సాక్షి, హైదరాబాద్ : ముద్దుగా డ్రాట్ బీర్.. లేదా మైక్రో బ్రూవరీ.. ఇలా పేరేదైనా సొంతంగా బీర్లు తయారు చేసుకొని అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న మాల్స్.. పన్నుకు మాత్రం ఎగనామం పెడుతున్నాయి. బీర్లు తయారు చేసి అక్కడే అమ్ముకుంటున్న ఈ మాల్స్.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 70 శాతం వ్యాట్‌ను తమ జేబుల్లోకి వేసుకుంటున్నాయి. డ్రాట్ బీర్లు తయారు చేసి అమ్ముకునే మాల్స్, పబ్‌ల సంఖ్య తక్కువే అయినా జరిగే వ్యాపారం కోట్లలో ఉండడంతో ఏటా రూ.30 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఈ మాల్స్, పబ్‌లకు రాష్ట్రంలోని ఓ మంత్రి అండదండలు ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా పన్నుల శాఖ అధికారులు వెనుకాడుతుండటం గమనార్హం.
నెలకు 20 లక్షల పైనే..
ఎక్సైజ్ శాఖ 2015లో డ్రాట్‌బీర్లకు రాష్ట్రంలో అనుమతి ఇచ్చింది. మాల్స్ లేదా పబ్‌లలో సొంత తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని కొన్ని ముడి సరుకుల ద్వారా అక్కడికక్కడే బీర్లను తయారు చేసుకుని అమ్ముకునేందుకు మైక్రో బ్రూవరీల పేరుతో వీటికి అనుమతించింది. మగ్‌లు, లీటర్లలో ఉండే ఈ బీర్లకు యువతలో క్రేజ్ ఎక్కువగా కనిపించడంతో 2016, 17 సంవత్సరాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 25 వరకు మాల్స్ ఏర్పడ్డాయి. వీటిలో వారాంతాలు, ఇతర సెలవు దినాల్లో డ్రాట్ బీర్లకు ఫుల్లు గిరాకీ ఉంటుంది. కిక్ కొంచెం తక్కువగా ఉండే ఈ బీర్ల వైపు యువత మొగ్గు చూపింది. ఏడాది తర్వాత కాస్త క్రేజ్ తగ్గడంతో కొన్ని మాల్స్ మూతపడ్డాయని అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద దాదాపు 20 వరకు మెక్రో బ్రూవరీలు జీహెచ్‌ఎంసీ పరిధిలో నడుస్తున్నాయని అధికారులు చెపుతున్నారు. ఒక్కో మాల్‌లో నెలకు కనీసం రూ.20 లక్షల వరకు డ్రాట్ బీర్ల వ్యాపారం జరుగుతోంది.
అండదండలెవరివి?
మొదటి అమ్మకందారు (ఫస్ట్ సెల్లర్)గా ఈ మాల్స్ యాజమాన్యాలు తమ వ్యాపారంలో 70 శాతాన్ని వ్యాట్ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ గత రెండేళ్లుగా ఈ మాల్స్ నుంచి రూపాయి కూడా పన్ను రావడం లేదని సమాచారం. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయని తెలుస్తోంది. నెలకు రూ.14 లక్షల చొప్పున కనీసం 15–20 మాల్స్‌లో రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాలి. అంటే ఏడాదికి రూ.30 కోట్లపైనే! ఇంత మొత్తాన్ని ఇష్టారాజ్యంగా మైక్రో బ్రూవరీలు ఎగ్గొడుతున్నా పన్నుల శాఖ అధికారులు కనీసం నోటీసులివ్వడం లేదు. మాల్స్‌లో పన్ను ఎగవేతను ఓ సర్కిల్ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, వాటికి ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే కారణంతోనే నోటీసులు ఇవ్వడం లేదన్న చర్చ ఇప్పుడు పన్నుల శాఖ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Published Tue, Jul 24 2018 1:46 AM | Last Updated on Tue, Jul 24 2018 1:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment