ఉపాధి కల్పన
కార్యరూపం దాల్చని వందరోజుల ఉపాధి పని
ఉస్సూరంటూ వలస బాట
విశాఖపట్నం జిల్లాలో ఉపాధి పనులు మందగిస్తున్నాయి. వంద రోజుల పని కల్పన కలగా మారుతోంది. ఉపాధికి వెళ్త్తే చేతి నిండా కూలి దక్కుతుందన్న నమ్మకం లేదు. బోలెడు పని దినాలు కల్పిస్తున్నా పది శాతం మందికి కూడా వంద రోజుల పనిదొరకడం లేదు. దీంతో కూలీలు వలస బాటపడుతున్నారు. జిల్లాలో 5.98 లక్షల జాబ్‌కార్డులుండగా,వాటి పరిధిలో 13.56 లక్షల కూలీలు న్నారు.యాక్టివ్‌జాబ్‌కార్డులు 3.44 లక్షలుంటే దాంట్లో క్రమం తప్పకుండా పనులకు వచ్చే కూలీలు 6.52 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2015-16లో అక్టోబర్ నెలాఖరు నాటికి కోటి 74 లక్షల పనిదినాలు కల్పించాల్సిఉండగా ఇప్పటివరకు కోటి 57 లక్షల పనిదినాలు కల్పించారు.
జిల్లాలో ఈ ఏడాది ఒక కూలీ సరాసరిన రూ.129.43లకు మించి దక్కలేదు. జాబ్‌కార్డు కలిగిన కుటుంబానికి సరాసరిన 53.48 రోజులు మాత్రమే పని కల్పించగలిగారు. వందరోజుల పనిదినాలు దక్కింది 35,361 మందికి మాత్రమే. వేతనాలు, మెటీరియల్ రూపంలో ఇప్పటి వరకు రూ. 250.25 కోట్లు ఖర్చుచేశారు. గతేడాది ఇదేసమయానికి కోటి 98లక్షల 74వేల పని దినాలు కల్పించారు. వందరోజుల పని కల్పన కూడా కూలీలకు కలగానేమారుతోంది. గత ఆర్ధిక సంవత్సరంలో 60,744 మందికి వంద రోజులు పని కల్పిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 35,361మందికి మాత్రమే కల్పించారు. కుటుంబానికి 2012-13లో 70.78 రోజుల పని .. 2013-14లో 65.31 రోజుల పని కల్పించారు. గత ఆర్ధిక సంవత్సరంలో 64.61 రోజులు.. ఈ ఏడాది ఇప్పటి వరకు 53 రోజులు మాత్రమే పని కల్పించారు. గతేడాదితో పోలిస్తే పనులు వేగం తగ్గిన మాట వాస్తమేనని, గడువున్నందున లక్ష్యానికి మించి పనులు కల్పిస్తామని డ్వామా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.