సాక్షి, హైదరాబాద్/ సాక్షి, ప్రతినిధి నల్లగొండ: రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ స్థానాల్లో ఓటర్ల నమోదుకు శుక్రవారంతో గడువు ముగిసిపోగా, దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్–ఖమ్మం–నల్ల గొండపట్టభద్రుల శాసనసభ నియోజకవర్గానికి 4,70,150 మంది, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గానికి 4,71,772 మంది కలిపి మొత్తం 9,41,922 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన కాగితపు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ పూర్తైతే, మొత్తం దరఖాస్తుల సంఖ్య 10 లక్షలకు మించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం వర్గాలు తెలిపాయి.
వరంగల్ నియోజకవర్గం పరిధిలో భారీ సంఖ్యలో ఆఫ్‌లైన్ దరఖాస్తులు రావడంతో వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తైతే మహబూబ్‌నగర్ స్థానం కన్నా వరంగల్ స్థానం పరిధిలోనే అధిక దరఖాస్తులు రానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1న ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. మళ్లీ డిసెంబర్ 1 నుంచి 31 వరకు కొత్తగా ఓటర్ల నమోదు కోసం పట్టభద్రుల నుంచి దరఖాస్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
వచ్చే జనవరి 12లోగా ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి, అదే నెల 18న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. గతంలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌లోనే ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత మరోసారి కొత్త దరఖాస్తుల స్వీకరణకు నెల రోజుల అవకాశం కల్పించిందని, అయితే ఈ మేరకు హైకోర్టు కొత్తగా గడువు పొడిగించినట్టు కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు వచ్చాయని సీఈఓ కార్యాలయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment