గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో ‘ఊరంతాషాక్’ ఘటనపై విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సంఘటనకు సంబంధించి నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో పరిశీలన జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం గ్రామాన్ని ఏపీసీపీడీసీఎల్- సీజీఎమ్ పీరయ్య సందర్శించారు. షాక్‌కు కారణమైన ఎస్సీ కాలనీ సమీపంలోని సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్తింగ్ సక్రమంగా ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. ఎర్తింగ్ పైప్ బిగింపులో ప్రమాణాలు పాటించారా? ఎంత లోతులో పాతారు? ఓల్టేజీ సక్రమంగా వస్తుందా? అనే విషయాలపై ఆరాతీశారు.
అంతకుముందు సీజీఎం విద్యుత్‌షాక్‌కు గురైన బుడిగె రాజు, చంద్రయ్య ఇళ్ల వద్ద విద్యుదాఘాతం ఎలా సంభవించిందనే విషయాన్ని తెలుసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఉన్న లోపాల వల్లే షాక్ సంభవించిందని గ్రామస్తులు సీజీఎంకు వివరించారు. గతంలో ఇదే ట్రాన్స్‌ఫార్మర్ వల్ల షాక్ చోటుచేసుకొని సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ మంద శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. అయినప్పటీకీ ట్రాన్‌సఫార్మర్‌ను మార్చకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తనకు ముందుగా షాక్ తగలడంతో విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చానని, అయినా వారు అప్రమత్తం కాకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని తిప్పారం యాదయ్య అనే వ్యక్తి వివరించారు.
విచారణలో లోపాలు బయటపడతాయి
అక్కారంలో విద్యుత్ షాక్ సంభవించడానికి గల కారణాలు తమ విచారణలో బయటపడతాయని సీజీఎం పీరయ్య తెలిపారు. అక్కారంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో కొక్కాలతో కరెంట్ వాడటం, ఇళ్లల్లో వైరింగ్ సక్రమంగా లేకపోవడం కూడా షాక్‌కు మరో కారణమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అన్నీ కోణాల్లో సమగ్రంగా విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. సీజీఎం వెంట విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాములు, డీఈ యాదయ్య, ఏడీఈ జగదీష్, ఏఈ అనిల్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
‘ఊరంతా షాక్’పై విచారణ
Published Sun, Dec 29 2013 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement
Advertisement