీర్చేందుకు శాశ్వత పరిష్కారంగా చెక్‌డ్యాంలు నిర్మాణానికి రూ.కోట్లు నిధులు మంజూరు చేసి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మూడేళ్లు కావస్తున్నా ఇంత వరకు సీఎం ఆ హామీని నెరవేర్చలేదు. చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రైతులకు పంటలు పండే అవకాశం ఉంది. పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా తరిమికొట్టవచ్చు.

శిలాఫలకాలతోనే సరి..

ముత్తుకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైది. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రగతి సాధించేశాం అని చెప్పుకునేందుకే నియోజకవర్గంలో ఇబ్బడిముబ్బడిగా అనేక పథకాలకు, అభివృద్ధికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శిలాఫలకాలను వేసుకుంటూ వెళ్లారు. అయితే వాటి నిర్మాణాలను మాత్రం గాలికొదిలేశారు. ముత్తుకూరులో మినీ స్టేడియం మొదలుకొని, ఫిష్‌ మార్కెట్, నేలటూరు పంచాయతీని సురక్షిత ప్రాంతానికి తరలింపు, పంచాయతీ కార్యాలయం, బలిజపాళెం అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం ఇలా ప్రతి దానికి మంత్రి సోమిరెడ్డి శిలాఫలకాలు వేశారు. కానీ ఇవేవీ నిర్మాణంలో అణువంత కూడా ముందుకు సాగలేదు. వెంకటాచలం పంచాయతీలో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.7.28 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పర్యవేక్షణలో రూర్బన్‌ నిధులు 30 శాతం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ 70 శాతం నిధులతో మొత్తం 24 పనులను ఎంపిక చేశారు. గతేడాది డిసెంబరు 24వ తేదీన మంత్రి సోమిరెడ్డి భూగర్భ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. మనుబోలులో జలధార (వాటర్‌గ్రిడ్‌) పైలెట్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి గత నెల 2వ తేదీన శిలాఫలకాన్ని మంత్రి సోమిరెడ్డి హడావుడిగా ఆవిష్కరించారు. మనుబోలు, పొదలకూరు, వెంకటాచలం మండలాలకు కండలేరు జలాలను శుద్ధిచేసి తాగునీరు అందించేందుకు రూ.184 కోట్లతో పనులు చేసేందుకు స్థానిక బద్దెవోలు క్రాస్‌రోడ్డు వద్ద శిలాఫలకం వేశారు. అయితే ఇంత వరకూ ఎటువంటి పనులు ప్రారంభించలేదు. తోటపల్లిగూడూరు మండలం పేడూరు పంచాయతీలోని కృష్ణారెడ్డిపాళెం– మాచర్లవారిపాళెం మధ్య రూ.1.67 కోట్లతో లింకురోడ్డు నిర్మాణానికి గత నెల 4వ తేదీన సోమిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గాలికొదిలేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement