విద్యార్థిని బలిగొన్న అతివేగం | engineering student killed in car race | Sakshi
Sakshi News home page

విద్యార్థిని బలిగొన్న అతివేగం

Published Mon, Oct 27 2014 3:24 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

విద్యార్థిని బలిగొన్న అతివేగం - Sakshi

విద్యార్థిని బలిగొన్న అతివేగం

ఏపీలో రోడ్డు ప్రమాదం
ఒకరి మృతి, ఎనిమిది మందికి గాయాలు
కార్ల రేసింగ్ వల్లే దుర్ఘటన
రేసింగ్‌ల వెనుక టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు!

 
యడ్లపాడు (గుంటూరు): వేగంగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి అంతే వేగంతో వెళ్తున్న మరో కారును ఢీకొన్న సంఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు రెండు కార్లలో ఆదివారం చిలకలూరిపేటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. అత్యంత వేగంగా రెండు కార్లు పక్కపక్కనే వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి రెండో కారును ఢీ కొంది. దీంతో అవి పల్టీలు కొడుతూ వెళ్లి ఒకటి హైవే అంచున బోర్లాపడగా, రెండోది పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. కార్లు పల్టీలు కొట్టే సమయంలోనే అందులో ఉన్న నాగేంద్ర(22) జాతీయ రహదారిపై పడి మృతిచెందాడు.

మిగిలిన వారిలో నలుగురికి తీవ్ర గాయాలవగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, విజయవాడకు చెందిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థ ఒక కారును, కొప్పుల శివరాం మరో కారు నడుపుతున్నారని ఎస్‌ఐ ఉమామహేశ్వర్ విలేకరులకు తెలిపారు. ప్రమాదానికి కారకుడైన సిద్ధార్థ పరారీలో ఉన్నాడని చెప్పారు. మరోవైపు ఇది కచ్చితంగా కార్ల రేస్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడకు చెందిన శాసనసభ్యుడి కుమారుడు ఈ రేస్ నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనలో ఆయన కూడా గాయపడినప్పటికీ పోలీసులు రహస్యంగా ఆయన్ను విజయవాడకు తరలించి చికిత్స చేయిస్తున్నారని సమాచారం.

పోలీసుల అత్యుత్సాహం

ఈ ఘటనను ప్రమాదంగానే చిత్రీకరించి, దీనికి కారకుడైన టీడీపీ ఎమ్మెల్యే కమారుడిని తప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురిని మాత్రమే అంబులెన్సులో ఎక్కించి మిగిలిన ఇద్దరినీ పోలీసు జీపులో తీసుకెళ్లారు. వారిలో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే కుమారుడని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement