పాలనపై గవర్నర్ ముద్ర
* పెట్రోల్ బంకుల బంద్ గంటల వ్యవధిలో విరమణ
* నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారి జాబితా పంపాలని శాఖలకు ఆదేశాలు
* పలు కీలక నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారి రాజీనామాలకూ ఆదేశం!
* విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల నియామకాలపైనా గవర్నర్ సమీక్ష!
* సీఎంగా కిరణ్ నిర్ణయాల వివరాలు కోరిన గవర్నర్ కార్యాలయం
* ఏ తేదీ నుంచి నిర్ణయాలు పంపాలో తెలియజేయాలని కోరిన సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనపై గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ముద్ర రెండో రోజు నుంచే స్పష్టంగా కనిపించింది. అనూహ్యంగా మొదలైన పెట్రోల్ బంక్‌ల బంద్‌ను గంటల వ్యవధిలో ఉపసంహరింపజేశారు. తూనికలు, కొలతల అధికారుల దాడులకు నిరసనగా పెట్రోల్ బంకులను ఆదివారం సాయంత్రం నుంచి మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం వాహనదారులు పెట్రోల్ లేక నానా అవస్థలు పడ్డారు.
నగరంలో పౌరసరఫరాల శాఖ నిర్వహించే పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీశారు. దీంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, తూనికలు, కొలతల డెరైక్టర్ జనరల్‌తో మాట్లాడారు. సాయంత్రానికల్లా పెట్రోల్ బంక్‌లు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలను గవర్నర్ ఇచ్చారు. దీంతో పెట్రోల్ బంక్‌ల యజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. గంటల వ్యవధిలోనే బంక్‌ల బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి.
నామినేటెడ్ పదవుల్లోని వారిపై దృష్టి
ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేట్ చేసిన పదవుల్లోని వారిపైనా గవర్నర్ దృష్టి సారించారు. రాజ్యాంగ, చట్టబద్ధత కాని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను పంపాల్సిందిగా గవర్నర్ కార్యాలయం నుంచి అన్ని శాఖలకు సోమవారం నోట్ అందింది. దీంతో అన్ని శాఖలు తమ పరిధిలోని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను సిద్ధంచేసి పంపే పనిలో పడ్డాయి. ఈ దిశలోనే రాజీవ్ యుువకిరణాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె.సి.రెడ్డి సోమవారం గవర్నర్‌ను కలసి రాజీనామా చేశారు.
అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఆర్‌టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, 20 సూత్రాల పథకం అమలు చైర్మన్ తులసిరెడ్డిలతో పాటు ఇటీవల సీఎం పలు దేవాలయాలకు నియమించిన పాలక మండళ్ల చైర్మన్లు, ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారినీ రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయం ఆదేశించనున్నట్లు సమాచారం. తుడా, వీజీడీఎంఏ చైర్మన్ , పాలకమండళ్లను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించనున్నట్లు చెప్తున్నారు.
విశ్వవిద్యాలయాల పాలక మండళ్లపై నివేదిక
విశ్వవిద్యాలయాల పాలక మండళ్లపై నివేదికను కూడా పంపాల్సిందిగా గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కోరారు. విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రిలు తమకు కావాల్సిన వారి పేర్లను ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పాలక మండళ్లపై నివేదికను గవర్నర్ కార్యాలయానికి సీఎస్ పంపించనున్నారు.
కిరణ్ నిర్ణయాలపై సీఎస్‌ను వివరాలు కోరిన గవర్నర్
ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాకు ముందు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించాలని గవర్నర్ నరసింహన్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే పాఠకులకు తెలియజేసింది. సీఎంగా కిరణ్ తీసుకున్న నిర్ణయాలపై వివరాలను పంపాల్సిందిగా సోమవారం గవర్నర్ కార్యాలయం నుంచి సీఎస్‌కు నోట్ అందింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలో ఆ నోట్‌లో పేర్కొనలేదు. దీంతో.. సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ తేదీ నుంచి తీసుకున్న నిర్ణయాల వివరాలను పంపాలో తెలియజేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయాన్ని సీఎస్ కోరారు.
మంత్రుల పేషీల్లో సిబ్బంది 7లోగా వెళ్లిపోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పాలన నేపథ్యంలో సచివాలయంలోని మంత్రుల పేషీల్లోని వ్యక్తిగత సిబ్బంది ఈ నెల 7వ తేదీలోగా ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు లేకపోవడంతో వారి వ్యక్తిగత సిబ్బంది తమ సొంత శాఖలకు వెళ్లిపోవాల్సి ఉంది. అయితే మంత్రులకు కల్పించిన సౌకర్యాలు, వసతులను తిరిగి సాధారణ పరిపాలన శాఖకు అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను 7వ తేదీలోగా పూర్తి చేసి సిబ్బంది సొంత శాఖలకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.