ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్:
తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. తొలుత జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి జై తెలంగాణ ..జై జెతైలంగాణ... తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని నినాదాలు చేస్తూ మయూరిసెంటర్, బస్టాండ్, వైరారోడ్, జడ్పీసెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గరికె ఉపేందర్ అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్‌అఫ్జల్ హసన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేంతవరకు శాంతియుత పోరాటం ఆగదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషిచేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ సాధనతోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సామాజిక తెలంగాణ కోసం జరిగే పోరాటాలలోప్రజలు కలిసిరావాలన్నారు. గరికె ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం జరిగే ప్రతి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నాయకుడు నాగుబండి రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించి, తెలంగాణ ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు దేవరకొండ సైదులు,గంజి వెంకటేశం, సౌకత్‌అలీ ,సుధాకర్, దామోదర్, రంగారావు ,కరణ్‌సింగ్,నాగలక్ష్మి,నాగేశ్వరరావు,నర్సింహరావు,నరేంద్రస్వరూఫ్,గరికెసంపత్,మజిద్,సునీల్‌కుమార్,శ్రీకాంత్,శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కోసం ఉద్యోగుల శాంతిర్యాలీ
Published Fri, Sep 20 2013 2:23 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement