ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రకటన (PC: ECB X)
పాకిస్తాన్‌లో చేదు అనుభవం చవిచూసిన ఇంగ్లండ్ తదుపరి మరో పర్యటనకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం తమ జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.
కాగా బెన్ స్టోక్స్ బృందం ఇటీవల పాకిస్తాన్‌లో మూడు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పాక్ గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్.. రెండు, మూడో టెస్టుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది. ‘బజ్‌బాల్’కు కళ్లెం వేసిన పాక్ స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో 1-2తో ఇంగ్లండ్ పాకిస్తాన్‌కు సిరీస్‌ను కోల్పోయింది.
కివీస్‌తో మూడు టెస్టులు
ఈ క్రమంలో నవంబరు 28 నుంచి ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆరంభం కానున్న ఈ సిరీస్‌కు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన జేమీ స్మిత్ దూరమయ్యాడు. అతడు పెటర్నిటీ సెలవులో వెళ్లిన కారణంగా.. జోర్డాన్ కాక్స్ వికెట్ కీపర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
మరోవైపు.. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించిన ఆల్‌రౌండర్ జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 20 మ్యాచ్‌లు ఆడిన జాకోబ్ 738 పరుగులు చేశాడు. అదే విధంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అతడు ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈసారి అరంగేట్రం పక్కా
మరోవైపు.. కాక్స్ 53 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 3194 పరుగులతో రాణించాడు. దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారించినప్పటికీ అతడు ఇంతవరకు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. శ్రీలంక సిరీస్ నుంచి జట్టుతోనే ఉన్నా ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.
ఈసారి మాత్రం ఈ వికెట్ కీపర్ బ్యాటర్ టెస్టు క్యాప్ అందుకునే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక కివీస్‌తో సిరీస్ ఆడే జట్టులో ముగ్గురు స్పిన్నర్లు జాక్ లీచ్, షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్‌లకు కూడా చోటిచ్చారు సెలక్టర్లు.
కాగా 2008 తర్వాత ఇంగ్లండ్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవకపోవడం గమనార్హం. ఇక కివీస్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది.
న్యూజిలాండ్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్(కెప్టెన్), రేహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకోబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జాక్ లీచ్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.
చదవండి: Mumbai Pitch: కివీస్‌తో మూడో టెస్టు.. తొలిరోజు వారికే అనుకూలం!?
Comments
Please login to add a commentAdd a comment