transformer repair
-
ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తూ విద్యుత్ షాక్‌తో రైతు మృతి
గజ్వేల్‌రూరల్: ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తుండగా, ఓ యువరైతు విద్యుత్ సరఫరా జరిగి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట రాజు(32)కు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైంది. దానికి మరమ్మతు చేయించి బిగించేందుకు రైతులు సబ్‌స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి రాజు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే రాజు మృతి చెందాడని ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేదిలేదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదఘటనపై విచారణ చేపట్టి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రాజును ట్రాన్స్ఫార్మర్ పైకి ఎవరు ఎక్కమన్నారు? ఎల్సీ తీసుకున్న తర్వాత మరమ్మతు పనులు పూర్తికాకముందే ఎలా విద్యుత్ సరఫరా చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది. -
మామూళ్లిస్తేనే..
- రైతులకు తప్పని ట్రాన్స్ఫార్మర్ కష్టాలు - డబ్బు ఇవ్వనిదే స్పందించని సిబ్బంది - నూతన ట్రాన్స్‌ఫార్మర్లకోసం ఎదురు చూపులు - పెండింగ్‌లో 2 వేల దరఖాస్తులు నెల్లూరు(హరనాథపురం): విద్యుత్ సరఫరాలో కీలకమైన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైతే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 11,316 సింగిల్ ఫేస్, 23,928 త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కాలిపోయినప్పుడు వెం టనే మార్చేందుకు రోలింగ్ పేరుతో నాలుగు శాతం ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం అవి 2.3 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ విలు వ రూ.75 వేలు నుంచి రూ.లక్ష వర కు ఉంటుంది. ప్రతి నెలా జిల్లాలో సుమారు 500 ట్రాన్స్ఫార్మర్లు కాలి పోతుంటాయి. ఒక్క నెల్లూరు డివిజ న్లోని వీటి సంఖ్య నెలకు 180 వర కు ఉంటుంది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరులో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు సెంటర్లు ప్రైవేటు రంగంలో నడుస్తున్నాయి. రైతు అవసరాలే ఆదాయ వనరు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే సంబంధిత ఏఈ దృష్టికి తీసుకెళ్లి రికార్డుల్లో నమోదు చేసుకోవాలి. రైతు ఫిర్యాదు చేసిన 48 గంటల్లో అధికారులే ప్రభుత్వ వాహనంలో మరో ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి అమర్చాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల వరకు ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది. రైతులు చందాల వేసుకుని ఏఈ, లైన్‌మన్, హెల్పర్ల చేయితడిపితే కాని స్పందన ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన సమయంలో రైతుల అవసరాన్ని బట్టి రూ.3 వేలు నుంచి రూ.12 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కావలి, గూడూరు డివిజన్లలో రూ.10 వేలు వరకు, నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లలో రూ.15వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లను తరలించేందుకు 19 సబ్డివిజన్ల పరిధిలో మూడు వాహనాలు మాత్రమే ఉండడంతో రవాణా చార్జీలు సైతం రైతులపైనే పడుతున్నాయి. మరమ్మతు కేంద్రాల్లోనూ దందా అక్రమ వసూళ్ల దందా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రాల్లోనూ సాగుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడుపులిచ్చిన వారికి వెంటనే కొత్తవి ఇస్తున్నారని, లేని పక్షంలో రోజుల తరబడి తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు కొత్త ట్రాన్స్ఫార్మర్ల మంజూరులోనూ తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ప్రస్తుతం జిల్లాలో 2 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ కు సంబంధించి లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. -
ట్రాన్స్‘ఫార్మర్’ షాక్
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు వచ్చాయంటే విద్యుత్ వినియోగదారుల గుండెలు దడేల్ మంటాయి. గృహాల్లో చీకట్లు అలుముకుంటాయి. పంట చేలు నై వారుతాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రధానంగా రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారులే ట్రాన్స్ఫార్మర్ బిగించాల్సి ఉన్నా రైతులే రవాణా ఖర్చులు భరిస్తూ షెడ్డుకు తీసుకొస్తున్నారు. మరమ్మతు చేయడానికి, బిగించడానికి కరెంటోళ్లకు కాసులు ఇవ్వనిదే పనికావడం లేదు. మరోపక్క రోలింగ్ స్టాక్ మరమ్మతులతో షెడ్డులో దర్శనం ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గడువులోగా ట్రాన్స్ఫార్మర్ బిగిస్తామన్న విద్యుత్ శాఖ నిబంధనలు నీరుగారుతున్నాయి. రైతుమిత్ర అభాసుపాలు రైతులకు కరెంటు కష్టాల నుంచి విముక్తి కలిగించడానికి ప్రభుత్వం ఏడాది కిందట రైతు మిత్ర పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఒక ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు గురైతే జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో 9440811700 నంబర్‌కు ఫోన్ చేసిన పక్షంలో ఫిర్యాదును స్వీకరిస్తారు. దానికి సంబంధించి రైతు ఫోన్ చేసిన సెల్ నంబర్‌కు ఎకనాలెడ్జ్మెంట్ పంపుతారు. 48 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ మార్పు లేనిపక్షంలో మరమ్మతు చేయాలనేది రైతుమిత్ర ఉద్దేశం. అయితే ఫిర్యాదు స్వీకరించడం, నమోదు చేసుకోవడం వరకు సక్రమంగానే జరుగుతున్నా క్షేత్రస్థాయిలో వచ్చేసరికి మాత్రం ఉద్దేశం నెరవేరడం లేదు. రోజులు తరబడి మరమ్మతుకు గురైన ట్రాన్స్ఫార్మర్లకు బదులు మరో ట్రాన్స్ఫార్మర్ బిగించడం లేదు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల చేలకు నీళ్లు పారక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో రోజుల తరబడి ఊర్లు చిమ్మచీకటిలో గడపాల్సిన దుస్థితి ఎదురవుతుంది. సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. రవాణ ఖర్చులు రైతుల పైనే.. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు గురైన పక్షంలో నిబంధనల ప్రకారం విద్యుత్ శాఖ నుంచి ట్రాన్స్ఫార్మర్ను తరలించడం, మరొకటి బిగించడం చేపట్టాలి. జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రాలు 16 ఉన్నాయి. నాలుగు డివిజన్ హెడ్క్వార్టర్లలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో షెడ్లు పనిచేస్తుండగా సబ్డివిజన్లలో ఉన్న మరో 12 షెడ్లు ప్రైవేట్ నిర్వాహకులు చేపడుతున్నారు. రైతులు వేల రూపాయలు జమచేసి రవాణ ఖర్చులు భరించి రిపేర్ కోసం షెడ్లకు తీసుకు వస్తుండగా మరమ్మతులు చేసేందుకు తిరిగి దానిని క్షేత్రస్థాయిలో బిగించేందుకు చేతులు తడపనిదే పనికావడం లేదు. జిల్లాలో 25 వేలకుపైగా ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, ఆ సంఖ్యకు 4 శాతం రోలింగ్‌స్టాక్ (మరమ్మతుకు గురైన ట్రాన్స్ఫార్మర్ బదులు మరో ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు ఉన్నటువంటి స్టాక్) అందుబాటులో ఉంచాలి. కేవలం 120 మాత్రమే జిల్లా అంతటా కలిపి రోలింగ్ స్టాక్ అందుబాటులో ఉండడంతో పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు లకు గురైనప్పుడు తక్షణం మార్పు చేయడం లేదు. రోజులు తరబడినా ట్రాన్స్ఫార్మర్ మార్చకపోవడంతో కష్టాలు ఎదురవుతున్నాయి.