సాక్షి, హైదరాబాద్: జాతి ఔన్నత్యం సాహిత్యంలో ప్రతిఫలిస్తుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సాహితీ పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ యుగంలోనైనా రాజులు ఎన్ని యుద్ధాలు చేశారు.. ప్రజలు ఏ భోగభాగ్యాలు అనుభవించారనేదిగాక ఆ జాతి సంస్కారం, ఆ యుగంలో వర్ధిల్లిన సాహిత్యం, సంస్కృతులు మాత్రమే తర్వాత తరాలకు నిలుస్తాయని చెప్పారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు.
ఈ ఏడాది నవలకు అవార్డులు ఇవ్వలేదని, వచ్చిన నవలల్లో దేనినీ న్యాయనిర్ణేతలు ఆమోదించనందున ప్రకటించలేదని వివరించారు. త్వరలో కీర్తి పురస్కారాలను అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ర్టం విడిపోయినా తెలుగు భాష గొప్పదనం దెబ్బతినకుండా చూస్తామని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నటునిగా తొలినాళ్లలో సన్మానాలు ఎవరు చేస్తారని ఎదురు చూసిన రోజులున్నాయని, అలాంటి తనకు ఎంతోమంది సాహితీమూర్తులను సన్మానించడం ఆనందాన్నిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలు ఒక్కొక్కరికి 20,116 నగదు, శాలువా, పురస్కార పత్రం అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం, డాక్టర్ జె.చెన్నయ్య, ఆర్.రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
జాతి ఔన్నత్యం సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది
Published Fri, Oct 4 2013 6:03 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM
Advertisement
Advertisement