ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
ఏలూరు (వన్‌టౌన్) : ద్వారకాతిరుమల దర్శనానికి బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా లారీ ఢీకొనడంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. విద్యార్థిని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడకు చెందిన మల్లిరెడ్డి సునీత విజయవాడ హాస్టల్ ఉంటూ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో ఏడాది చదువుతోంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన లంక భరత్‌కుమార్ కూడా విజయవాడలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. ఈ నేపథ్యంలో ఇద్దరూ విజయవాడ నుంచి సోమవారం స్నేహితురాలితో బజాజ్ ఎవెంజర్ ద్విచక్రవాహనంపై ద్వారకాతిరుమల వెళ్లారు.
తిరిగి విజయవాడ వెళుతుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామం దగ్గరలోకి వచ్చేసరికి లారీ వీరిని ఢీకొట్టి ఆపకుండా వెళిపోయింది. ఈ ప్రమాదంలో భరత్‌కుమార్ తలపై నుంచి లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న సునీత స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహనం క్షతగాత్రురాలిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. సునీత తండ్రి కాకినాడలో వ్యవసాయం చేస్తుండగా, భరత్‌కుమార్ తండ్రి ఆంధ్రాబ్యాంకు అసిస్టెంట్ మేనేజరుగా కరీంనగర్‌లో పనిచేస్తున్నారు. పెదవేగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.