విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విద్యుత్ అధికారులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లటంతో సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్లు నిర్వహణ చూసే వారు లేక గాలిలో దీపాలుగా తయారయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు గాలులు కూడా వీచి కరెంటు సరఫరా నిలిచిపోతే ప్రజలు అంధకారంలో చిక్కుకోవాల్సిందే. ప్రతి సబ్‌స్టేషన్‌లో ఒక కాంట్రాక్టు ఎన్‌ఎంఆర్ మినహా అందరూ విధులకు గైర్హాజరయ్యారు. సరఫరా నిలిచిపోతే పరిస్థితి ఏమిటో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది అంతా సమ్మెలోనే..
సమైక్య రాష్ట్రం కోసం విద్యుత్ ఉద్యోగులు గురువారం నుంచి 72 గంటల సమ్మెలోకి వెళ్లారు. జిల్లాలో, విజయవాడలో కలిపి 176 సబ్‌స్టేషన్లలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది కూడా సమ్మెకు దిగారు. డివిజనల్ ఇంజినీర్ స్థాయి నుంచి గ్రామ స్థాయిలో హెల్పర్ వరకు అన్ని కేటగిరీల్లో సిబ్బంది యావత్తూ సమ్మెలోకి వెళ్లారు. రైతుబజారు ఎదుట గల ఏపీఎస్‌పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం మూతపడింది. జిల్లా అంతటా విద్యుత్ అధికారులు, సిబ్బంది దాదాపు మూడువేల మంది సమ్మెబాట పట్టారు.
ప్రత్యామ్నాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం..
విద్యుత్ సిబ్బంది సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జిల్లాలో వేలాదిగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గాలికొదిలేశారు. అత్యవసర సేవలు మినహా మరే విధమైన సేవలకూ హాజరవకూడదని విద్యుత్ జేఏసీ నిర్ణయించింది. సాయంత్రానికే ప్రజల కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో 20 నుంచి 30 ఫీడర్లు, విజయవాడలో దాదాపు 10 సాంకేతిక లోపానికి గురైనట్లు సమాచారం. వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ సెల్‌ఫోన్ సిమ్ కార్డులను ఇచ్చివేసి ఆందోళనలో పాల్గొంటున్నారు. విజయవాడలో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గృహ వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
సమ్మె ఉధృతం చేస్తాం : సత్యానందం
రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రవేశపెడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ సత్యానందం హెచ్చరించారు. గురువారం విజయవాడలో సర్కిల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర అంధకారంలో ఉంటుందన్నారు. ముఖ్యమైన జలవిద్యుత్ కేంద్రాలన్నీ తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. తాము జీతభత్యాల కోసం సమ్మె చేయటం లేదని, ప్రజాశ్రేయస్సు కోసం సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నామని, ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ కె.రామచంద్రరావు, కన్వీనర్ ఎం.వెంకటేశ్వరరావు, ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకుడు బి.శ్రీనివాసరావు, జేఏసీ నేత కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సేవలకు బ్రేక్
Published Fri, Sep 13 2013 3:11 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement