నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మొత్తం 75,283 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. పరీక్ష నిర్వహణకు ఏపీలో 467, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఫలితాలను అక్టోబర్ 4న మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల 10వ తరగతి పరీక్షలు జరగనందున.. ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దరఖాస్తు చేసిన మొత్తం అభ్యర్థుల్లో 40,555 మంది బాలురు, 34,728 మంది బాలికలున్నారని తెలిపారు.
ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు..
వచ్చే ఏడాదిలోగా నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనేక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి.. మంచి ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. 2008–14 బ్యాచ్‌కు చెందిన జి.విద్యాధరి సివిల్ సర్వీసెస్‌లో 211వ ర్యాంకు, అలాగే 2012వ బ్యాచ్‌కు చెందిన చీమల శివగోపాల్‌రెడ్డి 263వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఇడుపులపాయ, నూజివీడులో సోలార్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటివల్ల ఏడాదికి రూ.కోటికి పైగా నిధులు ఆదా అవుతున్నాయని తెలిపారు.
శ్రీకాకుళంలో కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే అనలాగ్ డివైజెస్ కంపెనీ ఈ ఏడాది 50 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేసుకుందని చెప్పారు. మెంటార్లను రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదని.. 4 ట్రిపుల్ ఐటీల్లో 400 వరకు లెక్చరర్ పోస్టులున్నాయని, వారిని ఆ పోస్టుల్లో నియమిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ కె.సామ్రాజ్యలక్ష్మి, సెట్ కన్వీనర్ డి.హరినారాయణ, నూజివీడు డైరెక్టర్ జి.వి.ఆర్.శ్రీనివాసరావు సెట్ కో–కనీ్వనర్ ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు, ఏఓ భానుకిరణ్, డీన్ అకడమిక్స్ దువ్వూరి శ్రావణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment