![AP Govt Says Dont Decrease Prawn Fish Prices To Traders And Exporters - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/4/Pronz-Fish.jpg.webp?itok=Z9VitaR9)
సాక్షి, అమరావతి: రొయ్యల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, ఎగుమతిదారులను ప్రభుత్వం ఆదేశించింది. 100 కౌంట్ రొయ్యలను ఇక నుంచి కిలో రూ.200కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని పేర్కొంది. మిగిలిన కౌంట్ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చెల్లించాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏపీలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 59,335.73 టన్నుల రొయ్యలను ప్రాసెసింగ్ యూనిట్లు సేకరించాయి. ప్రస్తుతం రోజుకు 2 వేల టన్నుల రొయ్యలు మార్కెట్‌కు వస్తున్నాయి. విశాఖ, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల మీదుగా ఇప్పటివరకు ఎగుమతికి 86,292 టన్ను రొయ్యల్ని ప్రాసెస్ చేశారు.
సెకండ్ వేవ్‌ను సాకుగా చూపి..
కోవిడ్ సెకండ్ వేవ్‌ను సాకుగా చూపి మార్కెట్‌లో ధర పడిపోయిందంటూ కొందరు దళారీలు, ట్రేడర్లు కిలో రొయ్యలకు రూ.20 నుంచి రూ.30 చొప్పున ధర తగ్గించారు. ఏప్రిల్‌లో రైతులు, ట్రేడర్స్‌తో సమావేశం నిర్వహించిన ప్రభుత్వం ధరలు నిలకడగా కొనసాగేలా చర్యలు తీసుకుంది. కానీ.. 10 రోజులుగా ధరలు మళ్లీ పతనమవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తమిళనాడు, ఒడిశా, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వంద కౌంట్ రొయ్యలను కిలో రూ.220కి కొనుగోలు చేస్తుంటే.. ఏపీలో మాత్రం రూ.170 నుంచి రూ.180కి కొనుగోలు చేస్తున్నారని, మిగిలిన కౌంట్ ధరలు కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నాయని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్య శాఖ అధికారులు రొయ్య రైతులు, ట్రేడర్స్, ఎక్స్‌పోర్టర్స్‌తో సమీక్ష నిర్వహించారు.
ఇకనుంచి ప్రతి వారం రొయ్యల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా కౌంట్‌ల వారీగా నిర్ధేశించిన ధరలను ఇకనుంచి ప్రతి వారం పత్రికాముఖంగా రైతులకు తెలియజేసి.. ధరలపై వారికి విస్తృత అవగాహన కల్పిస్తామని ప్రకటించింది. 100 కౌంట్‌కు కిలో రూ.200 కంటే తక్కువగా కొనుగోలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించగా, ఆ ధరకు తప్పకుండా కొనుగోలు చేస్తామని ఎక్స్‌పోర్టర్స్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ మేరకు పెంచేందుకు అవకాశం ఉందో పరిశీలించేందుకు అంతర్గతంగా సమావేశమై ధరల పెంపు విషయమై నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.
ధరలపై నియంత్రణ
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా ప్రాసెసింగ్ ప్లాంట్స్, సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ నిర్ధేశించిన ధరలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇకనుంచి 100 కౌంట్ కిలో రూ.200కు తక్కువ కాకుండా కొనుగోలు చేసేలా ఆదేశించాం. తక్కువ ధరకు కొనుగోలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం.
– కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment