కళ్లికోట ప్రాథమిక పాఠశాల వద్ద తిరుగుతున్న ఏనుగు
విజయనగరం, కొమరాడ/ జియ్యమ్మవలస : నియోజకవర్గ ప్రజ లకు గజరాజుల బెడద తప్పడం లేదు. గతేడాది సెప్టెంబర్ ఐదున నియోజకవర్గంలోకి వచ్చిన ఎనిమిది ఏనుగుల గుంపులో ఒక గున్న ఏనుగు ప్రమాదవశాత్తూ ఆర్తాం గ్రామ సమీపంలో విద్యుదాఘాతంతో మృతి చెందింది. మిగిలిన ఏడు ఏనుగుల గుంపులో కూడా ఒకటి విడిపోయింది. అప్పటి నుంచి ఆరు ఏనుగుల గుంపు నాగావళి నది దాటుకుని జియ్యమ్మవలస మండలంలోని బిత్రపాడులో తిష్టవేశాయి. చెరుకు, అరటి పంటలను నాశనం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆరు ఏనుగుల గుంపులో మళ్లీ ఒక ఏనుగు తప్పిపోయి దుగ్గి, కళ్లికోట పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కళ్లికోటకు చెందిన బుందాన గంగులు (60)పై దాడి చేసింది. ప్రస్తుతం అతను పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నివారణ చర్యలు శూన్యం.
ఏనుగులు తరిలించే ప్రయత్నంలో అధికారులు చేపడుతన్న చర్యలు తూతూమంత్రంగా ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు నెలల కిందట వచ్చిన ఏనుగులను తరలించడంలో అధికారులు ఎందుకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏనుగులను శాశ్వతంగా తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment