రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ మృతి
Published Sun, Sep 22 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
పిడుగురాళ్ల , న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న ఎడ్లబండిని ఢీకొట్టిన ప్రమాదంలో అనంతపురం తాడిపత్రికి చెందిన ఇంజనీర్ మృతిచెందగా.. రాజమండ్రికి చెందిన మరో ఇంజనీర్ తీవ్రగాయాలపాలయ్యారు. సహోద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రికి చెందిన రవిప్రకాశ్ (40), రాజమండ్రికి చెందిన సత్యనారాయణ స్థానికంగా జరుగుతున్న నాలుగ లైన్ల రోడ్డుపనులకు కాంట్రాక్టరుగా ఉన్న కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. శనివారం దాచేపల్లిలో జరుగుతున్న రోడ్డు పనులను పర్యవేక్షించేందుకు క్యాంపునకు వెళ్లిన ఇద్దరు ఇంజినీర్లు రాత్రి 7 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై తిరుగుప్రయాణమయ్యారు.
అంజనీపురం సమీపంలోని తార్‌ప్లాంటు వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న ఎడ్లబండిని వీరి ద్విచక్రవాహనం అదుపు తప్పి ఢీకొట్టింది. ప్రమాదంలో రవిప్రకాశ్ స్పృహ తప్పగా, సత్యనారాయణకు గాయాలయ్యాయి. వెంటనే పిడుగురాళ్లలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా రవిప్రకాశ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయపడిన సత్యనారాయణ చికిత్స పొందుతున్నారు. మృతుడు రవిప్రకాశ్ సెల్‌ఫోన్ ఆధారంగా అతని సహోద్యోగులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement