rs. 30 lakhs
-
చిట్టీపాటల పేరుతో ఘరానా మోసం
► రూ.30 లక్షలతో పరారైన నిర్వాహకురాలు ► విలపిస్తున్న 70 మంది బాధితులు ► చర్యలు తీసుకోవాలని వినతి కత్తివారిపాలెం (పిట్టలవానిపాలెం): రూపాయి, రూపాయి కూడబెట్టుకుని చిట్టీలు కడితే గూడు ఏర్పాటు చేసుకోవడానికో లేక పిల్లల పెళ్లిళ్లకో ఉపయోగపడతాయని ఆశ పడ్డారు. కానీ చిట్టీ నిర్వాహకురాలు వారిని నిలువునా ముంచింది. రూ.30 లక్షలతో ఉడాయించింది. ఈ ఘరానా మోసం పిట్టలవానిపాలెం మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు పంచాయతీ పరిధిలోని కత్తివారిపాలెం గ్రామానికి చెందిన తెల్లాకుల సోనియారాణి భర్త పాగమల్లేశ్వరరావుతో కలిసి గత ఏడేళ్లుగా నివాసం ఉంటుంది. భర్త ఆటో నడుపుతాడు. సోనియారాణి మాత్రం గ్రామంలో చిట్టీలు నిర్వహిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఒక్కో చిట్టీ రూ.లక్ష చొప్పున ఐదు చిట్టీలు నిర్వహిస్తుంది. ఒక్కో పాటలో 20 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 100 మంది సభ్యులతో పాటలు నిర్వహిస్తూ ఉంది. ఒక్కొక్కరు 20 నెలల పాటు నెలకు రూ. 5వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని పాటలు 10 నుంచి 15 నెలలు పూర్తి కాగా మరికొన్ని మాత్రం 5 నుంచి 10 పాటలు పూర్తయ్యాయి. పూర్తయిన పాటలన్నీ నిర్వాహకురాలు సోనియారాణి దక్కించుకుంది. కొందరు బాధితులు పాటలు చెల్లించడంతోపాటు అధిక వడ్డీలు ఇస్తామని ఆశ పెట్టడంతో వేలకు వేలు అప్పుగా కూడా ఇచ్చారు. మొత్తం మీద పాటల తాలూకా రూ.25 లక్షలు, వడ్డీకి తీసుకున్న తాలూకా రూ.5 లక్షలకు పైబడి మొత్తం రూ.30 లక్షల మేర వసూలు చేసుకుని సోనియారాణి కన్పించకుండా పరారైయింది. ఉన్నతాధికారులు విషయాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మాకు ఎలాంటి సంబంధం లేదు.. సోనియారాణి పుట్టిల్లు కత్తివారిపాలెం, అత్తవారిల్లు కృష్ణా జిల్లాలోని మొవ్వగా చెబుతున్నారు. అయితే పెళ్లి అయిన నాటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్నారు. ఈమె గత వారం రోజులుగా కన్పించడం లేదు. ఫోన్ పనిచేయడం లేదు.ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులను బాధితులు, సంఘపెద్దలతో కలిసి అడుగగా మాకు ఎలాంటి సంబంధంలేదనీ, ఆమె ఎక్కడ ఉందో మీరే తీసుకురండని సమాధానం చెప్పినట్లు బాధితులు వాపోయారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బాధితులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని చందోలు పోలీసులు తెలిపారు. -
చిట్టీల పేరుతో రూ.30 లక్షలకు కుచ్చుటోపీ
గుత్తి (గుంతకల్లు) : గుత్తి ఆర్ఎస్లో చిట్టీలు (చీటీలు) నిర్వహిస్తున్న ఓ మహిళ రూ.30లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించింది. బాధితులు తెలిపిన మేరకు... ఆర్ఎస్లోని రవూఫ్ కాంపౌండ్ కాలనీలో తాహేరా అనే మహిళ నివాసముంటోంది. ఈమె పదేళ్లగా చిట్టీలు వేసేది. ఈ క్రమంలో దాదాపు 30 మంది మహిళలు ఆమె వద్ద రూ. 30 లక్షల దాకా చిట్టీలు వేశారు. నెల రోజుల క్రితం తాహేరా చిట్టీ డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయింది. నెల రోజులుగా ఆమె ఆచూకీ కోసం బాధిత మహిళలు గాలించినా లభ్యం కాలేదు. దీంతో బాధితులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. బాధిత మహిళలు పద్మావతి, శకుంతల, విజయలక్ష్మి, రంగమ్మ, నారాయణమ్మ, కృష్ణవేణి తదితరులు పోలీసుస్టేషన్‌కు తరలివెళ్లి ఎస్ఐ చాంద్‌బాషాకు చిట్టీల నిర్వాహకురాలు తాహేరాపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్ఐ చాంద్‌బాషా, ఏఎస్ఐ ప్రభుదాస్‌లను వేడుకున్నారు. ఎస్ఐ, ఏఎస్ఐలు మాట్లాడుతూ చిట్టీలు కట్టాలంటే నిర్వాహకులకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ రెండూ ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ లేనివారితో చిట్టీలు కడితే కేసు నమోదు చేయడం కుదరదన్నారు. అయితే మానవత్వంతో ఫిర్యాదు స్వీకరిస్తున్నామని, డబ్బుతో ఉడాయించిన తాహేరా ఆచూకీ కనుక్కుంటామని చెప్పారు.