voting machines
-
ప్రతిపక్షాలను కూడా రిమోట్‌తో కంట్రోల్ చేసే సిస్టమ్ ఏదైనా ఉంటే చూడండీ!
ప్రతిపక్షాలను కూడా రిమోట్‌తో కంట్రోల్ చేసే సిస్టమ్ ఏదైనా ఉంటే చూడండీ! -
ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు
లక్నో: వాస్తవానికి స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన ఈవీఎంలను తరలిస్తున్న ఓ ట్రక్కును వారణాసి వద్ద అడ్డగించినట్లు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ తెలిపారు. మరో రెండు ట్రక్కులు తప్పించుకున్నాయన్నారు. అధికార బీజేపీ ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వారణాసి ఎన్నికల అధికారులు మాత్రం.. ఆ ఈవీఎంలు శిక్షణ కోసం వాడేవని స్పష్టంచేశారు. అఖిలేశ్ ఆరోపణలపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖండించారు. ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునేందుకు వీలుగా అభ్యర్ధులందరికీ ఈసీ తగు ఏర్పాట్లు చేసిందన్నారు. (చదవండి: మేయరైన ఆటోవాలా) -
నగరానికి చేరిన ఓటింగ్ యంత్రాలు
ఆరిలోవ(విశాఖతూర్పు): ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లా అధికారులు ఓటింగ్ యంత్రాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు బెంగుళూరు నుంచి ఈవీ ఎంలు, వీవీ ప్యాట్ యూనిట్లు, కంట్రోల్ యూని ట్లను తీసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇక్కడికి 12,967 ఈవీఎంలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఆదివారం బెంగుళూరు నుంచి 10 కంటైనర్లలో 10,180 వీవీ ప్యాట్ యూ నిట్లను తీసుకొచ్చారు. రూరల్ తహసీల్దారు కార్యాలయం పక్కనే ఉన్న ఓటింగ్ యంత్రాల భద్రతా గొడౌన్లో భద్రపరిచారు. వాటిని ఇక్కడ రూరల్ డిప్యూటీ తహసీల్దారు రవిశంకర్, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో పోలీస్ బందోబస్తు నడుమ కంటైనర్ల నుంచి గొడౌన్‌కు తరలించారు. వీటితో పాటు ఇక్కడ మరో 10,130 కంట్రోల్ యూనిట్స్ తీసుకొచ్చామని డీటీ తెలిపారు. వీటిని భద్రపరిచే గొడౌన్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. -
ఎన్నికలకు ఈసీ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పుంజుకుంటున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి సమకూర్చడంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వేగం పెంచారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లవసా బుధవారం రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై ముఖ్య ఎన్నికల అధికారులు రజత్‌కుమార్, ఆర్.పి.సిసోడియాలతో చర్చించారు. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)కు వెళ్లి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఓటింగ్ రసీదు యంత్రాల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్‌జైన్, రాష్ట్ర అధికారులతో ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నిక కాదు ఎంపికే!
సాక్షి, అమరావతి: ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లేదా బ్యాలెట్ ద్వారా నిర్వహించడం పరిపాటి. కానీ, సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను మాత్రం తనకు నచ్చినట్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంప్రదింపులు, చేతులెత్తడం ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ యాక్ట్–1997ను ప్రభుత్వం ఇటీవల సవరించింది. ఈ వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోతే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు. బ్యాలెట్ ద్వారా నిర్వహించిన ఎన్నికలను కూడా రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం కట్టబెట్టింది. తద్వారా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రమే సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో గెలుపొందేలా చట్టాన్ని రూపొందించినట్లు స్పష్టమవుతోంది. సాగునీటి వినియోగదారుల సంఘాలకు జూన్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని జలవనరుల శాఖను ఆదేశించింది. రాష్ట్రంలో 10,312 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. చిన్న నీటిపారుదల విభాగం పరిధిలో 4,134 సంఘాలు, భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో 6,178 సంఘాలు ఉన్నాయి. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఒక్కో సంఘం పరిధిలో 12 ప్రాదేశిక నియోజకవర్గాలు, చిన్న నీటిపారుదల విభాగం కింద ఒక్కో సంఘం పరిధిలో 6 దాకా ప్రాదేశిక నియోజకవర్గాలు ఉండొచ్చని ప్రభుత్వం నిబంధన విధించింది. సంఘాల పునర్విభజన రాష్ట్రంలో చిన్న నీటిపారుదల విభాగం పరిధిలో 5,441 చెరువులు ఉన్నాయి. పంచాయతీరాజ్ విభాగం పరిధిలోని 35,576 చెరువులను ఇటీవల చిన్న నీటిపారుదల విభాగం పరిధిలోకి మార్చారు. ఒక్కో చెరువుకు ఒక్కో సాగునీటి వినియోగదారుల సంఘం కాకుండా గొలుసుకట్టు చెరువులతోనూ, పరిసర ప్రాంతాల్లోని ఐదారు చెరువులతో కలిపిఒక సంఘాన్ని ఏర్పాటు చేసేలా పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో సంఘం పరిధిలో 5,000 ఎకరాల ఆయకట్టుకు మించకుండా చెరువులను ఒక గొడుగు కిందకు తేవాలని పేర్కొంది. వీటి పరిధిలో ఆరు ప్రాదేశిక నియోజకవర్గాలను గుర్తించి, వినియోగదారుల సంఖ్యను తేల్చాలని తెలిపింది. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఉన్న సాగునీటి వినియోగదారుల సంఘాల పరిధిని ఇదే తరహాలో నిర్ణయించి సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాస్వామ్యానికి పాతర సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని తగ్గించాలనే సాకుతో ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం పాతరేసింది. సంప్రదింపులు.. చేతులెత్తడం ద్వారానే ఎన్నికల ప్రక్రియను ముగించి, టీడీపీ మద్దతుదారులే గెలిచేలా ఎత్తు వేసింది. ప్రభుత్వం తాజాగా చేసిన చట్టం ప్రకారం సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆ సంఘం పరిధిలోని సభ్యులను ఒకచోట సమావేశపరుస్తారు. సంప్రదింపుల ద్వారా ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేలా సభ్యులతో చర్చిస్తారు. ఏకాభిప్రాయం కుదరకపోతే సభ్యులు చేతులెత్తడం ద్వారా ఎన్నికను నిర్వహిస్తారు. అప్పటికీ ఏకాభిప్రాయం రాకపోతే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో కూడా తమకు అనుకూలురైన వారు గెలుపొందకపోతే ఆ ఎన్నికను కలెక్టర్ ద్వారా రద్దు చేయించే అవకాశం ఉంది. తమ పార్టీ మద్దతుదారులను సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులుగా నామినేట్ చేయించుకోవడానికి అధికార పార్టీ పన్నాగం పన్నుతోంది. -
‘ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలాగో నేను చెప్తా’
న్యూఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ట్యాంపరింగ్ విషయాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. తాను కూడా ఒక ఐఐటీ ఇంజినీర్‌ను అని, ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో తానొక పది మార్గాలు చెబుతానని అన్నారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడిన ఆయన ఈవీఎంల ట్యాంపరింగ్ చేయొచ్చని ఒక ఉదాహరణ కూడా ఎత్తి చూపారు. పుణెలో ఓ వ్యక్తి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగాడని, ఆ వ్యక్తికి ఒక్క ఓటు కూడా పడినట్లు చూపించలేదని, దాని ప్రకారం కనీసం అతడి ఓటు అయినా చూపించాలి కదా.. మరీ ఆ ఓటు ఏమైనట్లు అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఎందుకు ఈవీఎంల అంశాన్ని ప్రశ్నించరాదు అని అన్నారు. ఇలాంటివి చూస్తూ కళ్లు మూసుకోలేమని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఢిల్లీలో ఆమ్‌ఆద్మీపార్టీని ఓడించడమే లక్ష్యం అని, అందుకోసం తమ పార్టీని చీల్చడంతోపాటు ఎలాంటి చర్యలకైనా దిగుతుందని విమర్శించారు. -
పుర సమరం నేడే
పోలింగ్ సమయం ఉ. 7 నుంచి సా.5 గం.ల వరకు సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ పోరు తుది దశకు చేరింది. ఓట్ల మిషన్లతో ఎన్నికల సంఘం.. నోట్ల కట్టలతో నేతలు ఎవరికి వారుగా సిద్ధమయ్యారు. మరోవైపు ఆదివారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా రాత్రికి రాత్రే నోట్లు పంచి ఓట్లు కొల్లగొట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. పోటీని బట్టి ఓటుకు రూ. 500 నుంచి రూ. 3 వేల వరకు పంచుతున్నట్టు సమాచారం. గజ్వేల్‌లో నాలుగు ఓట్లున్న కుటుంబానికి బంగారు నాణెం కూడా పంచుతున్నట్లు వినికిడి. ఈసీ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రీయంగా మద్యం సరఫరా చాలినంత లేకపోవడంతో అభ్యర్థులు కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించి పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే పోలింగ్ ప్రక్రియకు 192 పోలింగ్ కేంద్రాలు, 192 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో మొత్తం 145 వార్డులకు గాను 845 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1,91,212 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో వైపు ఎలాంటి అక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3,287 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ స్లిప్‌ల పంపిణీ వివిధ మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రా ల వద్ద ఓటర్లకు అవసరమైన ఓటర్ స్లిప్‌లను అందజేసేందుకు మున్సిపల్ సిబ్బంది ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కాగా ఇదివరకే మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్‌లను జారీ చేశారని, దీనివల్ల పోలింగ్ కేంద్రంలో కాలయాపన లేకుండా ఓటరు జాబితాలో ఓటర్ను వెంటనే గుర్తించే ఆవకాశం ఉందన్నారు. ఓటర్లు విధిగా ఓటర్ స్లిప్‌తో పాటు ఎన్నికల గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డుతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఒక అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్‌ను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఓటర్లు తప్ప ఇతరులకు అనుమతించేది లేదని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించేది లేదన్నారు. ఓటరు తీర్పుపైనే ఆశలు.. పోలింగ్ మరికొద్ది సమయంలోప్రారంభం కానుండటంతో అభ్యర్థులంతా ఓటరు తీర్పుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇన్నిరోజులు చేసిన ప్రచారం కలిసివస్తుందో, లేదోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తమ గుర్తు పలానా అంటూ అభ్యర్థులు ఓటర్లకు చూపిస్తూ.. తమకే ఓటు వేయాలని ఒట్టేయించుకుంటున్నారు. చివరి సమయం కీలకం కానుండటంతో పోలింగ్ కేంద్రాల సమీపంలో తమక గుర్తు గుర్తుంచుకోవాలని చెప్పించేందుకు యువతను పోగేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గీత దాటకుండా.. పోలింగ్ కేంద్రానికి దూరంలో అభ్యర్థుల వారీగా.. కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ‘గుర్తు.. గుర్తుంచుకోండి..’ అంటూ చివరి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఓటరన్న ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తేలనుంది.