Government Income
-
2 నెలలు.. రూ.28 వేల కోట్ల రాబడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఖజానా ప్రస్తుత పరిస్థితేంటి? ఆదాయం బాగానే వస్తోందా? గతంతో పోలిస్తే తగ్గిందా? సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు లాంటి చెల్లింపులకు నెలసరి రాబడులు సరిపోతున్నాయా? ప్రభుత్వం అప్పులు తీసుకుంటోందా? తీసుకుంటే ఎంత తీసుకుంది? కేంద్రం ఏమైనా సాయం చేస్తోందా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారం చేపట్టిన నేపథ్యంలో..సహజంగానే తలెత్తే ఇలాంటి పలు సందేహాలకు ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాలు జవాబిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 2 నెలల (డిసెంబర్, జనవరి)కు సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాలను కంప్ట్రోలర్ అండర్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ వివరాల ప్రకారం.. గత డిసెంబర్, జనవరి నెలలకు కలిపి ప్రభుత్వ ఖజానాకు రూ.28 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. పన్ను రాబడులు, అప్పులు ఇలా.. పన్ను రాబడుల శాఖలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే..ఎక్సైజ్ ఆదాయం రెండు నెలల్లో రూ.3,300 కోట్ల మేర సమకూరింది. జీఎస్టీ పద్దు కింద రూ.7,500 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,300 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.5,400 కోట్లు సమకూరాయి. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో రూ.1,300 కోట్లకు పైగా ఇవ్వగా, అప్పుల కింద రూ.2,700 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. ఇక పన్నేతర ఆదాయం కింద రూ.1,048 కోట్లు వచ్చాయి. మొత్తం మీద 2023 నవంబర్ చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ పద్దు రూ. 1,49,316.41 కోట్లు ఉండగా 2024 జనవరి నాటికి రూ. 1,77,742.13 కోట్లకు చేరింది. -
బీరు బుస్సు.. పన్ను తుస్సు!
సాక్షి, హైదరాబాద్ : ముద్దుగా డ్రాట్ బీర్.. లేదా మైక్రో బ్రూవరీ.. ఇలా పేరేదైనా సొంతంగా బీర్లు తయారు చేసుకొని అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న మాల్స్.. పన్నుకు మాత్రం ఎగనామం పెడుతున్నాయి. బీర్లు తయారు చేసి అక్కడే అమ్ముకుంటున్న ఈ మాల్స్.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 70 శాతం వ్యాట్‌ను తమ జేబుల్లోకి వేసుకుంటున్నాయి. డ్రాట్ బీర్లు తయారు చేసి అమ్ముకునే మాల్స్, పబ్‌ల సంఖ్య తక్కువే అయినా జరిగే వ్యాపారం కోట్లలో ఉండడంతో ఏటా రూ.30 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఈ మాల్స్, పబ్‌లకు రాష్ట్రంలోని ఓ మంత్రి అండదండలు ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా పన్నుల శాఖ అధికారులు వెనుకాడుతుండటం గమనార్హం. నెలకు 20 లక్షల పైనే.. ఎక్సైజ్ శాఖ 2015లో డ్రాట్‌బీర్లకు రాష్ట్రంలో అనుమతి ఇచ్చింది. మాల్స్ లేదా పబ్‌లలో సొంత తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని కొన్ని ముడి సరుకుల ద్వారా అక్కడికక్కడే బీర్లను తయారు చేసుకుని అమ్ముకునేందుకు మైక్రో బ్రూవరీల పేరుతో వీటికి అనుమతించింది. మగ్లు, లీటర్లలో ఉండే ఈ బీర్లకు యువతలో క్రేజ్ ఎక్కువగా కనిపించడంతో 2016, 17 సంవత్సరాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 25 వరకు మాల్స్ ఏర్పడ్డాయి. వీటిలో వారాంతాలు, ఇతర సెలవు దినాల్లో డ్రాట్ బీర్లకు ఫుల్లు గిరాకీ ఉంటుంది. కిక్ కొంచెం తక్కువగా ఉండే ఈ బీర్ల వైపు యువత మొగ్గు చూపింది. ఏడాది తర్వాత కాస్త క్రేజ్ తగ్గడంతో కొన్ని మాల్స్ మూతపడ్డాయని అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద దాదాపు 20 వరకు మెక్రో బ్రూవరీలు జీహెచ్ఎంసీ పరిధిలో నడుస్తున్నాయని అధికారులు చెపుతున్నారు. ఒక్కో మాల్లో నెలకు కనీసం రూ.20 లక్షల వరకు డ్రాట్ బీర్ల వ్యాపారం జరుగుతోంది. అండదండలెవరివి? మొదటి అమ్మకందారు (ఫస్ట్ సెల్లర్)గా ఈ మాల్స్ యాజమాన్యాలు తమ వ్యాపారంలో 70 శాతాన్ని వ్యాట్ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ గత రెండేళ్లుగా ఈ మాల్స్ నుంచి రూపాయి కూడా పన్ను రావడం లేదని సమాచారం. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయని తెలుస్తోంది. నెలకు రూ.14 లక్షల చొప్పున కనీసం 15–20 మాల్స్‌లో రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాలి. అంటే ఏడాదికి రూ.30 కోట్లపైనే! ఇంత మొత్తాన్ని ఇష్టారాజ్యంగా మైక్రో బ్రూవరీలు ఎగ్గొడుతున్నా పన్నుల శాఖ అధికారులు కనీసం నోటీసులివ్వడం లేదు. మాల్స్‌లో పన్ను ఎగవేతను ఓ సర్కిల్ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, వాటికి ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే కారణంతోనే నోటీసులు ఇవ్వడం లేదన్న చర్చ ఇప్పుడు పన్నుల శాఖ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
మా ఇసుకతో మీ వ్యాపారమా?
మోటుమాల (కొత్తపట్నం): మండలంలో ఇసుక రీచ్‌లు వివాదంగా మారుతున్నాయి. తీర ప్రాంతంలో ఇసుక తవ్వకంలో ఐదు గ్రామాలకు ముప్పు పొంచి ఉందని కొద్దికాలంగా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆదాయం కోసం ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయాలని భావించడంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని మోటుమాలలో ఇసుక రీచ్‌ను కలెక్టర్ విజయకుమార్, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శనివారం ప్రారంభించారు. ఇసుక తవ్వకంతో ఐదు గ్రామాలకు ముప్పు ఉందని కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చేందుకు ఆ ప్రాంత గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. కలెక్టర్‌ను కలవనీయకుండా ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు జత కలిశారు. అర్జీలిచ్చేందుకు వెళ్తుంటే పోలీసులు ప్రజలను నెట్టి బయటకు పంపారు. దీనికి ముందు మహిళలు, గ్రామస్తులు ఎవరూ సభకు రావొద్దని ఎస్సై బి.నరసింహారావు హెచ్చరించారు. ఒకరినో, ఇద్దరినో అనుమతిస్తానని చెప్పారు. దీంతో వారికి కలెక్టర్‌ను కలిసే అవకాశం లేకుండా పోయింది. కలెక్టర్ రీచ్‌ను ప్రారంభించి వెళ్లిన తర్వాత ఇసుక లోడ్ చేసిన ట్రాక్టర్‌ను అడ్డుకుని స్థానిక మహిళలు దాని డోర్లు ఊడదీసి ఇసుకను పారబోసారు. ఈ సందర్భంగా మోటుమాల సర్పంచ్ పురిణి బ్రహ్మారెడ్డి, మోటుమాల ఎంపీటీసీ కోడూరి సులోచన మాట్లాడుతూ 1996కు ముందు పాదర్తి, మోటుమాల గ్రామాలు ఒకే పంచాయతీలో కొనసాగాయని, 1996 తర్వాత సర్వే నం.465లో 115 ఎకరాలు మోటుమాల పంచాయతీకి అప్పటి కలెక్టర్ శర్మ అప్పగించారని వివరించారు. రహస్యంగా ఐకేపీ అధికారుల కమిటీ రహస్యంగా అధికార పార్టీ అండతో పాదర్తి గ్రూపు సంఘాలతో కమిటీ వేశారని ప్రజలు వాపోతున్నారు. పాదర్తి గ్రామానికి 26 గ్రూపులు, మోటుమాల 68 గ్రూపులున్నాయి. ఈ భూమి 1996లో అప్పటి కలెక్టర్ శర్మ మోటుమాలకు ఇచ్చినట్లు ఉత్తర్వులన్నాయి. తమ గ్రామాన్ని పక్కనబెట్టి పాదర్తికి అనుమతి ఇవ్వడం ఎంత వరకు సమంజసమని డీఆర్డీఏ పీడీని మహిళలు ప్రశ్నించారు. తవ్వకాలు ఆపకుంటే ట్రాక్టర్లను అడ్డుకుంటామని గ్రామస్తులు, మహిళలు హెచ్చరించారు. -
తగ్గిన రాబడి
నల్లగొండ : ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రధాన శాఖలు వెలవెలబోతున్నాయి. కొంతకాలంగా ఆయా శాఖల పనితీరు అస్తవ్యస్తంగా మారడంతో ప్రభుత్వ రాబడి పూర్తిగా తగ్గిపోయింది. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత కళకళలాడాల్సిన ప్రభుత్వ శాఖలు బోసిపోతున్నాయి. గతేడాది నుంచే ఆయాశాఖల్లో రెవెన్యూ లోటు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ దానిని గాడిన పెట్టేందుకు యంత్రాంగం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలూ చేపట్టలేదు. దీంతో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాణిజ్య పన్నులశాఖ పన్ను వసూళ్లు చేయడంలో మొద్దునిద్ర పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల క్రయ, విక్రయాలు ఎక్కడికక్కడే నిలిచిపోవ డంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఈ ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపైన తీవ్రంగానే పడింది. వీటితోపాటు ఆదాయపన్ను, రవాణా, ఎక్సైజ్ శాఖల ఆదాయంకూడా అంతంతమాత్రంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొంత చిక్కుముడి ఏర్పడడంతో నెలరోజులపాటు రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. వీటిని మినహాయిస్తే పన్ను రికవరీలు, ఫీజుల వసూళ్లలో రవాణాశాఖ వెనకబడే ఉంది. మద్యం అమ్మకాలు గతేడాది జూన్‌తో పోలిస్తే ఈసారి భారీగా తగ్గాయి. కొత్త దుకాణాలకు టెండర్లు పిలిచిన నేపథ్యంలో వ్యాపారులు మద్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ఆదాయపన్ను వసూళ్లలో కూడా ఆ శాఖ వెనుకబడిపోయింది. శాఖల పనితీరులో మార్పు రాకుండా ఇదే పద్ధతి కొనసాగినట్లయితే మున్ముందు ప్రభుత్వానికి మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మొక్కుబడి వసూళ్లు... జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వాటిలో..ప్రధానంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మరుసటి ఏడాది మార్చి వరకు ఉంటుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సర ఆరంభంలో ఎన్నికల హడావిడి, రాష్ట్ర విభజన కసరత్తులో యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. దీనినే అదునుగా తీసుకున్న పలు శాఖలు పన్నులు వసూలు చేయకుండా సొంత లాభంపైనే దృష్టి పెట్టాయన్న విమర్శలున్నాయి. దీంతో గడిచిన మూడు మాసాల్లో ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల అధికారులు ఆదాయాన్ని రాబట్టడంలో విఫలమయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ ... పన్నులు వసూలు చేయడంలో ముందుండాల్సిన వాణిజ్య పన్నుల శాఖ వెనుకబడింది. అధికారులు స్ట్రీట్ సర్వేలు నిర్వహించి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. గతేడాది ఈ శాఖ లక్ష్యం రూ.821.52 కోట్లు కాగా కేవలం రూ.621.47 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక కొత్త రాష్ట్రంలో మేలో రూ.94.98 కోట్లకుగాను కేవలం రూ.17.45 కోట్లు మాత్రమే వసూలు చేసింది. జూన్‌లో రూ.102 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. రూ.84.96 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఆదాయపన్ను శాఖ.. ఆదాయపన్ను శాఖ 2013-14 ఆర్థిక సంవ త్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా రూ.9 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నల్లగొండ డివిజన్ పరిధిలోనే మిగిలిన రూ.4 కోట్లు వసూలు కావాల్సి ఉంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ... జిల్లా వ్యాప్తంగా రియల్ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉండడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం భూముల విలువలుపెంచడంతోపాటు, రిజిస్ట్రేషన్ల చార్జీలు కూడా పెంచింది. దీంతో గతేడాది రూ.202.33 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.172.39 కోట్లు మాత్రమే వచ్చిం ది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. మేలో నిర్దేశించిన లక్ష్యం రూ.17.61 కోట్లకుగాను రూ.8.70 కోట్లు మాత్రమే వచ్చింది. జూన్‌లో రూ.18.78 కోట్లకుగాను కేవలం రూ.11.28 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. రవాణా శాఖ... వాహనాల రిజిస్ట్రేషన్లు, టాక్సీలు, పన్నుల రికవరీ ద్వారా గతేడాది రవాణా శాఖకు రూ. 118.46 కోట్లకు గాను రూ.90 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మేలో రూ.10.42 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.6.92 కోట్లు మాత్రమే సమకూరింది. జూన్‌లో రూ.9.32 కోట్లకు గాను రూ.6.30 కోట్లు మాత్రమే వచ్చింది. ఎక్సైజ్ శాఖ... మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి గతేడాది జూన్‌లో రూ.57.09 కోట్ల ఆదాయం రాగా..ఈ ఏడాది జూన్‌లో 56.19 కోట్లకు తగ్గింది. దీంతో కిందటేడుతో పోలిస్తే ఈ దఫా రూ.90 లక్షలకు పడిపోయింది. బీర్లతో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు పడిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. -
వారిది సమైక్య ఆకాంక్ష.. ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి
టెక్కలి, న్యూస్‌లైన్: సాధారణ రోజుల్లోనే అధికారుల కళ్లుగప్పో.. అమ్యామ్యాలు సమర్పించుకునో అక్రమ రవాణా సాగించే వారికి.. సమైక్యాంధ్ర ఉద్యమం ఆయాచిత వరంగా మారింది. అన్ని శాఖలతోపాటు మైన్స్ సిబ్బంది, అధికారులు కూడా సమ్మెలో ఉండటంతో అక్రమ రవాణాదారుల పంట పండింది. తనిఖీలు లేవు.. నిబంధనలు పట్టించుకునేవారూ లేదు. రాజమార్గాల్లో గ్రానైట్, ఇసుక రవాణాకు గేట్లు బార్లా తెరుచుకున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద సరిహద్దు దాటుతుండగా.. లక్షల్లో సర్కారు ఖజానాకు కన్నం పడుతోంది. పోలీసులు సమ్మెకు దూరంగా ఉన్నప్పటికీ వారికి అందాల్సినవి అందిపోతున్నాయి. అతి కీలకమైన హౌరా-చెన్నై జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతోపాటు.. ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో శ్రీకాకుళం జిల్లాలో అతి విలువైన అక్రమ రవాణా జోరు పెరిగింది. మామూలు రోజుల్లోనే రాత్రి వేళల్లో జరిగే ఈ అక్రమ రవాణా ఇప్పుడు పగటిపూట కూడా యథేచ్ఛగా సాగుతోంది. నిరంతర తనిఖీలతో అక్రమ రవాణాను అరికట్టాల్సిన గనుల శాఖ అధికారులు, సిబ్బంది సమ్మెలో ఉండటంతో అక్రమార్కులకు జాతీయ రహదారే రాజమార్గంగా మారింది. శ్రీకాకుళం, పొందూరు, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, మెళియాపుట్టి, నందిగాం, పలాస, కంచిలి తదితర మండలాల నుంచి విలువైన గ్రానైట్ బ్లాకులు ఎటువంటి పర్మిట్లు లేకుండానే ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. వీటి కంటే ఎక్కువ పరిమాణంలో బ్లాకులు క్వారీల నుంచి నేరుగా స్థానిక కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లకు చేరుతున్నాయి. ఈ వ్యవహారాలన్నింటికీ ఖచ్చితంగా మైన్స్ ఏడీ అనుమతులు, పర్మిట్లు అవసరం. కానీ సమ్మె కారణంగా పర్మిట్లు లేకుండానే తరలించేస్తున్నారు. ఈ విధంగా గత నెలన్నర రోజుల్లో సుమారు 5 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ తరలిపోయిందని అంచనా. దీనితోపాటు నిర్మాణాలకు అవసరమైన ఇసుక అక్రమ రవాణా కూడా బాగా పెరిగింది. నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్, మెళియాపుట్టి తదితర మండలాల్లో వంశధార నదీలోని ఇసుకను రాత్రి వేళల్లో లారీల్లోకి ఎక్కించి అక్రమంగా తరలిస్తున్నారు. సమ్మెలో లేని పోలీసులు మామూళ్లు దండుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక జిల్లాలో తయారవుతున్న అల్యూమినియం వస్తువుల అక్రమ రవాణా సైతం జోరుగానే సాగుతోంది. టె క్కలికి చెందిన ఓ వ్యాపారి ఎచ్చెర్ల, టెక్కలిలో ఉన్న తన ఫ్యాక్టరీల నుంచి సరుకులను రాత్రి వేళల్లో ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు సన్న బియ్యాన్ని ఒడిశాలోకి తరలిస్తుండగా.. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమ మద్యం పెద్ద ఎత్తున జిల్లాలోకి తరలివస్తోంది. సమ్మెతో తనిఖీలు నిల్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర జిల్లాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మిన హా మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సుమారు నెలన్నర రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వాణిజ్య పన్నులు, మైన్స్, రవా ణా, రెవెన్యూ, విజిలెన్స్ తదితర శాఖలు కూడా సమ్మెలో ఉండటంతో వాటి అనుమతులు పొందేందు కు అవకాశం లేదు. అయితే రవాణా మాత్రం ఆగడం లేదు. కోట్లాది రూపాయల విలువైన ఖని జాలు, ఇతరత్రా వస్తుసామగ్రి సరిహద్దులు దాటుతూ ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. గ్రానైట్ వ్యాపార కేంద్రంగా ఉన్న టెక్కలిలోనే అత్యధికంగా అక్రమ మైనింగ్‌తో పాటు బ్లాకుల తరలింపు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమచారం. ఒకవైపు ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు పనులు, జీతాల్లేకుండా ఉద్యమాలు చేస్తుంటే.. అక్రమ వ్యాపారులు మాత్రం కాసుల పంట పండించుకుంటున్నారు.