ట్రాన్స్‘ఫార్మర్’ షాక్
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు వచ్చాయంటే విద్యుత్ వినియోగదారుల గుండెలు దడేల్ మంటాయి. గృహాల్లో చీకట్లు అలుముకుంటాయి. పంట చేలు నై వారుతాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రధానంగా రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారులే ట్రాన్స్‌ఫార్మర్ బిగించాల్సి ఉన్నా రైతులే రవాణా ఖర్చులు భరిస్తూ షెడ్డుకు తీసుకొస్తున్నారు. మరమ్మతు చేయడానికి, బిగించడానికి కరెంటోళ్లకు కాసులు ఇవ్వనిదే పనికావడం లేదు. మరోపక్క రోలింగ్ స్టాక్ మరమ్మతులతో షెడ్డులో దర్శనం ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గడువులోగా ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తామన్న విద్యుత్ శాఖ నిబంధనలు నీరుగారుతున్నాయి.
రైతుమిత్ర అభాసుపాలు
రైతులకు కరెంటు కష్టాల నుంచి విముక్తి కలిగించడానికి ప్రభుత్వం ఏడాది కిందట రైతు మిత్ర పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఒక ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు గురైతే జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో 9440811700 నంబర్‌కు ఫోన్ చేసిన పక్షంలో ఫిర్యాదును స్వీకరిస్తారు. దానికి సంబంధించి రైతు ఫోన్ చేసిన సెల్ నంబర్‌కు ఎకనాలెడ్జ్‌మెంట్ పంపుతారు. 48 గంటల్లో ట్రాన్స్‌ఫార్మర్ మార్పు లేనిపక్షంలో మరమ్మతు చేయాలనేది రైతుమిత్ర ఉద్దేశం. అయితే ఫిర్యాదు స్వీకరించడం, నమోదు చేసుకోవడం వరకు సక్రమంగానే జరుగుతున్నా క్షేత్రస్థాయిలో వచ్చేసరికి మాత్రం ఉద్దేశం నెరవేరడం లేదు. రోజులు తరబడి మరమ్మతుకు గురైన ట్రాన్స్‌ఫార్మర్‌లకు బదులు మరో ట్రాన్స్‌ఫార్మర్ బిగించడం లేదు.
ఈ పరిస్థితుల్లో వినియోగదారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల చేలకు నీళ్లు పారక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో రోజుల తరబడి ఊర్లు చిమ్మచీకటిలో గడపాల్సిన దుస్థితి ఎదురవుతుంది. సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
రవాణ ఖర్చులు రైతుల పైనే..
ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు గురైన పక్షంలో నిబంధనల ప్రకారం విద్యుత్ శాఖ నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించడం, మరొకటి బిగించడం చేపట్టాలి. జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కేంద్రాలు 16 ఉన్నాయి. నాలుగు డివిజన్ హెడ్‌క్వార్టర్‌లలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో షెడ్‌లు పనిచేస్తుండగా సబ్‌డివిజన్‌లలో ఉన్న మరో 12 షెడ్‌లు ప్రైవేట్ నిర్వాహకులు చేపడుతున్నారు. రైతులు వేల రూపాయలు జమచేసి రవాణ ఖర్చులు భరించి రిపేర్ కోసం షెడ్లకు తీసుకు వస్తుండగా మరమ్మతులు చేసేందుకు తిరిగి దానిని క్షేత్రస్థాయిలో బిగించేందుకు చేతులు తడపనిదే పనికావడం లేదు.
జిల్లాలో 25 వేలకుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, ఆ సంఖ్యకు 4 శాతం రోలింగ్‌స్టాక్ (మరమ్మతుకు గురైన ట్రాన్స్‌ఫార్మర్ బదులు మరో ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చేందుకు ఉన్నటువంటి స్టాక్) అందుబాటులో ఉంచాలి. కేవలం 120 మాత్రమే జిల్లా అంతటా కలిపి రోలింగ్ స్టాక్ అందుబాటులో ఉండడంతో పెద్ద మొత్తంలో ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతు లకు గురైనప్పుడు తక్షణం మార్పు చేయడం లేదు. రోజులు తరబడినా ట్రాన్స్‌ఫార్మర్ మార్చకపోవడంతో కష్టాలు ఎదురవుతున్నాయి.