తగ్గిన రాబడి
నల్లగొండ : ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రధాన శాఖలు వెలవెలబోతున్నాయి. కొంతకాలంగా ఆయా శాఖల పనితీరు అస్తవ్యస్తంగా మారడంతో ప్రభుత్వ రాబడి పూర్తిగా తగ్గిపోయింది. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత కళకళలాడాల్సిన ప్రభుత్వ శాఖలు బోసిపోతున్నాయి. గతేడాది నుంచే ఆయాశాఖల్లో రెవెన్యూ లోటు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ దానిని గాడిన పెట్టేందుకు యంత్రాంగం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలూ చేపట్టలేదు. దీంతో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాణిజ్య పన్నులశాఖ పన్ను వసూళ్లు చేయడంలో మొద్దునిద్ర పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
భూముల క్రయ, విక్రయాలు ఎక్కడికక్కడే నిలిచిపోవ డంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఈ ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపైన తీవ్రంగానే పడింది. వీటితోపాటు ఆదాయపన్ను, రవాణా, ఎక్సైజ్ శాఖల ఆదాయంకూడా అంతంతమాత్రంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొంత చిక్కుముడి ఏర్పడడంతో నెలరోజులపాటు రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. వీటిని మినహాయిస్తే పన్ను రికవరీలు, ఫీజుల వసూళ్లలో రవాణాశాఖ వెనకబడే ఉంది. మద్యం అమ్మకాలు గతేడాది జూన్‌తో పోలిస్తే ఈసారి భారీగా తగ్గాయి. కొత్త దుకాణాలకు టెండర్లు పిలిచిన నేపథ్యంలో వ్యాపారులు మద్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ఆదాయపన్ను వసూళ్లలో కూడా ఆ శాఖ వెనుకబడిపోయింది. శాఖల పనితీరులో మార్పు రాకుండా ఇదే పద్ధతి కొనసాగినట్లయితే మున్ముందు ప్రభుత్వానికి మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
మొక్కుబడి వసూళ్లు...
జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వాటిలో..ప్రధానంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మరుసటి ఏడాది మార్చి వరకు ఉంటుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సర ఆరంభంలో ఎన్నికల హడావిడి, రాష్ట్ర విభజన కసరత్తులో యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. దీనినే అదునుగా తీసుకున్న పలు శాఖలు పన్నులు వసూలు చేయకుండా సొంత లాభంపైనే దృష్టి పెట్టాయన్న విమర్శలున్నాయి. దీంతో గడిచిన మూడు మాసాల్లో ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల అధికారులు ఆదాయాన్ని రాబట్టడంలో విఫలమయ్యారు.
వాణిజ్య పన్నుల శాఖ ...
పన్నులు వసూలు చేయడంలో ముందుండాల్సిన వాణిజ్య పన్నుల శాఖ వెనుకబడింది. అధికారులు స్ట్రీట్ సర్వేలు నిర్వహించి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. గతేడాది ఈ శాఖ లక్ష్యం రూ.821.52 కోట్లు కాగా కేవలం రూ.621.47 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక కొత్త రాష్ట్రంలో మేలో రూ.94.98 కోట్లకుగాను కేవలం రూ.17.45 కోట్లు మాత్రమే వసూలు చేసింది. జూన్‌లో రూ.102 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. రూ.84.96 కోట్లు మాత్రమే వసూలు చేశారు.
ఆదాయపన్ను శాఖ..
ఆదాయపన్ను శాఖ 2013-14 ఆర్థిక సంవ త్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా రూ.9 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నల్లగొండ డివిజన్ పరిధిలోనే మిగిలిన రూ.4 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ...
జిల్లా వ్యాప్తంగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉండడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం భూముల విలువలుపెంచడంతోపాటు, రిజిస్ట్రేషన్ల చార్జీలు కూడా పెంచింది. దీంతో గతేడాది రూ.202.33 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.172.39 కోట్లు మాత్రమే వచ్చిం ది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. మేలో నిర్దేశించిన లక్ష్యం రూ.17.61 కోట్లకుగాను రూ.8.70 కోట్లు మాత్రమే వచ్చింది. జూన్‌లో రూ.18.78 కోట్లకుగాను కేవలం రూ.11.28 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
రవాణా శాఖ...
వాహనాల రిజిస్ట్రేషన్లు, టాక్సీలు, పన్నుల రికవరీ ద్వారా గతేడాది రవాణా శాఖకు రూ. 118.46 కోట్లకు గాను రూ.90 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మేలో రూ.10.42 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.6.92 కోట్లు మాత్రమే సమకూరింది. జూన్‌లో రూ.9.32 కోట్లకు గాను రూ.6.30 కోట్లు మాత్రమే వచ్చింది.
ఎక్సైజ్ శాఖ...
మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి గతేడాది జూన్‌లో రూ.57.09 కోట్ల ఆదాయం రాగా..ఈ ఏడాది జూన్‌లో 56.19 కోట్లకు తగ్గింది. దీంతో కిందటేడుతో పోలిస్తే ఈ దఫా రూ.90 లక్షలకు పడిపోయింది. బీర్లతో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు పడిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడింది.