గుత్తి (గుంతకల్లు) : గుత్తి ఆర్‌ఎస్‌లో చిట్టీలు (చీటీలు) నిర్వహిస్తున్న ఓ మహిళ రూ.30లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించింది. బాధితులు తెలిపిన మేరకు... ఆర్‌ఎస్‌లోని రవూఫ్ కాంపౌండ్ కాలనీలో తాహేరా అనే మహిళ నివాసముంటోంది. ఈమె పదేళ్లగా చిట్టీలు వేసేది. ఈ క్రమంలో దాదాపు 30 మంది మహిళలు ఆమె వద్ద రూ. 30 లక్షల దాకా చిట్టీలు వేశారు. నెల రోజుల క్రితం తాహేరా చిట్టీ డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయింది. నెల రోజులుగా ఆమె ఆచూకీ కోసం బాధిత మహిళలు గాలించినా లభ్యం కాలేదు. దీంతో బాధితులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు.
బాధిత మహిళలు పద్మావతి, శకుంతల, విజయలక్ష్మి, రంగమ్మ, నారాయణమ్మ, కృష్ణవేణి తదితరులు పోలీసుస్టేషన్‌కు తరలివెళ్లి ఎస్‌ఐ చాంద్‌బాషాకు చిట్టీల నిర్వాహకురాలు తాహేరాపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్‌ఐ చాంద్‌బాషా, ఏఎస్‌ఐ ప్రభుదాస్‌లను వేడుకున్నారు. ఎస్‌ఐ, ఏఎస్‌ఐలు మాట్లాడుతూ చిట్టీలు కట్టాలంటే నిర్వాహకులకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ రెండూ ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ లేనివారితో చిట్టీలు కడితే కేసు నమోదు చేయడం కుదరదన్నారు. అయితే మానవత్వంతో ఫిర్యాదు స్వీకరిస్తున్నామని, డబ్బుతో ఉడాయించిన తాహేరా ఆచూకీ కనుక్కుంటామని చెప్పారు.
చిట్టీల పేరుతో రూ.30 లక్షలకు కుచ్చుటోపీ
Published Tue, Feb 7 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
Advertisement