సాక్షి, గుంటూరు : అభివృద్ధి పేరిట అడ్డగోలుగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని జనచైతన్య వేదిక సదస్సులో పాల్గొన్న వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయానికి, ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని సదస్సులో పాల్గొన్న ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. విచ్చలవిడి ఖర్చులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి రూ. 30 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపారని, కానీ ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిదులను ఏపీ పాలకులు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు. జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర నిధులను విద్య, వైద్యానికి ఖర్చు చేయగా.. ఏపీలో అందుకు విరుద్ధంగా పప్పు బెల్లాలకు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేశారని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంత ఆదాయమో శ్వేత పత్రం విడుదల చేయాలి..
అప్పుచేయటం తప్పుకాదని, కానీ ఎందుకు అప్పులు చేస్తున్నామనే విషయాన్ని పాలకులు గుర్తించాలని సదస్సులో పాల్గొన్న ఆర్థికవేత్త కేసీ రెడ్డి అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ స్థితిగతులపై చర్చించడం తప్పుకాదని అన్నారు. 11.5 శాతం వృద్ధిరేటు సాధించామని చెబుతున్న పాలకులు ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో చెప్పాలని, ఏ రంగం మీద ఎంత ఆదాయం వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment