సాక్షి ప్రతినిధి, ఏలూరు :
నిన్న మొన్నటి వరకూ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురుచూసిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ పేరు చెబితేనే వణికిపోతున్నారు. సాధారణ ఎన్నికలకు సిద్ధమైన రాజకీయ పార్టీలు, నాయకులు మధ్యలో మున్సిపల్ ఎన్నికలు రావడాన్నే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతూనే మరోవైపు మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన, అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా వెంటనే నిర్వహించాలని శుక్రవారం కోర్టు ఆదేశించడంతో వారి పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుగా మారింది. మార్చి 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మే 7న సాధారణ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది.
తలకు మించిన భారం
రాజకీయ పార్టీలు, నేతలకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఒకేసారి మూడు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక వారంతా తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీలకు సాధారణ ఎన్నికలు చావోరేవోగా మారాయి. వాటి కోసమే అన్ని ఏర్పాట్లు చేసుకోవడంతోపాటు సకల హంగులతో సిద్ధమై వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నారు. ఇప్పుడు పులిమీద పుట్రలా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముంచుకురావడం వారికి తలకు మించిన భారంగా మారింది. నేతలకు ఏ ఎన్నికల గురించి ఆలోచించాలో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. నేడో, రేపో జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడనుంది.
కత్తిమీద సాము
ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తలకు మించిన భారంగా మారనున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేయడం ఒక ఎత్తయితే వ్యూహప్రతివ్యూహాలకు సైతం వారికి సమయం లేకుండాపోయింది. సాధారణంగా ఈ మూడు ఎన్నికలకూ ఒక్కో రకమైన వ్యూహం ఉంటుంది. సాధారణ ఎన్నికలను జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాలు, అంశాలు ప్రభావితం చేస్తాయి. స్థానిక రాజకీయాలు చాలా తక్కువ శాతంగానే ఈ ఎన్నికలను దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని ఎన్నికలు ఒకేసారి రావడంతో ఓటర్లు ఎలా స్పందిస్తారో కూడా అంతుపట్టడంలేదు. మరోవైపు సాధారణ ఎన్నికల్లో తన కోసం పనిచేయించుకోవాల్సిన నేతలను నేరుగా వేరే ఎన్నికల బరిలోకి దించాల్సి రావడం కూడా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది.
ఆర్థిక అంశాలూ.. సవాలే
ఒకేసారి మూడు ఎన్నికలలో తలపడే స్థాయి ఆర్థిక పరిపుష్టిని సాధించడం నేతలకు సామాన్య విషయం కాదు. ప్రస్తుతం సాధారణ ఎన్నికల ఖర్చుకే అభ్యర్థులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది మున్సిపల్, స్థానిక ఎన్నికలు తోడవడంతో వీటన్నింటికీ ఆర్థిక వనరులను సమీకరించుకోవడం రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యే అభ్యర్థులకు సవాలుగా మారింది.
అధికారులకూ అగ్ని పరీక్ష
మూడు ఎన్నికలను ఒకేసారి నిర్వహిం చాల్సి రావడం అధికార యంత్రాంగానికి అగ్ని పరీక్షగా మారింది. ఈ పరిస్థితి అధికారులకు చుక్కలు చూ పిస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులదే కీలక పాత్ర. ఇప్పుడు వారు ఎన్నికల పనితోపాటు టెన్త్, ఇంటర్ పరీక్షలను స్వల్ప వ్యవధిలో నిర్వహించాల్సి ఉంది. ఇవి అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి. మొత్తంగా ఒకేసారి వచ్చి పడిన ఎన్నికలు రాజకీయ పార్టీలు, నేతలతోపాటు అధికారులు, ఉద్యోగులనూ కలవరపెడుతున్నాయి. ప్రజలు కూడా అన్నీ ఒకేసారి రావడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఎన్నికల వణుకు
Published Sat, Mar 8 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement