టీ.బిల్లుపై వ్యూహం మార్చుకున్నకాంగ్రెస్
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ వ్యూహం మార్చుకుంది. టీ. బిల్లుపై ఏర్పడిన ఉత్కంఠకు తెరదించే ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. దాంతో లోక్సభలోనే తెలంగాణ బిల్లును నేరుగా ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు కసరత్తు చేస్తోంది. తెలంగాణ బిల్లులో ఆర్థిక అంశాలు ఉండటంతో మొదట లోక్సభలోనే బిల్లును పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అయితే బిల్లును లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
కాగా 'కాన్సాలిడేటెడ్ ఫండ్'కు సంబంధించిన ప్రస్తావన ఉండటంతో.... పునర్విభజన బిల్లును ద్రవ్య బిల్లుగా రాజ్యసభ భావిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లు ఏదైనా తొలుత లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. దీంతో విభజన బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడం కుదరదని స్పష్టమైంది. అయితే ప్రభుత్వంలోని కొందరూ రాష్ట్ర విభజన బిల్లు ద్రవ్యబిల్లు కాదని వాదిస్తున్నారు. ఈ క్రమంలో న్యాయ సలహా కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏది ఏమైనా బిల్లు ఎప్పుడూ ప్రవేశపెట్టాలన్నది నేడు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం లోక్‌సభ వ్యవహారాల కమిటీ సమావేశమవుతోంది. లోక్‌సభలోనే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తే మరోసారి రాష్ట్రపతి సిఫార్సు అవసరమవుతుంది. మొత్తానికి రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్రం తీవ్ర గందరగోళంలో ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది.