మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య పద్దతుల్లోనే ఎన్నికలు నిర్వహించాలని సిద్దిపేట, మెదక్ ఆర్డీఓలు ముత్యంరెడ్డి, వనజాదేవీలు అన్నారు. మెదక్, నర్సాపూర్, ఆందోల్ డివిజన్‌లోని ఎన్నికల అధికారులతో సోమవారం మెదక్ మండల పరిధిలోని హవేళిఘణపూర్ శివారులోగల వైపీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అథితులుగా హాజరై వారు మాట్లాడారు. 2014లో జరగబోయే సాధారణ ఎన్నికలను ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే విదంగా నిర్వహించాలని వారు తెలిపారు. ఎన్నికల్లో అలసత్వం వహిస్తే అధికారులపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వాదేశాను సారం ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి, రూ. 20 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండగా ఎంపి అభ్యర్థి రూ. 70 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందని వారు తెలిపారు. నిర్ణీత వ్యయంకన్నా పైసా ఖర్చు ఎక్కువ చేసినట్లు తేలితే సదరు అభ్యర్థి గెలుపును సైతం నిలిపివేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. అంతేకాకుండా పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యుత్ స్తంభాలు ఎట్టిపరిస్థితిలో కట్టకూడదన్నారు. ప్రవేట్ ఇళ్లకు కట్టినా సంబంధిత ఇంటి యజమాని అనుమతి పొందాకనే కట్టాలన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ర్యాలీలు, మోటర్‌సైకిల్ ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిర్వహించిన సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాకనే నిర్వహించాలన్నారు.
ఇందుకోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం నియమించిన వ్యక్తులు వీడియో తీయాలన్నారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఎన్ని వాహనాలను ర్యాలీలో ఉపయోగిస్తున్నారు, అందుకయ్యేఖర్చు ఎంత ఎప్పటికప్పుడు స్పష్టంగా లెక్కలను అభ్యర్థులనుంచి సేకరించాలన్నారు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి అక్రమంగా ఓటర్లకు డబ్బులు పంచినా, డబ్బులు దొరికినా వెంటనే ఆ విషయాన్ని ఐటీ అధికారులకు సమాచారం ఇస్తే సంబంధిత అభ్యర్థిపై కేసులు నమోదు చేస్తారన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ గోధ్రుతోపాటు మెదక్, నర్సాపూర్, ఆందోల్ నియోజకర్గాల అధికారులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు
Published Mon, Mar 3 2014 11:59 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement