* విద్యుత్ బిల్లులు చెల్లించని రొయ్యల చెరువుల రైతులు
* రూ.4 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు
* ఎలా వసూలు చేయాలో తెలియక తలపట్టుకుంటున్న అధికారులు
చీరాల : జిల్లాలోని తీరప్రాంతంలో రొయ్యల చెరువుల రైతులు కొందరు విద్యుత్ బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్నారు. పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు చూసి ఆ శాఖ అధికారులే షాక్ తింటున్నారు. జిల్లాలో ఏడాది కాలంలో రూ.4 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. భారీగా పేరుకుపోయిన బకాయిలు ఎలా వసూలు చేయాలో తెలియక విద్యుత్ శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు.
జిల్లాలో చీరాల, వేటపాలెం, చినగంజాం, టంగుటూరు, సింగరాయకొండ, కరేడు తదితర ప్రాంతాల్లో పదివేల ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. ప్రతి పంటకు 30 టన్నులకు పైగా ఎగుమతి చేస్తారు. టన్ను రూ.3-4 లక్షల చొప్పున మొత్తం రూ.1,050 కోట్ల విలువైన రొయ్యలు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది వర్షాలు కురవకపోవడం, ఉప్పు శాతం పెరిగిపోవడం, ఎగువ ప్రాంతంలో వదిలిన వ్యర్థనీటిని దిగువన ఉన్న చెరువులకు వినియోగించుకోవడంతో వరుసగా రెండు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రొయ్యల చెరువుల యజమానులు ప్రతినెలా కట్టాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించడం మానేశారు.
ఎక్కడెక్కడ ఎంతెంత?
జిల్లాలో ఎక్కువగా ఐదు మండలాల పరిధిలోని రొయ్యల చెరువుల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. వేటపాలెం మండలంలో రూ.89 లక్షలు, చినగంజాం మండలంలో రూ.1.34 కోట్లు, టంగుటూరు రూ.1.16 కోట్లు, సింగరాయకొండ రూ.4 లక్షలతోపాటు కందుకూరు నియోజకవర్గంలోని మండలాల్లో సుమారు కోటి రూపాయల వరకు బకాయిలు ఉన్నాయి.
దాడులు కొన్నిచోట్లేనా?
ప్రస్తుతం ఆక్వా సాగు ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు రొయ్యల చెరువుల కనెక్షన్లు తొలగించారు. అరుుతే బిల్లులు కట్టని అన్ని చెరువుల కనెక్షన్లు తొలగించకపోవడంపై విమర్శలొస్తున్నారుు. మీటర్ల వద్ద కనెక్షన్లు తొలగించినప్పటికీ రొయ్యల చెరువుల యజమానులు నేరుగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కరెంటును వినియోగించుకుంటున్నారు. సాధారణ గృహాలకు ఒక నెల బిల్లు చెల్లించకుంటే కనెక్షన్లు తొలగిస్తున్న విద్యుత్ అధికారులు.. రొయ్యల చెరువుల యజమానులు రూ.లక్షల్లో బకాయి ఉన్నా కనెక్షన్లు తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఈ విషయమై చీరాల ఎలక్ట్రికల్ డీఈ సీహెచ్‌వీ ప్రసాద్‌ను వివరణ కోరగా.. ‘చీరాల డివిజన్‌లో రొయ్యల చెరువుల విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించినా పట్టించుకోవడం లేదు. బకాయిలు చెల్లించనివారి కనెక్షన్లు, ఆ తర్వాత మీటర్లు తొలగిస్తున్నాం. బకాయిలు చెల్లించకుంటే ట్రాన్స్‌ఫార్మర్లు కూడా తీసేస్తాం’ అన్నారు.
అలా మొండికేస్తే ఎలా?
Published Wed, Mar 9 2016 3:57 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement