ఆక్రమణకు తెగబడ్డ ‘తమ్ముళ్లు’
తూరంగి (కాకినాడ రూరల్) :దేవాదాయ భూముల ఆక్రమణకు తెలుగుతమ్ముళ్లు తెగబడ్డారు. ప్రజాప్రతినిధుల అండ చూసుకుని దేవాదాయ భూములను ఆక్రమించి లీజుకు బేరం పెట్టేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ మండలం తూరంగిలో తురంగేశ్వరస్వామి ఆలయానికి పగడాలపేట సమీపంలో సర్వేనంబరు 207/3లో 27.15 ఎకరాల భూమి ఉంది. ఇందులో పది ఎకరాల భూమిని ఏడాదికి రూ.60 వేలు ఇచ్చేందుకు చిర్ల సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తికి దేవాదాయ శాఖాధికారులు కౌలుకు ఇచ్చారు. ఈ భూములకు అనుకుని ఉన్న మరో ఐదెకరాల భూమిని మరో వ్యక్తి ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసుకున్నాడు. ఇది తెలిసినా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. ఇదే అలుసుగా తీసుకున్న గ్రామస్తులు మరో మూడెకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం ఆక్రమించి, పట్టాలివ్వాలని గత నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు పట్టించుకోకపోవడంతో ఇదే అదనుగా భావించిన అధికార పార్టీకి చెందిన కొందరు ఖాళీగా ఉన్న ఆలయ భూములపై కన్నేశారు. దీంతో పగడాలపేటను ఆనుకుని ఉన్న ఐదెకరాల భూమిని ఆక్రమించి, ఓ వ్యక్తికి రొయ్యల చెరువులు తవ్వుకునేందుకు లక్ష రూపాయలకు లీజుకు ఇచ్చేశారు. దీనిలో గ్రామ పెద్దలకు రూ.30 వేలు ఇచ్చేందుకు, మిగిలిన రూ.70 వేలు స్థలాక్రమణలో భాగస్వామ్యం ఉన్న 20 మంది పెద్దలు పంచుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తురంగేశ్వరస్వామి ఆలయ భూమి ఐదెకరాలను లీజుకు ఇచ్చేశారు. లీజుకు తీసుకున్న వ్యక్తులు భూమిని రొయ్యల చెరువులుగా మార్చేందుకు ప్రయత్నించడంతో ఆదివారం తురంగేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి గుత్తుల త్రిమూర్తులు.. ఉత్సవ కమిటీ సభ్యులతో వెళ్లి అడ్డుకున్నారు. దీంతో దేవాదాయ భూమిని ఆక్ర మణదారులుగా ఉన్న గరికిన వేమన, గరికిన అప్పన్న, ఇజ్రాయిల్, చోడిపల్లి కొత్తబాల, మోసా భయ్యన్నతో పాటు 20 మంది వ్యక్తులు అక్కడికి చేరుకుని అధికారులపై తిరగబడ్డారు.
ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఈఓ త్రిమూర్తులు ఆక్ర మణదారులపై ఇంద్రపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎ.మురళీకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దేవాదాయ భూమిలో చెరువు తవ్వకానికి ఉపయోగిస్తున్న పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ భూమిని ఆక్రమించి లీజుకు ఇచ్చినట్లు ఈఓ త్రిమూర్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వేమన, అప్పన్న, ఇజ్రాయిల్, కొత్తబాల, భయ్యన్నను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. తాము దేవాదాయ భూమిని వదిలేస్తామని, ఆ భూమిలోకి రామని ఆక్రమణదారులు రాతపూర్వకంగా ఇచ్చారని ఈఓ చెప్పారు. ఆక్రమణను అడ్డుకున్న వారిలో ఉత్సవ కమిటీ సభ్యులు డి.భానుమతిభగవాన్, నున్న దుర్గాప్రసాద్, మేడిశెట్టి శేషగిరి, కర్రి గణపతిరెడ్డి, తాతారావు తదితరులు ఉన్నారు.