ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్
కర్నూలు(జిల్లా పరిషత్): ‘ఎంపీటీసీలు, జడ్‌పీటీసీ సభ్యులకు నిధులు, అధికారాలు ఇస్తే ఎక్కడ బాగా పనిచేస్తారోనని.. వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని అన్ని రాజకీయ పార్టీలు ఎదగనీయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా, ఆరవ వేలుగా మార్చాయి.’’ అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఏపీ పంచాయతీ చాంబర్, జిల్లా ఎంపీటీసీల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మౌర్య ఇన్‌లోని పరిణయ ఫంక్షన్‌హాలులో ఎంపీటీసీ సభ్యుల సదస్సు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇతర ప్రజాప్రతినిదుల తరహాలో ఎంపీటీసీలు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినా వారికి నామమాత్రపు గౌరవం ఇస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ చేసి ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలకు క్రియాశీలక అధికారాలు, నిధులు, విధులు తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా ఎంపీటీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యం కాదని, ఎంపీటీసీలకు అందుతున్న గౌరవం ప్రధానమన్నారు. రాజకీయాలకు స్థానిక ప్రజాప్రతినిదులందరూ పంచాయతీరాజ్ పార్టీగా ఉండాలన్నారు.
ప్రజలకు ఏవైనా సమస్యలొస్తే ముందుగా ప్రశ్నించేది స్థానిక ప్రజాప్రతినిదులనేనన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక అవసరాలు తీర్చే బాద్యత పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. స్థానిక సంస్థలన్నీ ప్రభుత్వాలుగా మారినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిదులకు ఇచ్చే గౌరవ వేతనం కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెంచిన మాదిరిగానే ఇక్కడా స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని, తక్షణమే నిధులు, విధులు, బాధ్యతలు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పమిడి వెంకటరావు మాట్లాడుతూ ఎంపీటీసీల ఉద్యమానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. స్థానిక సంస్థల్లో సగం నిధులు ఎంపీటీసీల ద్వారా ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ పనులను గ్రామస్థాయిలో రూ.5లక్షలకు, మండల స్థాయిలో రూ.10లక్షలకు పెంచాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
సమావేశంలో ఏపీ సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఏపీ చాంబర్ ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య, విశాఖ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు వినోద్‌రాజు, కృష్ణాజిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు మురళి, చిత్తూరు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కిరణ్‌యాదవ్, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మీనాక్షినాయుడు, ఎంపీపీల సంఘం జిల్లా కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ సభ్యులను అణగదొక్కొద్దు
Published Wed, Apr 1 2015 2:53 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement