ఉపాధి కల్పనే | Employment | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనే

Published Fri, Jun 6 2014 2:30 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Employment

సాక్షి, అనంతపురం : అనంతపురం నగరానికి చెందిన నవీన్ 2003లో ఎంసీఏ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో దరఖాస్తులు చేశాడు. అయినా ఉద్యోగం రాలేదు. 1996లోనే జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ కార్యాలయం నుంచి ఇంత వరకు ఒక్క లేఖ కూడా అందలేదు.
 
 చేసేది లేక నగరంలోనే ఓ కంప్యూటర్ సెంటర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఒక్క నవీన్ మాత్రమే కాదు.. జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక చాలా మంది యువతీ యువకులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం ముక్కలు కావడం, ఉద్యోగాల కొరత వంటి సమస్యలు వారిని నిరుత్సాహంలోకి నెడుతున్నాయి. జిల్లాలో 18 లక్షల మంది యువతీ యువకులు ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రతియేటా వివిధ కోర్సులు పూర్తి చేసి బయటకు వస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది.
 
 జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 2008 నుంచి 2014 ఏప్రిల్ వరకు 54,412 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ ఆరేళ్లలో ఆ కార్యాలయం నుంచి 310 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన లేఖలు అందాయి. వాస్తవానికి ప్రభుత్వమే జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తోంది.
 
 ఈ విధానంలోనూ ఉపాధి కల్పన కార్యాలయం సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. ఆ కార్యాలయం ద్వారా ఇప్పటి వరకు 810 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించడం ఇందుకు నిదర్శనం. వివిధ కోర్సులు పూర్తి చేసిన వారి పేర్ల నమోదు, కార్డుల అందజేత, రెన్యూవల్స్‌కే ఉపాధి కల్పన కార్యాలయం పరిమితమైంది. నమోదు చేసుకున్న వారికి సీనియారిటీ ప్రకారం ఎలాంటి ఉద్యోగావకాశాలూ చూపలేకపోతోంది. కార్యాలయంలోనే అటెండర్, వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వోద్యోగాలు ఎటూ కల్పించలేకపోతున్నా.. కనీసం ఫలానా చోట ఉద్యోగాలున్నాయని తెలియజేయడంలోనూ విఫలమవుతోంది.
 
 దీంతో నిరుద్యోగ యువతీ యువకులు కనీసం రాజీవ్ యువ కిరణాల పథకం కిందైనా ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశతో అటువైపు క్యూ కడుతున్నారు. జిల్లాలో ఈ పథకం కింద 78,320  మంది పేర్లు నమోదు చేసుకోవడమే ఇందుకు తార్కాణం. రూ.వేలకు వేలు డబ్బులు పోసి ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యాకోర్సులు పూర్తి చేసిన వారికి సైతం ఉద్యోగాలు దొరకడం లేదు. ఒకప్పుడు డిగ్రీ, పీజీలతో పాటు పదోతరగతి పాసైన వారికి కూడా హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభించేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానిక కంపెనీలలో ఉద్యోగాలు స్థానికులకే అంటూ అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
 
 దీనివల్ల కరువు జిల్లా అయిన అనంతపురం నుంచి నిరుద్యోగ యువత అక్కడికి వెళ్లడానికి సాహసించడం లేదు. జిల్లాలోని తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం, రాయదుర్గం, అనంతపురం ప్రాం తాల్లో బండల పరిశ్రమలు, సిమెంటు ఫ్యాక్టరీలు, మిల్లులు వంటి భారీ, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో  20 వేల మంది తాత్కాలికంగా ఉపాధి పొందుతున్నారు. మిగిలిన వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. జిల్లాకు విమానాశ్రయం, ఐటీ  పార్కులు, భారీ పరిశ్రమలు వస్తాయని యువత ఆశిస్తున్నా, అది సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వమైనా చొరవ తీసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని యువత కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement