Prawns Pond Farmers
-
‘బ్రౌన్’ హంగామా!
సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారుల వలకు రొయ్యలు ఆశాజనకంగా చిక్కుతున్నాయి. వీటిలో బ్రౌన్ రకం రొయ్యలు అధికంగా ఉంటున్నాయి. గతేడాది కంటే ఇటీవల రొయ్యల లభ్యత బాగుండడంతో మత్స్యకారుల మోములు వికసిస్తున్నాయి. మత్స్యకారులు సాధారణంగా 10–15 రోజుల పాటు రొయ్యల వేట సాగిస్తుంటారు. రొయ్యల కోసం బోటులో సముద్రంలో దూరంగా వెళ్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే రొయ్యలు లభ్యమవుతున్నాయి. దీంతో నాలుగైదు రోజులకే ఒక్కో బోటుకు అర టన్ను నుంచి టన్ను వరకు దొరుకుతున్నాయి. దీంతో వేట సమయాన్ని నాలుగైదు రోజులకే కుదించుకుని హార్బర్‌కు చేరుకుంటున్నారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉంటూ మంచి ధర కూడా లభిస్తోంది. అదే పది రోజులకు పైగా వేట కొనసాగిస్తే వలకు చిక్కిన రొయ్యలను ఐస్‌లో రోజుల తరబడి బోట్లలోనే నిల్వ ఉంచాల్సి వస్తోంది. దీనివల్ల రొయ్యల రంగు మారిపోయి, తాజాదనం కోల్పోయి తక్కువ ధర పలుకుతోంది. ఇది మత్స్యకారులకు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో రొయ్యలు పుష్కలంగా లభిస్తున్నందున తక్కువ రోజుల వేటకే మొగ్గు చూపుతున్నారు. విరివిగా బ్రౌన్ రొయ్యలు కొన్నాళ్లుగా లభిస్తున్న రొయ్యల్లో బ్రౌన్ రకం రొయ్యలే అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వీటికి కిలో రూ.350 ధర పలుకుతోంది. ఎగుమతి చేసే రొయ్యల తలలు తీసివేస్తారు. వీటిని హెడ్‌లెస్ ష్రింప్గా పేర్కొంటారు. వీటికి కిలోపై రూ.100 వరకు ధర అధికంగా ఉంటుంది. గత సంవత్సరం ఈ సీజనులో వీటి ధర ఒకింత బాగున్నా తక్కువగా లభ్యమయ్యేవి. కానీ ఈ సీజనులో ఇవి విరివిగా దొరుకుతుండడంతో ఊరటనిస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో రొయ్యలు, చేపలను బాస్కెట్ల లెక్కన కొనుగోలు చేస్తుంటారు. రొయ్యల్లో టైగర్, ఫ్లవర్, గోల్డ్/వైట్, బ్రౌన్/పింక్ తదితర రకాలుంటాయి. ప్రస్తుతం కిలో టైగర్ రొయ్యలు రూ.1,100, ఫ్లవర్ రకం రూ.500, గోల్డ్/వైట్ రూ.300, బ్రౌన్ రకం రూ.350 చొప్పున ధర పలుకుతోంది. రొయ్యల కొనుగోలుదారులు, ఎగుమతిదారులు ఆశించినంతగా వీటిని కొనుగోలు చేయకపోయినా స్థానికంగానే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 70 శాతానికి పైగా బోట్లు సమీపంలోనే రొయ్యల వేట సాగిస్తున్నారని, దీంతో నాలుగైదు రోజులకే తీరానికి చేరుకుంటున్నారని వైశాఖి డాల్ఫిన్ బోట్ ఆపరేటర్ల సంక్షేమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సూరాడ సత్తిబాబు ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉండడంతో స్థానికంగా విక్రయాలు బాగా జరుగుతున్నాయని తెలిపారు. -
రొయ్య ధరల్ని తగ్గిస్తే చర్యలు
సాక్షి, అమరావతి: రొయ్యల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, ఎగుమతిదారులను ప్రభుత్వం ఆదేశించింది. 100 కౌంట్ రొయ్యలను ఇక నుంచి కిలో రూ.200కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని పేర్కొంది. మిగిలిన కౌంట్ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చెల్లించాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏపీలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 59,335.73 టన్నుల రొయ్యలను ప్రాసెసింగ్ యూనిట్లు సేకరించాయి. ప్రస్తుతం రోజుకు 2 వేల టన్నుల రొయ్యలు మార్కెట్‌కు వస్తున్నాయి. విశాఖ, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల మీదుగా ఇప్పటివరకు ఎగుమతికి 86,292 టన్ను రొయ్యల్ని ప్రాసెస్ చేశారు. సెకండ్ వేవ్‌ను సాకుగా చూపి.. కోవిడ్ సెకండ్ వేవ్‌ను సాకుగా చూపి మార్కెట్లో ధర పడిపోయిందంటూ కొందరు దళారీలు, ట్రేడర్లు కిలో రొయ్యలకు రూ.20 నుంచి రూ.30 చొప్పున ధర తగ్గించారు. ఏప్రిల్‌లో రైతులు, ట్రేడర్స్‌తో సమావేశం నిర్వహించిన ప్రభుత్వం ధరలు నిలకడగా కొనసాగేలా చర్యలు తీసుకుంది. కానీ.. 10 రోజులుగా ధరలు మళ్లీ పతనమవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తమిళనాడు, ఒడిశా, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వంద కౌంట్ రొయ్యలను కిలో రూ.220కి కొనుగోలు చేస్తుంటే.. ఏపీలో మాత్రం రూ.170 నుంచి రూ.180కి కొనుగోలు చేస్తున్నారని, మిగిలిన కౌంట్ ధరలు కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నాయని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్య శాఖ అధికారులు రొయ్య రైతులు, ట్రేడర్స్, ఎక్స్‌పోర్టర్స్‌తో సమీక్ష నిర్వహించారు. ఇకనుంచి ప్రతి వారం రొయ్యల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా కౌంట్ల వారీగా నిర్ధేశించిన ధరలను ఇకనుంచి ప్రతి వారం పత్రికాముఖంగా రైతులకు తెలియజేసి.. ధరలపై వారికి విస్తృత అవగాహన కల్పిస్తామని ప్రకటించింది. 100 కౌంట్‌కు కిలో రూ.200 కంటే తక్కువగా కొనుగోలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించగా, ఆ ధరకు తప్పకుండా కొనుగోలు చేస్తామని ఎక్స్‌పోర్టర్స్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ మేరకు పెంచేందుకు అవకాశం ఉందో పరిశీలించేందుకు అంతర్గతంగా సమావేశమై ధరల పెంపు విషయమై నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. ధరలపై నియంత్రణ అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా ప్రాసెసింగ్ ప్లాంట్స్, సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ నిర్ధేశించిన ధరలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇకనుంచి 100 కౌంట్ కిలో రూ.200కు తక్కువ కాకుండా కొనుగోలు చేసేలా ఆదేశించాం. తక్కువ ధరకు కొనుగోలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
అలా మొండికేస్తే ఎలా?
* విద్యుత్ బిల్లులు చెల్లించని రొయ్యల చెరువుల రైతులు * రూ.4 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు * ఎలా వసూలు చేయాలో తెలియక తలపట్టుకుంటున్న అధికారులు చీరాల : జిల్లాలోని తీరప్రాంతంలో రొయ్యల చెరువుల రైతులు కొందరు విద్యుత్ బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్నారు. పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు చూసి ఆ శాఖ అధికారులే షాక్ తింటున్నారు. జిల్లాలో ఏడాది కాలంలో రూ.4 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. భారీగా పేరుకుపోయిన బకాయిలు ఎలా వసూలు చేయాలో తెలియక విద్యుత్ శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో చీరాల, వేటపాలెం, చినగంజాం, టంగుటూరు, సింగరాయకొండ, కరేడు తదితర ప్రాంతాల్లో పదివేల ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. ప్రతి పంటకు 30 టన్నులకు పైగా ఎగుమతి చేస్తారు. టన్ను రూ.3-4 లక్షల చొప్పున మొత్తం రూ.1,050 కోట్ల విలువైన రొయ్యలు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది వర్షాలు కురవకపోవడం, ఉప్పు శాతం పెరిగిపోవడం, ఎగువ ప్రాంతంలో వదిలిన వ్యర్థనీటిని దిగువన ఉన్న చెరువులకు వినియోగించుకోవడంతో వరుసగా రెండు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రొయ్యల చెరువుల యజమానులు ప్రతినెలా కట్టాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించడం మానేశారు. ఎక్కడెక్కడ ఎంతెంత? జిల్లాలో ఎక్కువగా ఐదు మండలాల పరిధిలోని రొయ్యల చెరువుల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. వేటపాలెం మండలంలో రూ.89 లక్షలు, చినగంజాం మండలంలో రూ.1.34 కోట్లు, టంగుటూరు రూ.1.16 కోట్లు, సింగరాయకొండ రూ.4 లక్షలతోపాటు కందుకూరు నియోజకవర్గంలోని మండలాల్లో సుమారు కోటి రూపాయల వరకు బకాయిలు ఉన్నాయి. దాడులు కొన్నిచోట్లేనా? ప్రస్తుతం ఆక్వా సాగు ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు రొయ్యల చెరువుల కనెక్షన్లు తొలగించారు. అరుుతే బిల్లులు కట్టని అన్ని చెరువుల కనెక్షన్లు తొలగించకపోవడంపై విమర్శలొస్తున్నారుు. మీటర్ల వద్ద కనెక్షన్లు తొలగించినప్పటికీ రొయ్యల చెరువుల యజమానులు నేరుగా ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటును వినియోగించుకుంటున్నారు. సాధారణ గృహాలకు ఒక నెల బిల్లు చెల్లించకుంటే కనెక్షన్లు తొలగిస్తున్న విద్యుత్ అధికారులు.. రొయ్యల చెరువుల యజమానులు రూ.లక్షల్లో బకాయి ఉన్నా కనెక్షన్లు తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై చీరాల ఎలక్ట్రికల్ డీఈ సీహెచ్‌వీ ప్రసాద్‌ను వివరణ కోరగా.. ‘చీరాల డివిజన్లో రొయ్యల చెరువుల విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించినా పట్టించుకోవడం లేదు. బకాయిలు చెల్లించనివారి కనెక్షన్లు, ఆ తర్వాత మీటర్లు తొలగిస్తున్నాం. బకాయిలు చెల్లించకుంటే ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసేస్తాం’ అన్నారు.