
గరుగుబిల్లి: మండలంలోని గొట్టివలస, మరుపెంట, శివ్వాం, రావుపల్లి తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు శివ్వాం సమీపంలోని కుడికాలువ పరిసరాల్లో సోమవారం హల్‌చల్ చేశాయి. పంట పొలాలను కుమ్మేస్తున్నాయి. వరి, కూరగాయల పంట లను నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ రేంజర్ మురళీకృష్ణతో పాటు ఇతర సిబ్బంది ఏనుగులు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఏనుగులు తరలించేందుకు అటవీ, రెవెన్యూ శాఖ చేసిన ప్రయత్నాలు ఏవీ సఫలం కాకపోవడంతో ప్రజల గుండెల్లో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏ గ్రామంపై పడి ప్రజలపై దాడులు చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కోరుతున్నారు.