వారిది సమైక్య ఆకాంక్ష.. ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి
Published Sun, Sep 29 2013 4:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
టెక్కలి, న్యూస్‌లైన్: సాధారణ రోజుల్లోనే అధికారుల కళ్లుగప్పో.. అమ్యామ్యాలు సమర్పించుకునో అక్రమ రవాణా సాగించే వారికి.. సమైక్యాంధ్ర ఉద్యమం ఆయాచిత వరంగా మారింది. అన్ని శాఖలతోపాటు మైన్స్ సిబ్బంది, అధికారులు కూడా సమ్మెలో ఉండటంతో అక్రమ రవాణాదారుల పంట పండింది. తనిఖీలు లేవు.. నిబంధనలు పట్టించుకునేవారూ లేదు. రాజమార్గాల్లో గ్రానైట్, ఇసుక రవాణాకు గేట్లు బార్లా తెరుచుకున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద సరిహద్దు దాటుతుండగా.. లక్షల్లో సర్కారు ఖజానాకు కన్నం పడుతోంది. పోలీసులు సమ్మెకు దూరంగా ఉన్నప్పటికీ వారికి అందాల్సినవి అందిపోతున్నాయి. అతి కీలకమైన హౌరా-చెన్నై జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతోపాటు.. ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో శ్రీకాకుళం జిల్లాలో అతి విలువైన అక్రమ రవాణా జోరు పెరిగింది. మామూలు రోజుల్లోనే రాత్రి వేళల్లో జరిగే ఈ అక్రమ రవాణా ఇప్పుడు పగటిపూట కూడా యథేచ్ఛగా సాగుతోంది. నిరంతర తనిఖీలతో అక్రమ రవాణాను అరికట్టాల్సిన గనుల శాఖ అధికారులు,
సిబ్బంది సమ్మెలో ఉండటంతో అక్రమార్కులకు జాతీయ రహదారే రాజమార్గంగా మారింది. శ్రీకాకుళం, పొందూరు, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, మెళియాపుట్టి, నందిగాం, పలాస, కంచిలి తదితర మండలాల నుంచి విలువైన గ్రానైట్ బ్లాకులు ఎటువంటి పర్మిట్లు లేకుండానే ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. వీటి కంటే ఎక్కువ పరిమాణంలో బ్లాకులు క్వారీల నుంచి నేరుగా స్థానిక కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లకు చేరుతున్నాయి. ఈ వ్యవహారాలన్నింటికీ ఖచ్చితంగా మైన్స్ ఏడీ అనుమతులు, పర్మిట్లు అవసరం. కానీ సమ్మె కారణంగా పర్మిట్లు లేకుండానే తరలించేస్తున్నారు. ఈ విధంగా గత నెలన్నర రోజుల్లో సుమారు 5 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ తరలిపోయిందని అంచనా. దీనితోపాటు నిర్మాణాలకు అవసరమైన ఇసుక అక్రమ రవాణా కూడా బాగా పెరిగింది.
నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్, మెళియాపుట్టి తదితర మండలాల్లో వంశధార నదీలోని ఇసుకను రాత్రి వేళల్లో లారీల్లోకి ఎక్కించి అక్రమంగా తరలిస్తున్నారు. సమ్మెలో లేని పోలీసులు మామూళ్లు దండుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక జిల్లాలో తయారవుతున్న అల్యూమినియం వస్తువుల అక్రమ రవాణా సైతం జోరుగానే సాగుతోంది. టె క్కలికి చెందిన ఓ వ్యాపారి ఎచ్చెర్ల, టెక్కలిలో ఉన్న తన ఫ్యాక్టరీల నుంచి సరుకులను రాత్రి వేళల్లో ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు సన్న బియ్యాన్ని ఒడిశాలోకి తరలిస్తుండగా.. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమ మద్యం పెద్ద ఎత్తున జిల్లాలోకి తరలివస్తోంది.
సమ్మెతో తనిఖీలు నిల్
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర జిల్లాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మిన హా మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సుమారు నెలన్నర రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వాణిజ్య పన్నులు, మైన్స్, రవా ణా, రెవెన్యూ, విజిలెన్స్ తదితర శాఖలు కూడా సమ్మెలో ఉండటంతో వాటి అనుమతులు పొందేందు కు అవకాశం లేదు. అయితే రవాణా మాత్రం ఆగడం లేదు. కోట్లాది రూపాయల విలువైన ఖని జాలు, ఇతరత్రా వస్తుసామగ్రి సరిహద్దులు దాటుతూ ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. గ్రానైట్ వ్యాపార కేంద్రంగా ఉన్న టెక్కలిలోనే అత్యధికంగా అక్రమ మైనింగ్‌తో పాటు బ్లాకుల తరలింపు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమచారం. ఒకవైపు ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు పనులు, జీతాల్లేకుండా ఉద్యమాలు చేస్తుంటే.. అక్రమ వ్యాపారులు మాత్రం కాసుల పంట పండించుకుంటున్నారు.
Advertisement