అట్టహాసంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు కసరత్తు
దశాబ్దాల పోరాట స్వప్నం ఫలించిన వేళ... ‘జై తెలంగాణ’ అంటూ
బిగించిన ఉద్యమ పిడికిళ్లు విజయోత్సా హంతో మురిసిపోయిన మధుర
ఘట్టం... స్వరాష్ట్రంలో స్వయం పాలన చేసుకుంటామంటూ ఉద్య
మించిన వర్గాలన్నీ సగౌరవంగా సొంత రాష్ట్రంలోకి అడుగుపెట్టిన శుభ
సమయం... మా నిధులు, మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకేనంటూ ఆత్మార్ప
ణలకు వెనుకాడని అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగిన క్షణం... అదే తెలంగాణ రాష్ట్ర
అవతరణ.. జూన్2, 2014న సర్వసత్తాక భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సబ్బండ వర్ణాలు ఆకాం క్షించిన ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. జూన్2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడి అప్పుడే 365 రోజులు కావొస్తోంది. ఈ అద్భుత ఘడియలను అత్యద్భుతంగా ఆస్వాదించేందుకు ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించడంతో మొదలయ్యే రాష్ట్రావతరణ వేడుకలు ఆరు రోజులపాటు ఘనంగా జరగనున్నాయి.
తొట్ట తొలి వార్షికోత్సవం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఆరు రోజుల పాటు (జూన్ 2నుంచి 7వ తేదీ వరకు) జరిగేలా అన్ని స్థాయిలో ప్రణాళికలు తయారయ్యాయి. జూన్1వ తేదీ అర్ధరాత్రి 11గంటల 50 నిమిషాలకు జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులు, అధికారులు, ప్రముఖులు నివాళులర్పించడంతో కార్యక్రమం మొదలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అక్కడినుంచి అందరూ ర్యాలీగా ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ 11:55 నిమిషాల నుంచి 12:10 నిమిషాల వరకు బాణాసంచా కాల్చనున్నారు. ఈ బాణాసంచాలో భాగంగానే ఆకాశంలో హరివిల్లులు కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం జూన్2వ తేదీన జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వివిధ రంగాల్లోని ప్రముఖులను అవార్డులతో సత్కరించనున్నారు. ఆ తర్వాత ఎన్జీ కళాశాలలో సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను జిల్లా, డివిజన్, మండల, గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతిరోజూ నిర్వహించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
16 కమిటీ ల ఏర్పాటు
వేడుకల నిర్వహణకు 16 కమిటీలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్లుగా 13 మంది సభ్యులుగా ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ సంఘం ఈ వేడుకలను పర్యవేక్షించనుంది. దీనికి అనుబంధంగా స్వాగత సంఘం, సాంస్కృతిక కార్యక్రమ సంఘం, క్రీడల నిర్వహణ కమిటీ, కవ్వాలి నిర్వహణ సంఘం, తెలంగాణ వంటకాల ప్రదర్శన కమిటీ, బాణాసంచా వేడుకల నిర్వహణ సంఘం, వేదిక ఏర్పాటు కమిటీ, ప్రచార, రవాణా కమిటీలు, స్టాల్స్ నిర్వహణకమిటీలు, నీటి సరఫరా, పరిశుభ్రత కమిటీలు, కవిసమ్మేళనాల నిర్వహణ, సౌండ్-లైటింగ్ కమిటీలు, వసతుల కల్పన కమిటీలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీతో పాటు వివిధ కమిటీలు పలుమార్లు భేటీ అయి వేడుకల ఏర్పాట్లను సమీక్షించాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లోని పలువురు ప్రముఖులకు ఇవ్వాల్సిన అవార్డులను కూడా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే ఖరారు చేసింది.
మూడు రోజుల పాటు లేజర్‌షో
ఇక, జిల్లాలోని ప్రముఖ పర్యాటక స్థలమైన భువనగిరి ఖిలాపై లేజర్‌షో ఈసారి వేడుకల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. చరిత్రకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని, భువనగిరి ఖిలా చరిత్రను తెలియజేసేలా భువనగిరికోటపై 2, 3, 7 తేదీల్లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో లేజర్‌షో ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు దేవరకొండ కోటపై కూడా లేజర్‌షో ఏర్పాటు చేయాలని ఆలోచించినా చివరి నిమిషంలో వెనక్కు తీసుకున్నట్టు సమాచారం.
‘జయజయహే’ నృత్యప్రదర్శనతో షురూ..
తొలిసారి నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జయ జయహే తెలంగాణ నృత్య ప్రదర్శనతో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యాలు, ఏకపాత్రాభినయం, పిట్టలదొర, మైమ్, మిమిక్రీ, వెంట్రిలాక్విజం, గజల్స్, ఖవ్వాలి, ముషాయిరా, చిందు కళారూపాలు, గొల్లసుద్దులు, బుర్రకథ, హరికథ, పోలీసు కళాజాత ప్రదర్శనలను జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, గ్రామ పంచాయతీస్థాయిలో ప్రతి రోజూ ఏర్పాటు చేయనున్నారు. చివరిరోజున కవి సమ్మేళనము, క ళాకారులచే ఊరేగింపు, శోభాయాత్రలు నిర్వహించనున్నారు.
సంబురాలకు సిద్ధం
Published Wed, May 27 2015 12:29 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement