ఎపీఐఐసీ భూమిపై గ(పె)ద్దలు!
సాక్షిప్రతినిధి, కడప: పరిశ్రమల కోసం పుచ్చుకున్న భూమిలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. కారు చౌకగా దక్కించుకున్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాట్లు వెలుస్తున్నాయి. సుమారు రూ.లక్షకు పొందిన ఎకరా భూమిని రూ.2కోట్లకు పైబడి సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తం 15.50 ఎకరాలున్న రూ.30కోట్లు విలువైన భూమి గ(పె)ద్దల పాలైపోతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు. అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీ తెరపై ఉండడంతో నిబంధనలు తప్పుకున్నారుు. అధికార యంత్రాంగం కపట నిద్రలో ఉండిపోయింది.
వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట పరిధిలో ఏపీఐఐసీ ద్వారా 1978లో డిటెర్జెంట్స్ ఇండియా లిమిటెడ్(సబ్బుల తయారీ పరిశ్రమ)కు 15.50 ఎకరాలు భూమిని రూ.18లక్షలకు అప్పగించారు. ఆ భూమిలో పదేళ్లు పాటు పరిశ్రమను నిర్వహించిన డిటెర్జెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆ తర్వాత పరిశ్రమను మూసేసింది. అయితే ఆ భూమిని స్థానికంగా ఉన్న మరో సంస్థ కొనుగోలు చేసింది.
ఓ మాజీ ఎంపీ తన బినామి సంస్థ ద్వారా ఆ భూమిని దక్కించుకున్నారు. ఏపీఐఐసీ ద్వారా పొందిన భూమిని సొంతంగా క్రయవిక్రయాలు చేయడం చట్టసమ్మతం కాదు. ఏపీఐఐసీ అనుమతి పొందాకే విక్రయాలు, కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సదరు మాజీ ఎంపీ బినామీ సంస్థ ఇవేవి పాటించకుండా డిటెర్జెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసింది. మాజీ ఎంపీ పరపతి ఉపయోగించి రిజిస్ట్రేషన్ సైతం పొందినట్లు సమాచారం.
మాజీ ఎంపీ రంగప్రవేశంతో.....
ఏపీఐఐసీ ద్వారా పొందిన భూమిలో పరిశ్రమలే నెలకొల్పాలని నిబంధనలు వివరిస్తున్నాయి. ఒక పరిశ్రమకు కేటాయించిన భూమిలో ఇంకో పరిశ్రమ పెట్టుకోవాలన్నా ఏపీఐఐసీ అనుమతి తప్పనిసరి. అయితే మాజీ ఎంపీ ఒకరు రంగ ప్రవేశం చేయడంతో నిబంధనలు అడ్డు నిలవలేకపోయాయి. ప్రస్తుతం ఆభూమిని చదును చేసి రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మలుచుకుంటున్నారు.
ఎలాంటి అనుమతులు లేకున్నా, అటు ఏపీఐఐసీ కానీ, ఇటు రెవిన్యూ యంత్రాంగం కానీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం రోడ్డుకు అందుబాటులో ఉన్న ఈ భూమి ఎకరం రూ.5కోట్లు పలుకుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
మొత్తంగా అయితే ఎకరా రూ.2 కోట్లతో కొనుగోలుకు సిద్ధం అంటూ బేరాలు కూడా ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. డేంజర్ జోన్ కారణంగా ఇంటి స్థలం కోసం ఆప్రాంతం యమ డిమాండ్ ఏర్పడడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒకప్పుడు ఏపీఐఐసీ ద్వారా రూ.18 లక్షలుకు పొందిన ఆభూమి ప్రస్తుతం రూ.30 కోట్లుకు పైబడి విలువ చేసే పరిస్థితులు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. యధేచ్ఛగా ప్లాటు వేస్తూ విక్రయాలు చేస్తున్నా ఏపీఐఐసీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, రెవిన్యూ యంత్రాంగం సైతం చూస్తుండిపోవడం మినహా, అడ్డగించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా తిరుపతి జోనల్ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ నిత్యం ఇదే రహదారి మీదుగా వెళ్లే ఏపీఐఐసీ జడ్‌ఎంకు తెలియకపోవడం విశేషం. ఈవిషయమై ఆయనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. పెపైచ్చు నాలుగు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం విశేషం.