
కర్నూలు ,నూనెపల్లె : కుటుంబ నియంత్రణకు చేపడుతున్న ఆపరేషన్లకు అన్నీ అడ్డంకులే. శస్త్రచికిత్స చేసేందుకు సరైన వసతులు లేకపోవడంతో రోజుకు ఆరు మాత్రమే చేస్తూ మిగిలినవి వాయిదా వేస్తూ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. కావాల్సిన పరికరాల అవసరతను గురించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా స్పందించే నాథుడే లేరని వైద్యులు వాపోతున్నారు. నంద్యాల జిల్లాస్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలోని పీపీ (పోస్ట్‌పార్ట్) యూనిట్‌లో కుని (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు చేస్తారు. ఇందుకోసం నంద్యాలతోపాటు గోస్పాడు, మహానంది, పాణ్యం, బండిఆత్మకూరు, గడివేముల, వెలుగోడు మండలాల పరిధిలోని గర్భిణులు ఇక్కడికి వస్తారు. వైద్యుల కొరత, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో అందరికీ ఆపరేషన్లు చేయలేక చాలా మందిని వెనక్కు పంపడం పరిపాటిగా మారింది.
సిబ్బంది కొరత
పీపీ యూనిట్‌లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరే విధులు నిర్వహిస్తున్నారు. పీపీ యూనిట్‌కు బాలింతలు, గర్భిణులు వస్తారు. ఆపరేషన్లు చేసేందుకు, రోగులను పరీక్షించేందుకు ఇద్దరు చొప్పున ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉండడంతో ఇబ్బందులు ఎదువుతున్నాయి. గర్భిణులను పరీక్షించే సమయంలో ఆపరేషన్లకు వెళ్లాల్సి వస్తుండడంతో సేవలు కొరవడతున్నాయి. దీంతో వారంలో మూడు రోజులు (మంగళ, బుధ, గురు, శనివారాల్లో) బాలింతలకు పరీక్ష, ఇమ్యూనైజేషన్ చేస్తుండడం, మిగిలిన రోజులు (సోమ, మంగళ, శుక్రవారాలు) మాత్రమే ఆరు చొప్పున ఆపరేషన్లు చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
అసౌకర్యంగా ఆపరేషన్ థియేటర్
కు.ని ఆపరేషన్లు చేసే ఆపరేషన్ థియేటర్‌లో అన్నీ సమస్యలే. ఆపరేషన్‌కు ఉపయోగించే ఆర్టర్ ఫోర్‌సెస్, స్ట్రీట్, నీడిల్ హాల్డర్స్, కరూడ్ ఆర్డరీ వంటి పరికరాలు అందుబాటులు లేకుండా పోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరికరాలు కూడా ఆరు ఆపరేషన్ల వరకే ఉపయోగపడుతాయని మిగిలిన తర్వాత ఆపరేషన్ చేసేందుకు వస్తే స్ట్రెరిలైజ్ కాకపోవడంతో ఆపరేషన్లు నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ థియేటర్‌లో వర్షం కురిస్తే చెమ్మ దిగి నీటి మడుగులా మారుతోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏసీ కూడా సరిగ్గా పనిచేయడం లేదు.
నివేదికలు పంపినా ప్రయోజనం లేదు
ఆసుపత్రిలోని వసతులపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. ఇప్పటిదాకా ఎలాంటివి రాలేదు. ప్రతిపాదనలకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. మెరుగైన వసతులు కల్పించి మరో వైద్యుడిని నియమిస్తే సకాలంలో ఆపరేషన్లు చేస్తాం. – డాక్టర్ డి.ఎన్.మూర్తి, పీపీ యూనిట్
పరీక్షలు చేయించి మళ్లీ రమ్మన్నారు
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చా. పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఆపరేషన్‌కు తేదీ ఇస్తామని, ఆ ప్రకారం రావాలని చెప్పారు. ఆపరేషన్ లేదని చెప్పడంతో ఇంటికి వెళుతున్నాం. – లావణ్య, తమడపల్లె
విద్యుత్ వసతి లేదు
ఆపరేషన్ థియేటర్‌లోకి వెళితే చీకటిగా ఉంటుంది. చీక ట్లో ఎక్కడికి వెళుతున్నామో తెలియడం లేదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా సక్రమంగా లేదు. చీకటిగా ఉంటే ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. – భారతి, వీసీ కాలనీ
ఉక్కపోతకు అల్లాడాల్సిందే
థియేటర్‌లో ఏసీ లేకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బ ంది పడ్డాం. ఆపరేషన్‌కు తీసుకెళ్లినప్పుడు గాలి ఆడకపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. థి యేటర్‌లోకి వెళ్లాలంటే భయంగా ఉంది. – మహాలక్ష్మి, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment