►అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగనున్న బదిలీలు
►వారికి నచ్చితే సరి.. లేదంటే మరో చోటుకు
►ఐదేళ్లు పూర్తి అయిన గెజిటెడ్ అధికారులకు జిల్లా మార్పిడి
►ఇతర ఉద్యోగులను సొంత మండలాల్లో వేయొద్దని ఆదేశం
జడ్పీ ఉద్యోగులలో సందిగ్ధత
ఇంతవరకు జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి బదిలీల పక్రియను జడ్పీ చెర్మైన్, జడ్పీ సీఈవోలు మాత్రమే నిర్వహించడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం ఇన్‌ఛార్జి మంత్రి చెర్మైన్‌గా ఏర్పడిన కమిటీ జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుందా.. లేక జడ్పీ చెర్మైన్, సీఈవోలే నిర్వహిస్తారా అన్న సందిగ్ధంలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి సంబంధించి కూడా జీవోలో ఎలాంటి వివరాలు పొందుపరచలేదు. అందుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాక్షి, కడప : అనుకున్నదొక్కటి.. అయ్యింది మరొకటి.. అన్నట్లు తయారైంది గెజిటెడ్ అధికారుల పరిస్థితి. కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరుగుతాయనుకుంటే అధికార పార్టీ నేతలకు ప్రాబల్యాన్ని పెంచుతూ, ఇన్‌ఛార్జి మంత్రి సిఫార్సులకు పెద్ద పీట వేస్తూ.. మంత్రుల కనుసన్నల్లోనే బదిలీలు జరగాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గెజిటెడ్ అధికారులను సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అధికారులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది.
అవసరమైన మేరకే బదిలీలు నిర్వహిస్తామంటూనే.. అనుకూలమైన వారందరికీ కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చేలా పథక రచన చేశారు. ఈనెల 18 నుంచి 31 వరకు బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలోని ఆయా శాఖల్లో బదిలీకు సంబంధించిన జాబితాను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రెండేళ్లు పూర్తి అయిన వారికి బదిలీ లేకపోయినా.. ‘అవసరం మేరకు’ అనే కారణంతో తమకు కావాల్సిన వారికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పెద్దపీట వేయనున్నారు. సరిపోకపోతే ఏదో ఒక కారణం చెప్పి మండలం దాటించే ప్రమాదం ఉందని ఎన్‌జీఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండేళ్లు పూర్తి అయిన వారు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
గెజిటెడ్ అధికారులకు ఝలక్..
ప్రభుత్వం సోమవారం రాత్రి జారీ చేసిన జీవో నెంబరు 57లో గెజిటెడ్ అధికారులకు కొంత షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించి సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు ఇది వర్తిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. బదిలీల జాబితాలో లేని గెజిటెడ్ అధికారులెవరైనా సొంత జిల్లాల్లో పనిచేస్తుంటే వారికీ బదిలీ తప్పదా.. లేక కనీస కాల పరిమితి ముగిసే వరకు వేచి చూస్తారా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎన్‌జీఓలను సైతం సొంత మండలానికి కాకుండా ఇతర మండలాలకు బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
కొన్ని శాఖలకు త్వరలో ఉత్తర్వులు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని శాఖలకు సంబంధించి బదిలీలను మినహాయించింది. ఆ శాఖలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొంది. ఎక్సైజ్, రవాణా, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, విద్య, మెడికల్ అండ్ హెల్త్ తదితర శాఖలకు సంబంధించిన బదిలీలు త్వరలో జరుపుకొనేలా ఆదేశాలు ప్రత్యేకంగా రానున్నాయి.
రంగు పడుద్ది!
Published Wed, May 20 2015 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement