సాక్షి, అమరావతి: ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లేదా బ్యాలెట్ ద్వారా నిర్వహించడం పరిపాటి. కానీ, సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను మాత్రం తనకు నచ్చినట్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంప్రదింపులు, చేతులెత్తడం ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఇరిగేషన్ మేనేజ్‌మెంట్ యాక్ట్–1997ను ప్రభుత్వం ఇటీవల సవరించింది. ఈ వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోతే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు. బ్యాలెట్ ద్వారా నిర్వహించిన ఎన్నికలను కూడా రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం కట్టబెట్టింది. తద్వారా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రమే సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో గెలుపొందేలా చట్టాన్ని రూపొందించినట్లు స్పష్టమవుతోంది.
సాగునీటి వినియోగదారుల సంఘాలకు జూన్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని జలవనరుల శాఖను ఆదేశించింది. రాష్ట్రంలో 10,312 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. చిన్న నీటిపారుదల విభాగం పరిధిలో 4,134 సంఘాలు, భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో 6,178 సంఘాలు ఉన్నాయి. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఒక్కో సంఘం పరిధిలో 12 ప్రాదేశిక నియోజకవర్గాలు, చిన్న నీటిపారుదల విభాగం కింద ఒక్కో సంఘం పరిధిలో 6 దాకా ప్రాదేశిక నియోజకవర్గాలు ఉండొచ్చని ప్రభుత్వం నిబంధన విధించింది.
సంఘాల పునర్విభజన
రాష్ట్రంలో చిన్న నీటిపారుదల విభాగం పరిధిలో 5,441 చెరువులు ఉన్నాయి. పంచాయతీరాజ్ విభాగం పరిధిలోని 35,576 చెరువులను ఇటీవల చిన్న నీటిపారుదల విభాగం పరిధిలోకి మార్చారు. ఒక్కో చెరువుకు ఒక్కో సాగునీటి వినియోగదారుల సంఘం కాకుండా గొలుసుకట్టు చెరువులతోనూ, పరిసర ప్రాంతాల్లోని ఐదారు చెరువులతో కలిపిఒక సంఘాన్ని ఏర్పాటు చేసేలా పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో సంఘం పరిధిలో 5,000 ఎకరాల ఆయకట్టుకు మించకుండా చెరువులను ఒక గొడుగు కిందకు తేవాలని పేర్కొంది. వీటి పరిధిలో ఆరు ప్రాదేశిక నియోజకవర్గాలను గుర్తించి, వినియోగదారుల సంఖ్యను తేల్చాలని తెలిపింది. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఉన్న సాగునీటి వినియోగదారుల సంఘాల పరిధిని ఇదే తరహాలో నిర్ణయించి సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజాస్వామ్యానికి పాతర
సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని తగ్గించాలనే సాకుతో ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం పాతరేసింది. సంప్రదింపులు.. చేతులెత్తడం ద్వారానే ఎన్నికల ప్రక్రియను ముగించి, టీడీపీ మద్దతుదారులే గెలిచేలా ఎత్తు వేసింది. ప్రభుత్వం తాజాగా చేసిన చట్టం ప్రకారం సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆ సంఘం పరిధిలోని సభ్యులను ఒకచోట సమావేశపరుస్తారు. సంప్రదింపుల ద్వారా ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేలా సభ్యులతో చర్చిస్తారు. ఏకాభిప్రాయం కుదరకపోతే సభ్యులు చేతులెత్తడం ద్వారా ఎన్నికను నిర్వహిస్తారు. అప్పటికీ ఏకాభిప్రాయం రాకపోతే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో కూడా తమకు అనుకూలురైన వారు గెలుపొందకపోతే ఆ ఎన్నికను కలెక్టర్ ద్వారా రద్దు చేయించే అవకాశం ఉంది. తమ పార్టీ మద్దతుదారులను సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులుగా నామినేట్ చేయించుకోవడానికి అధికార పార్టీ పన్నాగం పన్నుతోంది.
Comments
Please login to add a commentAdd a comment