కాంగ్రెస్ పార్టీ అన్నంత పనిచేసింది. రాబోయే ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్ల కోసం ఎనిమిది కోట్ల తెలుగువారిని రెండుముక్కలు చేసింది.
విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేయడంతో జిల్లాలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సమైక్యవాదుల గుండెలు ఆగ్రహజ్వాలలయ్యాయి. సమైక్యవాదులు, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళన దిగారు. రాస్తారోకోలు చేశారు. సోనియాగాంధీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బుధవారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బంద్ పాటించాలని ప్రజలను కోరారు.
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ పార్టీ అన్నంత పనిచేసింది. రాబోయే ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్ల కోసం ఎనిమిది కోట్ల తెలుగువారిని రెండుముక్కలు చేసింది. తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని మంట కలిపింది. భావోద్వేగాల కోసం రాష్ట్రాలు ఏర్పాటు చేయకూడదన్న ఇందిరా గాంధీని మాటలను కూడా గంగలో కలిపింది. రాష్ట్రం విడిపోదు. మాకు స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నాడు అనే పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ మాటలు కట్టుకథలు అని తేలిపోయాయి. దీంతో ఆయన రాజకీయ సన్యాసం చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ పార్టీ కుటిలయత్నాలకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీలు వంత పాడాయి. సీమాంధ్రకు న్యాయం చేయాలంటూనే పార్లమెంట్ లో తెలంగాణకు అనుకూలంగా ఓటు వేయడం ద్వారా బీజేపీ తెలుగు తల్లి గుండెల్లో చివరి కత్తిపోటు పొడిచింది. తెలుగుజాతిని రెండుగా చీల్చడానికి కాంగ్రెస్, తెలుగుదేశం, బీజెపీ పార్టీలు ప్రధాన భూమిక పోషించాయి. తెలంగాణ బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై జిల్లాలో వ్యతిరేకత భగ్గుమంది. నిరసనలు మిన్నంటాయి. నేడు సీమాంధ్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. సీమాంధ్ర తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా బంద్ పాటించాలని కోరారు.
మిన్నంటిన నిరసనలు
తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ జిల్లా, విజయవాడ నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మైలవరంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తిరువూరులో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని నందిగామలో వైఎస్సార్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. గుడివాడలో పాజిటివ్ థింకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డులోని చింతలకాల్వ వద్ద సమైక్యాంధ్ర చిత్రపటానికి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
విభజనకు కారకులైన కేంద్రప్రభుత్వం, సోనియాగాంధీలను రాక్షస వేషంలో చిత్రీకరించి చెత్తకుప్ప వద్ద పెట్టారు. దానిపై ప్రజలు ఉమ్మి వేస్తూ నిరసన తెలిపారు. వీరులపాడు మండలం గూడెంమాధవరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కాటేపల్లి నాగేశ్వరరావు చేపట్టిన 48 గంటల ఆమరణ నిరాహార మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర విభజనకు నిరసనగా కలిదిండి మండలంలోని ఆరుతెగలపాడు, కలిదిండి జెడ్పీ పాఠశాలలు, వివేకానంద పాఠశాలల విద్యార్థులు రహదారులపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కలిదిండి సెంటరులో యూపిఏ, బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేసి సోనియా డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. జేఏసీ నేత పల్లపాటి కృష్ణ జాతీయ రహదారిపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పామర్రులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కంకిపాడు సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. జేఏసీ నేతలు నాలుగురోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ అనుచరులు రాఘవయ్యపార్కు వద్ద సోనియాగాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే దిష్టిబొమ్మలను దహనం చేశారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త గౌతమ్‌రెడ్డి అనుచరులు నిరసన ప్రదర్శన చేశారు. జేఏసీ నేతలు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు నిర్వహించారు. సోనియాకు పట్టిన విభజన పిచ్చి వదలాలంటూ వేపమండలతో వినూత్న నిరసన వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో బెంజిసర్కిల్ వద్ద టైర్లు తగలబెట్టి నిరసన వ్యక్తంచేశారు.