చిట్టీపాటల పేరుతో ఘరానా మోసం | escape with Rs. 30 lakhs | Sakshi
Sakshi News home page

చిట్టీపాటల పేరుతో ఘరానా మోసం

Published Tue, Feb 28 2017 10:49 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

escape with Rs. 30 lakhs

► రూ.30 లక్షలతో పరారైన నిర్వాహకురాలు
► విలపిస్తున్న 70 మంది బాధితులు
► చర్యలు తీసుకోవాలని వినతి


కత్తివారిపాలెం (పిట్టలవానిపాలెం): రూపాయి, రూపాయి కూడబెట్టుకుని చిట్టీలు కడితే గూడు ఏర్పాటు చేసుకోవడానికో లేక పిల్లల పెళ్లిళ్లకో ఉపయోగపడతాయని ఆశ పడ్డారు. కానీ చిట్టీ నిర్వాహకురాలు వారిని నిలువునా ముంచింది. రూ.30 లక్షలతో ఉడాయించింది. ఈ ఘరానా మోసం పిట్టలవానిపాలెం మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు పంచాయతీ పరిధిలోని కత్తివారిపాలెం గ్రామానికి చెందిన తెల్లాకుల సోనియారాణి భర్త పాగమల్లేశ్వరరావుతో కలిసి గత ఏడేళ్లుగా నివాసం ఉంటుంది. భర్త ఆటో నడుపుతాడు. సోనియారాణి మాత్రం గ్రామంలో చిట్టీలు నిర్వహిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఒక్కో చిట్టీ రూ.లక్ష చొప్పున ఐదు చిట్టీలు నిర్వహిస్తుంది.

ఒక్కో పాటలో 20 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 100 మంది సభ్యులతో పాటలు నిర్వహిస్తూ ఉంది. ఒక్కొక్కరు 20 నెలల పాటు నెలకు రూ. 5వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని పాటలు 10 నుంచి 15 నెలలు పూర్తి కాగా మరికొన్ని మాత్రం 5 నుంచి 10 పాటలు పూర్తయ్యాయి. పూర్తయిన పాటలన్నీ నిర్వాహకురాలు సోనియారాణి దక్కించుకుంది. కొందరు బాధితులు పాటలు చెల్లించడంతోపాటు అధిక వడ్డీలు ఇస్తామని ఆశ పెట్టడంతో వేలకు వేలు అప్పుగా కూడా ఇచ్చారు. మొత్తం మీద పాటల తాలూకా రూ.25 లక్షలు, వడ్డీకి తీసుకున్న తాలూకా రూ.5 లక్షలకు పైబడి మొత్తం రూ.30 లక్షల మేర వసూలు చేసుకుని సోనియారాణి కన్పించకుండా పరారైయింది. ఉన్నతాధికారులు విషయాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.


మాకు ఎలాంటి సంబంధం లేదు..
సోనియారాణి పుట్టిల్లు కత్తివారిపాలెం, అత్తవారిల్లు కృష్ణా జిల్లాలోని మొవ్వగా చెబుతున్నారు. అయితే పెళ్లి అయిన నాటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్నారు. ఈమె గత వారం రోజులుగా కన్పించడం లేదు. ఫోన్‌ పనిచేయడం లేదు.ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులను బాధితులు, సంఘపెద్దలతో కలిసి అడుగగా మాకు ఎలాంటి సంబంధంలేదనీ, ఆమె ఎక్కడ ఉందో మీరే తీసుకురండని సమాధానం చెప్పినట్లు బాధితులు వాపోయారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బాధితులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని చందోలు పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement