kc reddy
-
ట్రిపుల్ ఐటీలో విడతల వారీగా ఆఫ్‌లైన్ తరగతులు
వేంపల్లె (వైఎస్సార్ కడప జిల్లా): ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు విడతల వారీగా ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ నేపథ్యంలో విద్యార్థులకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతుల కోసం ఆప్షన్ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ (ఈ4) విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి (సోమవారం) పీ2 (ఒంగోలు, ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే సుమారు 1,100 మంది విద్యార్థులు ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు చేరుకున్నారన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి పీ1 విద్యార్థులకు, 19వ తేదీ నుంచి ఈ3 విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. మార్చి 2వ తేదీలోపు ఈ1, ఈ2 విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు బహిష్కరిస్తున్నట్లు మెయిల్స్ పెట్టారని, అందుకు స్పందించి త్వరలోనే వారికి ఆఫ్‌లైన్ తరగతుల కోసం షెడ్యూల్ ఇచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీలో ఖాళీల భర్తీ నూజివీడు (ఆగిరిపల్లి): కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొంది, విద్యార్థులు చేరకపోవడంతో ఖాళీ అయిన 66 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేసినట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంగోలు క్యాంపస్‌లో 34, శ్రీకాకుళం క్యాంపస్‌లో 32 సీట్లకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ పూర్తయిందన్నారు. ఖాళీల కౌన్సెలింగ్ ప్రక్రియను ఆచార్య జి.వి.ఆర్.శ్రీనివాసరావు, అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య గోపాలరాజు పర్యవేక్షించారు. -
నేడు ఆర్జీయూకేటీ సెట్
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మొత్తం 75,283 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. పరీక్ష నిర్వహణకు ఏపీలో 467, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఫలితాలను అక్టోబర్ 4న మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల 10వ తరగతి పరీక్షలు జరగనందున.. ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దరఖాస్తు చేసిన మొత్తం అభ్యర్థుల్లో 40,555 మంది బాలురు, 34,728 మంది బాలికలున్నారని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు.. వచ్చే ఏడాదిలోగా నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనేక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి.. మంచి ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. 2008–14 బ్యాచ్‌కు చెందిన జి.విద్యాధరి సివిల్ సర్వీసెస్‌లో 211వ ర్యాంకు, అలాగే 2012వ బ్యాచ్‌కు చెందిన చీమల శివగోపాల్‌రెడ్డి 263వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఇడుపులపాయ, నూజివీడులో సోలార్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటివల్ల ఏడాదికి రూ.కోటికి పైగా నిధులు ఆదా అవుతున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలో కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే అనలాగ్ డివైజెస్ కంపెనీ ఈ ఏడాది 50 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేసుకుందని చెప్పారు. మెంటార్లను రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదని.. 4 ట్రిపుల్ ఐటీల్లో 400 వరకు లెక్చరర్ పోస్టులున్నాయని, వారిని ఆ పోస్టుల్లో నియమిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్జీయూకేటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ కె.సామ్రాజ్యలక్ష్మి, సెట్ కన్వీనర్ డి.హరినారాయణ, నూజివీడు డైరెక్టర్ జి.వి.ఆర్.శ్రీనివాసరావు సెట్ కో–కనీ్వనర్ ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు, ఏఓ భానుకిరణ్, డీన్ అకడమిక్స్ దువ్వూరి శ్రావణి పాల్గొన్నారు. -
‘జార్ఖండ్ అలా చేస్తే.. ఏపీ మాత్రం అందుకు విరుద్ధం’
సాక్షి, గుంటూరు : అభివృద్ధి పేరిట అడ్డగోలుగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని జనచైతన్య వేదిక సదస్సులో పాల్గొన్న వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయానికి, ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని సదస్సులో పాల్గొన్న ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. విచ్చలవిడి ఖర్చులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి రూ. 30 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపారని, కానీ ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిదులను ఏపీ పాలకులు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు. జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర నిధులను విద్య, వైద్యానికి ఖర్చు చేయగా.. ఏపీలో అందుకు విరుద్ధంగా పప్పు బెల్లాలకు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేశారని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఆదాయమో శ్వేత పత్రం విడుదల చేయాలి.. అప్పుచేయటం తప్పుకాదని, కానీ ఎందుకు అప్పులు చేస్తున్నామనే విషయాన్ని పాలకులు గుర్తించాలని సదస్సులో పాల్గొన్న ఆర్థికవేత్త కేసీ రెడ్డి అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ స్థితిగతులపై చర్చించడం తప్పుకాదని అన్నారు. 11.5 శాతం వృద్ధిరేటు సాధించామని చెబుతున్న పాలకులు ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో చెప్పాలని, ఏ రంగం మీద ఎంత ఆదాయం వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలని స్పష్టం చేశారు. -
పాలనపై గవర్నర్ ముద్ర
* పెట్రోల్ బంకుల బంద్ గంటల వ్యవధిలో విరమణ * నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారి జాబితా పంపాలని శాఖలకు ఆదేశాలు * పలు కీలక నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారి రాజీనామాలకూ ఆదేశం! * విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల నియామకాలపైనా గవర్నర్ సమీక్ష! * సీఎంగా కిరణ్ నిర్ణయాల వివరాలు కోరిన గవర్నర్ కార్యాలయం * ఏ తేదీ నుంచి నిర్ణయాలు పంపాలో తెలియజేయాలని కోరిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనపై గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ముద్ర రెండో రోజు నుంచే స్పష్టంగా కనిపించింది. అనూహ్యంగా మొదలైన పెట్రోల్ బంక్‌ల బంద్‌ను గంటల వ్యవధిలో ఉపసంహరింపజేశారు. తూనికలు, కొలతల అధికారుల దాడులకు నిరసనగా పెట్రోల్ బంకులను ఆదివారం సాయంత్రం నుంచి మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం వాహనదారులు పెట్రోల్ లేక నానా అవస్థలు పడ్డారు. నగరంలో పౌరసరఫరాల శాఖ నిర్వహించే పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీశారు. దీంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, తూనికలు, కొలతల డెరైక్టర్ జనరల్‌తో మాట్లాడారు. సాయంత్రానికల్లా పెట్రోల్ బంక్‌లు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలను గవర్నర్ ఇచ్చారు. దీంతో పెట్రోల్ బంక్‌ల యజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. గంటల వ్యవధిలోనే బంక్‌ల బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. నామినేటెడ్ పదవుల్లోని వారిపై దృష్టి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేట్ చేసిన పదవుల్లోని వారిపైనా గవర్నర్ దృష్టి సారించారు. రాజ్యాంగ, చట్టబద్ధత కాని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను పంపాల్సిందిగా గవర్నర్ కార్యాలయం నుంచి అన్ని శాఖలకు సోమవారం నోట్ అందింది. దీంతో అన్ని శాఖలు తమ పరిధిలోని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను సిద్ధంచేసి పంపే పనిలో పడ్డాయి. ఈ దిశలోనే రాజీవ్ యుువకిరణాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె.సి.రెడ్డి సోమవారం గవర్నర్‌ను కలసి రాజీనామా చేశారు. అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, 20 సూత్రాల పథకం అమలు చైర్మన్ తులసిరెడ్డిలతో పాటు ఇటీవల సీఎం పలు దేవాలయాలకు నియమించిన పాలక మండళ్ల చైర్మన్లు, ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారినీ రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయం ఆదేశించనున్నట్లు సమాచారం. తుడా, వీజీడీఎంఏ చైర్మన్ , పాలకమండళ్లను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించనున్నట్లు చెప్తున్నారు. విశ్వవిద్యాలయాల పాలక మండళ్లపై నివేదిక విశ్వవిద్యాలయాల పాలక మండళ్లపై నివేదికను కూడా పంపాల్సిందిగా గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కోరారు. విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రిలు తమకు కావాల్సిన వారి పేర్లను ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పాలక మండళ్లపై నివేదికను గవర్నర్ కార్యాలయానికి సీఎస్ పంపించనున్నారు. కిరణ్ నిర్ణయాలపై సీఎస్‌ను వివరాలు కోరిన గవర్నర్ ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాకు ముందు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించాలని గవర్నర్ నరసింహన్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే పాఠకులకు తెలియజేసింది. సీఎంగా కిరణ్ తీసుకున్న నిర్ణయాలపై వివరాలను పంపాల్సిందిగా సోమవారం గవర్నర్ కార్యాలయం నుంచి సీఎస్‌కు నోట్ అందింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలో ఆ నోట్లో పేర్కొనలేదు. దీంతో.. సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ తేదీ నుంచి తీసుకున్న నిర్ణయాల వివరాలను పంపాలో తెలియజేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయాన్ని సీఎస్ కోరారు. మంత్రుల పేషీల్లో సిబ్బంది 7లోగా వెళ్లిపోవాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పాలన నేపథ్యంలో సచివాలయంలోని మంత్రుల పేషీల్లోని వ్యక్తిగత సిబ్బంది ఈ నెల 7వ తేదీలోగా ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు లేకపోవడంతో వారి వ్యక్తిగత సిబ్బంది తమ సొంత శాఖలకు వెళ్లిపోవాల్సి ఉంది. అయితే మంత్రులకు కల్పించిన సౌకర్యాలు, వసతులను తిరిగి సాధారణ పరిపాలన శాఖకు అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను 7వ తేదీలోగా పూర్తి చేసి సిబ్బంది సొంత శాఖలకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. -
నేడు కేసీ రెడ్డి రాక
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : రాజీవ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ మిషన్ చైర్మన్ కేసీ రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 10.05 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 11.10 గంటలకు కాకినాడ చేరుకుంటారు. 11.30 గంటలకు పీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ మోడల్ విత్ జెన్‌ప్యాక్ట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ జేఎన్టీయులో ఏర్పాటు చేసిన ఫినిషింగ్ స్కూల్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వర్క్‌షాపులో పాల్గొం టారు. మధ్యాహ్నం 1.30 గంటలకు డీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 3.30 గంటలకు రాజమండ్రి చేరుకుని 4 గంటలకు రాజమండ్రి కాయర్ బోర్డులో వికలాంగులకు ఏర్పాటు చేసిన శిక్షణను ఆయన ప్రారంభిస్తారు. 4.30 గంటలకు రాజమండ్రి మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద స్వయం డ్రైవింగ్‌పై శిక్షణను ప్రారంభిస్తారు. 5 గంటలకు బొమ్మూరు ఎన్ఏసీ సెంటర్లో శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడతారు. రాత్రికి రాజమండ్రిలో బస చేసి, బుధవారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. -
గ్రామీణుల చెంతకు నైపుణ్యం
=రీమ్యాప్ చైర్మన్ కేసీ రెడ్డి =న్యాక్‌లో ప్రారంభమైన స్కిల్స్-2013 అంతర్జాతీయ సదస్సు సాక్షి, సిటీబ్యూరో: ‘‘గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలను, వారి జీవనోపాధిని మెరుగు పరిచేందుకు నైపుణ్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. వృత్తిపరమైన నైపుణ్యాల కోసం ఎంతోమంది పట్టణాలకు వలస వస్తున్నారు. అలాకాకుండా.. నైపుణ్యాలను వారి చెంతకు చేరుస్తూ.. దేశ నిర్మాణం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని’’అని రాజీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్(రీమ్యాప్) చైర్మన్ కె.సి.రెడ్డి పిలుపునిచ్చారు. ‘లైఫ్ స్కిల్స్ అండ్ లైవ్లీ హుడ్ స్కిల్స్-చాలెంజెస్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్’అంశంపై రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ (రీడ్స్) ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘స్కిల్స్-2013’అంతర్జాతీయ సదస్సు గురువారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)లో ప్రారంభమైంది. సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సేవా సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అమెరికా.. తదితర దేశాలకు చెం దిన ప్రతినిధులు పెద ్ద సంఖ్యలో హాజరయ్యారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె.సి.రెడ్డి మాట్లాడుతూ.. మరో పదేళ్లలో భారత దేశం ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తి వంతమైన దేశంగా మారనుందన్నారు. దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉండడమే కారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు డిమాండ్ పెరిగిందని, ఈ దిశగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ అన్ని వర్గాల ప్రజల్లో స్కిల్స్‌ను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృ షి చేస్తున్నాయన్నారు. దేశ నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు, పరిశ్రమలు భాగస్వాములు కావాలన్నా రు. ఇండస్ట్రీ ఆశిస్తున్న మేరకు వివిధ స్థాయిల్లో యువతకు రాజీవ్ యువకిరణాల కార్యక్రమం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను అందిస్తున్నామన్నారు. నైపుణ్యాలను పెంపొందించి వారికి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ప్రజల జీవితాలను, జీవనోపాధిని పెంపొందించడంలో ఎదురవుతున్న సవాళ్లు అంశంపై రీడ్స్ సంస్థ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. సదస్సు ద్వా రా ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు మేథావులు సరైన పరిష్కార మార్గాలు అన్వేషించాలని కోరారు. రీడ్స్ సంస్థ చైర్మన్ విక్రమ్ మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం దశాబ్దాకాలం గా విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వలన ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో గణనీయమైన ప్రగతి కనిపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్పై కూడా ఆయా వర్గాలకు అవగాహన పెరిగిందని చెప్పారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజల్లో నైపుణ్యాలను పెంపొందించే దిశగా రీడ్స్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన పే ర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సెషన్లో.. స్కిల్లింగ్ 500 మిలియన్ అంశం పై వక్తల ఉపన్యాసాలను సభికులను ఆకట్టుకున్నాయి. ‘స్కిల్ ట్రైనింగ్ ఫర్ ఎంపవర్మెంట్ ఏ స్టడీ ఆన్ విమెన్ ఇన్ అగ్రికల్చర్’ అంశంపై విద్యావేత్త డాక్టర్ జయా ఇందిరేశన్,‘స్కిల్ డెవలప్మెంట్- సీఎస్ఆర్ ఇనిషియేటివ్స్’ అంశంపై అమృతా యూనివర్సిటీ ప్రొఫెసర్ భవానీ, ‘ఎవాల్యుయేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ అర్బన్ పూర్’ ఆంశంపై సీఐఎస్సీ డీన్ ప్రొఫెసర్ రమణ ఉపన్యసించారు. కార్యక్రమంలో కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్ చందర్ శర్మ, ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ కెయిలీ బెల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ ముఖోపాధ్యాయ్, ఎన్ఎస్డీసీ ప్రిన్సిపాల్ రాజన్ చౌదరి, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శశిభూషణ్ కుమార్, ప్రొఫెసర్ సదానంద,రవిరెడ్డి పాల్గొన్నారు. -
రాజీవ్ యువకిరణాల్లో భేష్
కలెృక్టరేట్ (మచిలీపట్నం),న్యూస్‌లైన్ : ఉపాధి అవకాశాలున్న రంగాల్లో యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించాలని రాజీవ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మిషన్ చైర్మన్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం అధికారులతో రాజీవ్ యువకిరణాలు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువకిరణాలు అమల్లో జిల్లా మంచి పురోగతి సాధించిందన్నారు. 40 సంవత్సరాల్లోపు వయస్సున్న నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాజీవ్ యువకిరణాలు కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు కౌన్సెలింగ్ నిర్వహించి వారికి ఆసక్తి గల రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పనకు కృషి చేయాలన్నారు. ఐటీ రంగాల్లో యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో నైపుణ్యం ఉన్న ప్రైవేటు సంస్థల సహకారంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ రాజీవ్ యువకిరణాలు పథకంపై ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువతను గుర్తించి వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు వారి పరిధిలోని నిధులను వినియోగించుకుని ఏయే రంగాల్లో వృతి నైపుణ్యం అభివృద్ధి పరచవచ్చో ఆ దిశగా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు జీ రాజేంద్రప్రసాద్ , డీఆర్వో ఎల్.విజయచందర్, ఉద్యానవనశాఖ ఏడీ సుబానీ, కార్మికశాఖ సహాయ కమిషనర్ శ్రీనివాస్, డీఆర్డీఏ ఏపీడీ జ్యోతి, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.