జామి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగు బంగారమైన జామి ఎల్లారమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం తొలేళ్లు, ఆదివారం జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాతరకు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఏడాదీ ఫాల్గుణ శుద్ధ అష్టమి రోజున జాతర నిర్వహిస్తారు.
తొలేళ్లు..
జాతర అనువంశిక అర్చకుడు ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. శనివారం రాత్రి 11.15 గంటలకు పూజారి ఇంటి వద్ద అమ్మవారిని గద్దె నుంచి దింపి ఊరేగింపు చేపడతారు. గ్రామ పురవీధుల గుండా సాగిన ఊరేగింపు ఆలయానికి చేరుకున్న తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోకి తీసుకువెళ్తారు. ఈ సమయంలో అమ్మవారి చరిత్రను జముకుల కళాకారులు కథా రూపంలో వివరిస్తారు. మొదటి రోజు ఉత్సవంలో కోలాటం, నృత్య ప్రదర్శనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆదివారం జరగనున్న జాతరలో భారీఎత్తున బాణసంచా కాలుస్తారు.
ఏర్పాట్లు పూర్తి : ఈఓ వినోదీశ్వరరావు
జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని ఈఓ వినోదీశ్వరరావు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసినట్లు చెప్పారు. కమిటీ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి వీఐపీ పాస్‌లు మంజూరు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొత్తలి శ్రీనివాస్ తెలిపారు.