ఉపాధి పనులు కల్పించండి
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: జిల్లా వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టి. షడ్రక్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కార్మిక కర్షక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 8.50లక్షల జాబ్ కార్డులు ఉంటే 50వేల మందికి కూడా ఉపాధి పనులు చూపించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనులు చేస్తే వేతనం త్వరగా రాదనే భావన కూలీల్లో ఉందన్నారు. గత డిసెంబరు నుంచి ఇప్పటి వరకు చేసిన పనుల బిల్లులు రూ.20కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
వీటిని సకాలంలో చెల్లించకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బేతంచెర్ల కో ఆర్డినేటర్ రూ.15లక్షల డ్రా చేసుకొని స్వాహా చేసి, ఉద్యోగానికి రాజీనామా చేశారని ఆరోపించారు. అయినప్పటికీ డ్వామా పీడీ మౌనంగా ఉండడం విచారకరమన్నారు. అనంతరం ఆసంఘం జిల్లా ప్రధాక కార్యదర్శి ఎం. నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 23 మంది ఉపాధి కూలీలు వడదెబ్బకు మృతి చెందారని, ముందస్తుగా మెడికల్ కిట్లు, టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరిగాయని వెల్లడిచారు. ఈ సమస్యలపై ఈనెల 26వ తేదిన అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు.